దొంగతనం కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-08-04T05:41:35+05:30 IST
దొంగతనం కేసులో నిందితుల అరెస్టు
- 12తులాల బంగారం, రూ.30వేల నగదు రికవరీ
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ శేఖర్‌గౌడ్
తాండూరు, ఆగస్టు 3 : పాత తాండూరులో నెలరోజుల క్రితం జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శేఖర్‌గౌడ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాండూరు పట్టణంలోని పాత తాండూరులో గత నెల 23న జరిగిన దొంగతనం కేసులో బంగారం, డబ్బును పోలీసులు రికవరీ చేయడం జరిగిందన్నారు. మోమిన్గల్లీకి చెందిన సిరాజ్ సంధాని, మీరా సంధానిలు ఒకేదగ్గర నివసముంటున్నారు. గతనెల 22న సిరాజ్ సంధాని వివాహ వేడుక ఉండగా ఇంటికి తాళం వేసి వెళ్లాడు. అదేరోజు రాత్రి వారి ఇంట్లో ఇంటి పక్కన ఫ్లోరింగ్ పనులు చేసే మహ్మద్ ముస్తఫా, పేయింటింగ్ పనులు చేసే మహ్మద్ ఉస్మాన్ అలియాస్ మస్తాన్లు అర్థరాత్రి వారి ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించారు. ఆతర్వాత బీరువా పక్కన ఉన్న తాళంచెవి తీసుకుని బీరువాలో ఉన్న 12 తులాల బంగారు గాజులు, చైన్లు, మంగళసూత్రం, ఆభరణాలతోపాటు రూ.30వేల నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్లో గుంత తవ్వి బంగారు ఆభరణాలు, రూ.25వేల నగదును పూడ్చి, రూ.5వేల తీసుకెళ్లినట్లు తెలిపారు. నిందితులు గుల్బర్గ, ముంబాయి ప్రాంతాలకు పారిపోయారు. చోరీ జరిగిన నాటి నుంచి పోలీసులు అనుమానితులపై దృష్టి సారించారు. ఆ రోజు నుంచి అదృశ్యమైన వారిపై నిఘా ఉంచగా, మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన ముస్తాఫా, మస్తాన్లను బుధవారం ఉదయం పాతి పెట్టిన బంగారం, డబ్బులు తీసుకెనేందుకు ప్రయత్నిస్తుండగా, విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులు దొంగలించిన బంగారు ఆభరణాలు, రూ.25వేల నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్ ఉన్నారు.