ఏబీవీపీ బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

ఏబీవీపీ బంద్‌ విజయవంతం

ఏబీవీపీ బంద్‌ విజయవంతం
పెద్దేముల్‌ : మాట్లాడుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మౌనేశ్వర్‌చారి

  • సర్కారు బడులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్‌కు పిలుపు
  • ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల మూసివేత

 వికారాబాద్‌/ధారూరు/తాండూరు/పెద్దేముల్‌, జూలై 5 : విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ మంగళవారం ఇచ్చిన విద్యా సంస్థల బంద్‌ పిలుపు విజయవంతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం దుస్తులు వెంటనే పంపిణీ చేయాలని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, ఫీజు నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు జిల్లాలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి నోట్‌ పుస్తకాలు, యూనిఫాం, టై, షూస్‌, స్టేషనరీ విక్రయాలు కొనసాగిస్తున్నారని, పాఠశాలల్లో కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. కాగా, ఏబీవీపీ నాయకులు స్కూళ్లను బంద్‌ చేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా కన్వీనర్‌ సతీష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్‌ శక్తుల ఆఘడాలను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని నియంత్రించి, ప్రత్యేక చట్టం అమలు చేస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి జనవరిలో ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయక పోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్‌, సాకేత్‌, గణేష్‌, వంశీ, అమర్నాథ్‌ మహేష్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ధారూరులో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను ఏబీవీపీ నాయకులు బంద్‌ చేయించారు. ఉదయం 11.30 గంటల తర్వాత విద్యార్థులను పాఠశాలలను నుంచి వదిలిపెట్టారు. అదేవిధంగా తాండూరు పట్టణం, పెద్దేముల్‌ మండలంలో ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. పెద్దేముల్‌లో జడ్పీ స్కూళ్లో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేశ్వర్‌చారి మాట్లాడుతూ ప్రభుత్వం సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్‌ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్‌, శివప్రసాద్‌, మహేష్‌, అరుణ్‌, అనిల్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Read more