అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-12-15T00:14:39+05:30 IST

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తాండూరు మండలం గౌతాపూర్‌ గ్రామ సమీపంలోని రాంచందర్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో బుధవారం జరిగింది.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

హత్య చేశారంటూ మృతుడి బంధువుల ఆరోపణ

కరన్‌కోట్‌ పోలీసుల విచారణ

తాండూరు రూరల్‌, డిసెంబరు 14 : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తాండూరు మండలం గౌతాపూర్‌ గ్రామ సమీపంలోని రాంచందర్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో బుధవారం జరిగింది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా సేడం తాలూకా బటిగీరకే-గేట్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ మోహన్‌ మూడు సంవత్సరాలుగా తాండూరు మండలం గౌతాపూర్‌ గ్రామ శివారులోని రాంచందర్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో కూలీగా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పాలిషింగ్‌ యూనిట్‌ల వద్ద ఉన్నటువంటి వారి గదిలో భార్య రాధికతో కలిసి నిద్రకు ఉపక్రమించాడు. ఈక్రమంలో అతడు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. భార్య గమనించి బంధువులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మోహన్‌ను పాలిషింగ్‌ యూనిట్‌ యజమాని కుమారుడు కొట్టి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నాపరాతి యజమాని రాంచందర్‌ మాత్రం అలాంటిదేమీ చేయలేదని, మోహన్‌ తాగుడుకు బానిసై అనారోగ్యానికి గురయ్యాడని, అందులో భాగంగానే మృతి చెంది ఉండవచ్చని పోలీసులకు తెలిపాడు. అతడిని హత్య చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నాడు. హత్య చేసినట్లు నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమేనని ఆయన తెలిపాడు. సొంత గ్రామం నుంచి వచ్చిన మృతుడి బంధువులు హరి, రవి, బామిని బాయి, దేవిబాయి తదితరులు మాత్రం మోహన్‌ను కావాలనే చంపారని ఆరోపించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన ఎస్‌ఐ మధుసూదనరెడ్డి మృత దేహాన్ని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంచానామా నిర్వహించి తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి విచారిస్తున్నారు.

Updated Date - 2022-12-15T00:14:40+05:30 IST