రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పతనం ఖాయం

ABN , First Publish Date - 2022-04-24T05:47:21+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఓడ గొట్టడానికి సుమారు రూ.600కోట్లను కేసీఆర్‌ ఖర్చు చేశాడని, 2023లో ఇదే తెలంగాణ ప్రజలు ఓట్లతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పతనం ఖాయం
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

- కేసీఆర్‌ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు

- హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఖర్చుపెట్టిన కోట్ల రూపాయలు ఎక్కడివి

- ప్రజాధానాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ

- హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌


గాంధారి, ఏప్రిల్‌ 22: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను ఓడ గొట్టడానికి సుమారు రూ.600కోట్లను కేసీఆర్‌ ఖర్చు చేశాడని, 2023లో ఇదే తెలంగాణ ప్రజలు ఓట్లతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం గాంధారి మండలం గండివేట్‌ గ్రామంలో ఖుషి కందూర్‌కు హాజరై, సీతాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతూ రూ. వందల కోట్ల స్కీంలు ప్రవేశ పెట్టినట్లు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పుకుంటున్నారే తప్ప ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేవలం కల్వకుంట్ల కుటుంబానికే చెందుతుందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నారని ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు. 2023లో నిజామాబాద్‌ జిల్లా నుంచే కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓటమి మొదలువుతుందని అన్నారు. దేశంలోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పంటలపై ఆంక్షలు విధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పంటలు వేయకుండా సుమారు 20లక్షల మంది రైతులకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. మొత్తం తెలంగాణలో ఆంక్షలు విధిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పాలన ఉంటుందని భరోసానిచ్చారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో మొక్కజొన్న పంట వేయకుండా రైతులకు అన్యాయం చేశారని రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ త్వరలోనే మిగులుతుందని అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం..రైతు బాధపడిన దేశం బాగుపడదని అన్నారు. తెలంగాణను పరిపాలించే సత్తా కేసీఆర్‌కు లేదన్నారు. వెంటనే సీఎం కూర్చిలోంచి దిగిపోవాలని, కుర్చీలో కూర్చుండే నైతిక హక్కు కేసీఆర్‌ ఎప్పుడో కోల్పోయారన్నారు. తెలంగాణలో ఓడిపోతామనే భయంతోనే పీకేతో సర్వే చేయించుకుంటున్నారని అన్నారు. ఎంత మంది పీకేలు వచ్చినా తెలంగాణలో మాత్రం 2023లో టీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు పింఛన్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ పాపాల పుట్ట పెరిగిపోయిందని కేవలం కల్వకుంట్ల కుటుంబమే అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలోని చేతగాని ఎమ్మెల్యేలు, మంత్రులను దగ్గర పెట్టుకున్నారని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లెదే లేదని ఒక్కసారి పార్టీ మారక బీజేపీలోనే ఉంటానని అన్నారు. కావాలనే తనపై కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి వస్తారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే ఎల్లారెడ్డిలో పోటీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, అశ్వథ్థామారెడ్డి, మల్యాద్రిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, అంజాద్‌ఖాన్‌, బీజేపీ మండల అధ్యక్షుడు సాయిబాబా, వివిధ గ్రామాల బీజేపీ గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T05:47:21+05:30 IST