వాగులో గల్లంతైన వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-04T05:59:48+05:30 IST

వాగులో గల్లంతైన వ్యక్తి మృతి

వాగులో గల్లంతైన వ్యక్తి మృతి

  • టేకులపల్లి ఎర్రకత్వ సమీపంలో అంజయ్య మృతదేహం లభ్యం 

మోమిన్‌పేట్‌, ఆగస్టు 3 : వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన మోమిన్‌పేట మండలం టేకులపల్లి ఎర్రకత్వ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండల పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన రైతు అంజయ్య మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షం కురవడంతో ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యాడు. గ్రామస్తుల సమాచారంతో రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు మంగళవారం రాత్రి వరకూ ఎంత వెతికినా అంజయ్య ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అంజయ్య ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడంతో టేకులపల్లి ఎర్రకత్వా సమీపంలో అంజయ్య(57) మృతదేహాన్ని గుర్తించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అంజయ్య ఆచూకీ కోసం శ్రమించిన గ్రామ యువకులకు అలుగు నుంచి 3 కిలో మీటర్ల దూరంలో అంజయ్య మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహాన్ని మర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించినట్లు ఎస్సై విజయప్రకాశ్‌ తెలిపారు. ఈ ఘటనపై రైతు అంజయ్య కుమారుడు ప్రభాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మోమిన్‌పేట్‌ ఎస్సై విజయప్రకాశ్‌ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దబ్బాని వెంకట్‌, సొసైటీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రయీస్‌, గ్రామ యువకులు పరామర్శించారు. అనంతరం విషయం తెలసుకున్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మన్నె శంకర్‌యాదవ్‌ తదితరులు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Updated Date - 2022-08-04T05:59:48+05:30 IST