నూతన కలెక్టరేట్‌ ప్రారంభమెప్పుడో?

ABN , First Publish Date - 2022-08-08T08:05:10+05:30 IST

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం, పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్‌లకు నూతన సమీకృత భవనాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన నూతన సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి మాత్రం అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. పక్క జిల్లా కామారెడ్డిలో నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరిగినప్పటికీ జిల్లాలో మాత్రం నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి నోచుకోవడంలేదు.

నూతన కలెక్టరేట్‌ ప్రారంభమెప్పుడో?

నిర్మాణం పూర్తయి రెండేళ్లు

నిరుపయోగంగా నూతన భవనం

అద్దె భవనాల్లో పలు కార్యాలయాలు

శిథిలావస్థలో ప్రస్తుత కలెక్టరేట్‌

నిజామాబాద్‌అర్బన్‌, ఆగస్టు 7: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం, పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్‌లకు నూతన సమీకృత భవనాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన నూతన సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభానికి మాత్రం అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. పక్క జిల్లా కామారెడ్డిలో నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరిగినప్పటికీ జిల్లాలో మాత్రం నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి నోచుకోవడంలేదు. ప్రస్తుత కలెక్టరేట్‌ భవనం పాతది కావడంతో దుబ్బ బైపాస్‌ రోడ్డు ప్రాంతంలో విశాలమైన నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. 25 ఎకరాల ప్రాంగణంలో 33 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ప్రతి అంతస్తులో సెమినార్‌ హాల్స్‌, ఆడిటోరియం, వీడియో కాన్ఫరెన్స్‌హాల్స్‌, తదితర అన్ని వసతులు ఉండేలా 2011 అక్టోబరు 11న అప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.62 కోట్ల నిధులతో చేపట్టిన పనులు ఆర్‌ అండ్‌ బీ శాఖ ద్వారా చేపట్టగా 2021 ప్రారంభంలో భవన నిర్మాణం పూర్తికాగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడంలేదు. వర్షాల వల్ల ప్రస్తుతం కలెక్టరేట్‌ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉండగా 62 కోట్ల నిధులతో చేపట్టి భవన నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

25 ఎకరాల ప్రాంగణంలో..

అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒక్కచోట ఉంటే సమస్యల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణానికి ముందడుగు వేసింది. 25 ఎకరాల విశాల స్థలంలో ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే గొడుగు కింద ఉండాలనే ఉద్దేశంతో నగర శివారులోని ఖానాపూర్‌ శివారులో 62 కోట్ల నిధులతో 2017 అక్టోబర్‌ 11న అప్పటి వ్యవసాయశాఖ మంత్రి, ప్రస్తుత శాసనసభ స్పీకర్‌ పొచారం శ్రీనివాస్‌రెడ్డి చేత భూమిపూజ చేశారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత 2020లో పనులు పూర్తయిన పనులు పూర్తయి 2 ఏళ్లు గడుస్తున్న నూతన కలెక్టరేట్‌ ప్రారంభం కాకపోవడంతో నిర్మించి కొత్త భవనం పూర్తిగా నిరుపయోగంగా మారుతుంది. 

శిథిలావస్థలో ప్రస్తుత కలెక్టరేట్‌

జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్‌ భవనం దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించినది. ప్రస్తుతం కలెక్టరేట్‌లో ప్రగతిభవన్‌, పౌరసరఫరాల కార్యాలయం, పౌరసరఫరాల మేనేజర్‌ కార్యాలయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్యాలయాలు కార్పొరేషన్‌ కార్యాలయాలు, ఎన్‌ఐసీ, డీఆర్‌డీఏ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ చాంబర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ చాంబర్‌లు ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన పాత భవనంలో కొనసాగుతున్నాయి. పక్కన ఉన్న అక్షర ప్రణాళిక భవన్‌లో డీఆర్‌డీఏ, సీపీవో, వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ, మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమశాఖలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని పాత భవనంలో వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ పక్కన ఉన్న భవనంలో అదనపు కలెక్టర్‌ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రగతిభవన్‌ పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని శాఖల కార్యాలయాలలో పై కప్పులు పెచ్చులూడి లీకేజీలు కావడంతో అన్ని ముఖ్యమైన ఫైళ్లు వర్షానికి తడిసిపోయాయి. కార్యాలయ సిబ్బంది భయం భయంగా తమ విధులను నిర్వహించే పరిస్థితి ఉంది. కార్యాలయ మెట్ల వద్ద పెచ్చులూడి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రగతిభవన్‌పై మొత్తం పిచ్చిమొక్కలు పెరిగి భవనం శిధిలావస్థకు చేరుకుంది. కలెక్టర్‌ చాంబర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా చాంబర్‌ ఉన్న పాత భవనంసైతం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

ప్రైవేట్‌ భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు

జిల్లా కొన్నిశాఖల ఉన్నతాధికారుల కార్యాలయాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. జిల్లాకేంద్రంలో భూగర్భజలశాఖ, కాలుష్యనియంత్రణమండలి, మైన్స్‌ కార్యాలయం, తూనికలు, కొలతలు, జిల్లా రిజిస్ర్టార్‌, ఇతరత్ర కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నూతన కలెక్టరేట్‌  ప్రారంభం అయితే కార్యాలయాలన్ని నూతన సమీకృత కలెక్టరేట్‌కు వెళ్లే అవకాశం ఉంది. 

రెండేళ్లుగా నిరుపయోగంగా..

రూ.62 కోట్ల నిధులు వెచ్చించి విశాలంగా నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఊరి చివరన రెండేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో పూర్తిగా అది పాత భవనంలా మారింది. ఇప్పటికే భవనంలో ఫర్నిచర్‌, విద్యుత్‌ పరికరాలు, ఇతరత్ర విలువైన వస్తువులు ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో అవన్ని పాడై కోట్లాది రూపాయలు వృథా అయ్యే అవకాశం ఉంది. ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మక ంగా నిర్మించి నిర్మాణం పూర్తయిన ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నూతన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-08-08T08:05:10+05:30 IST