మిగిలింది నాలుగు రోజులే

ABN , First Publish Date - 2022-06-09T07:14:50+05:30 IST

జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభానికి నాలుగు రోజుల సమయమే ఉన్నా ఇంకా పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయలేదు. కొత్తగా ఆంగ్ల మాధ్యమంలో తరగతులను ప్రారంభించనున్నా ఇప్పటికీ పుస్తకాలను పంపిణీ చేయలేదు. ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మరమ్మతులు చేపడుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు.

మిగిలింది నాలుగు రోజులే

పాఠశాలల పునఃప్రారంభానికి సమీపిస్తున్న సమయం

13 నుంచి ప్రారంభం కానున్న నూతన విద్యాసంవత్సరం

ఇంకా పాఠశాలలకు చేరని పుస్తకాలు

మన ఊరు-మన బడి కింద ఇంకా పూర్తికాని పనులు

జిల్లాలో భర్తీకాని ఉపాధ్యాయుల పోస్టులు 

నిజామాబాద్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభానికి నాలుగు రోజుల సమయమే ఉన్నా ఇంకా పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయలేదు. కొత్తగా ఆంగ్ల మాధ్యమంలో తరగతులను ప్రారంభించనున్నా ఇప్పటికీ పుస్తకాలను పంపిణీ చేయలేదు. ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మరమ్మతులు చేపడుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. పాఠశాలలు మొదలై తరగతులు ప్రారంభమైతే విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నా మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు ఇంకా చాలా పాఠశాలల్లో పనులు పూర్తికాలేదు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగానే ఉన్నాయి. జోనల్‌ బదిలీలతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు వెళ్లడంతో కొన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బోధించేందుకు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత ఉంది.

8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం..

ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ యేడాది అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు నెలలుగా శిక్షణ ఇచ్చారు. తరగతుల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఆంగ్ల మాధ్యమంలో బోధించేవిధంగా అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌ క్లాస్‌లను నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. జిల్లాలో మొత్తం 1234 పాఠశాలు ఉన్నాయి. వీటిలో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలలు 1039 ఉండగా ప్రభుత్వ పాఠశాలలు 117 ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేట్‌ ఏయిడెడ్‌ 39, మోడల్‌ స్కూళ్లు పది, కేజీబీవీలు 25, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షీయల్‌ పాఠశాలలు 3, ఉర్దూ రెసిడెన్షీయల్‌ స్కూల్‌ 1 ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభానికి ఇంకా 4 రోజులే ఉన్నా జిల్లాలోని ఏ పాఠశాలకు కూడా పాఠ్యపుస్తకాలు రాలేదు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పాఠశాలలకు 7లక్షల 63వేల 763 పుస్తకాలు అవసరం ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధించడం వల్ల పుస్తకాలన్నీ ఇంగ్లిష్‌ మీడియంలోనే ప్రింట్‌ చేసి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను చేశారు. ప్రభుత్వం నుంచి ఇంకా జిల్లాలకు రాకపోవడం వల్ల ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడం వల్ల తరగతులు ప్రారంభమైతే విద్యార్థులు పుస్తకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మొదటిసారిగా ఆంగ్ల మాధ్యమంలో తరగతులను మొదలుపెడుతున్నందున ముందే పుస్తకాలను పంపిణీ మొదలుపెడితే విద్యార్థులకు తరగతులు ప్రారంభం కాగానే చదువుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే స్కూల్‌ డ్రెస్‌లు కూడా ఇంకా జిల్లాకు రాలేదు. 

మౌలిక వసతులు కరువు..

జిల్లాలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ఇంకా పాఠశాలల్లో మాత్రం మౌలిక వసతుల కోసం చేపట్టిన పనులు పూర్తికాలేదు. మన ఊరు-మన బడి కింద జిల్లాలో ఈ సంవత్సరం 407 పాఠశాలలు చేపట్టారు. ఈ  పాఠశాలల్లో రూమ్‌ల మరమ్మతులు చేయడంతో పాటు అవసరం మేరకు కొత్త రూమ్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థులకు కావాల్సిన బెంచీలు, ఇతర సౌకర్యాలను కల్పించడంతో పాటు తరగతి గదులన్నీ కలర్‌ వేయడంతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే చాయచిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో తాగునీరు ఇబ్బంది లేకుండా చూడడంతో పాటు మరుగుదొడ్లను నిర్మాణం చేయడంతో పాటు నీటి వసతులను కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తుండడం వల్ల కావాల్సినవి అందించనున్నారు. తరగతుల ప్రారంభంలోపే ఇవి పూర్తిచేయాల్సి ఉన్న ఇప్పటికీ చాలా పాఠశాలల్లో ఖాళీలు గత సంవత్సరం కూడా కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఖాళీల భర్తీకి కానరాని చర్యలు..

జిల్లాలో త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్నా ఖాళీల భర్తీకి ఇంకా చర్యలు చేపట్టలేదు. కొత్త జోనల్‌ విధానంతో సొంత జిల్లాలకు టీచర్లను బదిలీ చేశారు. సీనియారిటీ ప్రకారం ఇతర జిల్లాలకు పంపించారు. స్పౌజ్‌కేసులో కొంతమందిని సొంత జిల్లాలకు బదిలీ చేయలేదు. జోనల్‌ బదిలీల వల్ల జిల్లలో ఉపాధ్యాయుల ఖాళీలు భారీగాఉన్నాయి. ప్రభుత్వం ఖాళీలభర్తీకి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కలిపి 5916 మంది ఉపాద్యాయులు అవసరం ఉండగా, ప్రస్తుతం 5197 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో 719 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉండగా మరికొన్ని పాఠశాలల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారు. ఆంగ్ల మాద్యమం ప్రవేశపెడుతున్నందున ముందే ఖాళీలను భర్తీచేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టలేదు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత విద్యావలంటీర్లను నియమించే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి చర్యలను తీసుకోలేదు. పాఠశాలల ప్రారంభానికి ముందే పుస్తకాల పంపిణీతో పాటు మౌలిక వసతులను కల్పించి ఖాళీలను భర్తీచేస్తే గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందే అవకాశం ఉంది. జిల్లాలో ఈ నెల 13 నుంచి తరగతులు ప్రారంభం అవుతుందని డీఈవో దుర్గాప్రసాద్‌ తెలిపారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ఏర్పాట్లను చేశామన్నారు. మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. జిల్లాకు పుస్తకాలు ఇంకా రాలేదని తరగతులు ప్రారంభమయ్యేలోపు స్టాక్‌ వస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా డిప్యుటేషన్‌లో నియామకం చేశామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-09T07:14:50+05:30 IST