రేషన్‌ షాపుల్లో టీ-వాలెట్‌

ABN , First Publish Date - 2022-11-25T00:11:41+05:30 IST

ప్రస్తుతం మీ సేవ, ఈ-సేవ కేంద్రాల్లో లభించే అన్ని సేవలు టీ-వాలెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది.

రేషన్‌ షాపుల్లో టీ-వాలెట్‌
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టీ-వాలెట్‌ యాప్‌

- అన్ని రకాల పన్నులు చెల్లించేలా ప్రణాళిక

- డిజిటల్‌ సేవల కోసం రేషన్‌డీలర్లకు దశలవారిగా శిక్షణ

- వచ్చే సంవత్సరం నుంచి అమలుకు ప్రభుత్వం కసరత్తు

కామారెడ్డి టౌన్‌, నవంబరు 24: ప్రస్తుతం మీ సేవ, ఈ-సేవ కేంద్రాల్లో లభించే అన్ని సేవలు టీ-వాలెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. గ్రామీణ ప్రజల్లో అక్షరాస్యతను పెంచి డిజిటల్‌ ఇండియాలో భాగస్వాములను చేసేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే అనేక వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టి పౌర సరఫరాల శాఖ ద్వారా విజయవంతంగా అమలు చేస్తోంది. పల్లెల్లో విస్తృతంగా పెరుగుతున్న డిజిటల్‌ సేవలను రేషన్‌ దుకాణాల్లో వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల పంపిటీలో పారదర్శకత కోసం రేషన్‌ దుకాణాల్లో ఈపాస్‌ విధానాన్ని అమలు చేస్తోంది. డీలర్ల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలను చేరువ చేసేందుకు మరో అడుగు ముందుకు వేసి ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా ఉన్న రేషన్‌ దుకాణాల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకు రావడానికి టీ-వాలెట్‌ సేవల అమలుకు చర్యలు చేపడుతోంది.

రేషన్‌ దుకాణాల ద్వారా టీ-వాలెట్‌ సేవలకు కసరత్తు

నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు ఇకపై టీ-వాలెట్‌ ద్వారా ఈ సేవ కేంద్రాల్లో లభించే అన్ని రకాల సేవలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించిన ప్రభుత్వం డిసెంబరు లేదా జనవరి మొదటి వారంలో నిపుణులతో నిర్వహణపై రేషన్‌ డీలర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. రేషన్‌ దుకాణాల్లో అందిస్తున్న నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు ప్రతీనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. ఇకపై 30 రోజుల పాటు వాటిని తెరిచి ఉంచి పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అదనపు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

డిజిటల్‌ సేవలను గ్రామీణ ప్రజలకు చేరువ చేసేందుకోసం..

రేషన్‌ షాపుల్లో డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతోంది. ప్రస్తుతం కేవలం 15 రోజులు మాత్రమే తెరిచి ఉంచే రేషన్‌ దుకాణాలు ఇకపై సెలవురోజుల్లో తప్ప అన్ని రోజులు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ ద్వారా అందించే సరుకులు తగ్గి ఆదాయం లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్న రేషన్‌డీలర్లకు ప్రభుత్వం టీ-వాలెట్‌ నిర్వహణ అప్పగించి ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు రోజంతా చేతినిండా పని కల్పించనుంది. రేషన్‌ దుకాణాల్లో త్వరలో ప్రారంభం కానున్న ఈ సేవల ద్వారా ప్రతీ సేవలకు డీలర్లకు నిర్వహణ కోసం కమీషన్‌ రూపంలో చెల్లించబోతున్నది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంత రేషన్‌ డీలర్లకు ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు వివిధ రకాల పన్నులు చెల్లించడం సులభమవనుంది.

డీలర్లకు రెండు విడతల్లో శిక్షణ

రేషన్‌ దుకాణాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు మరో రెండు నెలల్లో పథకం అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా డిసెంబరు మొదటి వారంలో మొదటి విడత, జనవరి మొదటి వారంలో రెండో విడత రేషన్‌ దుకాణాల డీలర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా వినియోగదారులకు టీ-వాలెట్‌ సేవలు ఎలా అందించాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం ఫిబ్రవరి నుంచి రేషన్‌ దుకాణాల్లో టీ -వాలెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2022-11-25T00:11:43+05:30 IST