వాహనదారులపై పన్ను భారం

ABN , First Publish Date - 2022-05-16T05:17:50+05:30 IST

కొత్త వాహనాలపై ప్రభుత్వం పన్నుల భారం మోపింది. వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకునే సందర్భంలోనే జీవితపన్ను (లైఫ్‌ట్యాక్స్‌)ను కూడా ఒకేసారి వసూలు చేస్తోంది.

వాహనదారులపై పన్ను భారం

జిల్లాలో ప్రతిరోజూ 100 నుంచి 200ల వరకు వాహనాల అమ్మకం

- వాహన ధరలను బట్టి లైఫ్‌ట్యాక్స్‌ పెంచిన ప్రభుత్వం

- టూ వీలర్స్‌పై 9 నుంచి 12 శాతానికి

- అదేస్థాయిలో అన్ని వాహనాలకు


కామారెడ్డి టౌన్‌, మే 15: కొత్త వాహనాలపై ప్రభుత్వం పన్నుల భారం మోపింది. వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకునే సందర్భంలోనే జీవితపన్ను (లైఫ్‌ట్యాక్స్‌)ను కూడా ఒకేసారి వసూలు చేస్తోంది. ఆ లైఫ్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం ఆయా వాహనధరలను బట్టి స్లాబ్‌ల వారీగా పెంచింది. రూ.50వేల పైచిలుకు ఉన్న ద్విచక్ర వాహనానికి పెరిగిన ధరను బట్టి అదనంగా రూ.2,315 ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గ్లామర్‌ బైక్‌కు గతంలో రూ.94,990 ధర ఉండేది. అయితే అందులో లైఫ్‌ట్యాక్స్‌ రూ.7,285 ఉండేది. ప్రస్తుతం లైఫ్‌ట్యాక్స్‌ రూ.9,600 పడుతుండడంతో దాని ధర రూ.97,310 అయింది. కరోనా కారణంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్న కొందరు వారి ఆర్థిక స్థోమతను బట్టి బైక్‌లతో పాటు కార్లు, ఇతర కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ట్యాక్స్‌ పెంచడంతో కొత్త వాహనం కొనుగోలు చేయాలంటే ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ లెక్కన జిల్లాలో రోజుకు 100 నుంచి 200ల వరకు వాహనాలు అమ్మకాలు జరుగుతుండగా పెరిగిన ధరను బట్టి రోజుకు ప్రభుత్వానికి రూ.2,32,000 నుంచి రూ.4,63,000 వరకు ఆదాయం వస్తుంది. కానీ ఇప్పటికే అన్ని ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సొంత వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదనపు భారంగా మారనుంది. గతంలో 67వేల నుంచి 80వేల వరకు ఉన్న ద్విచక్ర వాహనాలు ప్రస్తుతం రూ.95వేల వరకు ధర పెరుగగా ప్రస్తుతం ట్యాక్‌ సైతం పెరిగితే 3 వేల వరకు అదనంగా భారం పడనుంది.


బైక్‌లను బట్టి లైఫ్‌ట్యాక్‌ ఇలా..

కొత్త ద్వి చక్రవాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకునే సందర్భంలో వేసే లైఫ్‌ట్యాక్స్‌, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలను తెలంగాణకు బదిలీ  చేసుకున్న కూడా లైఫ్‌ట్యాక్స్‌ను ఇక్కడి ప్రభుత్వమే వసూలుచేస్తోంది. ఈ వాహన సంవత్సరాలను బట్టి స్లాబ్‌ల వారిగా లైఫ్‌ట్యాక్స్‌ విధిస్తోంది. బైక్‌లకు సంబంధించి గేర్‌, విత్‌ అవుట్‌ గేర్‌ కలిగినవి కొత్తగా కొనుగోలు చేసినవి రిజిస్ట్రేషన్‌ సందర్భంలో వాహనం ధర రూ.50 వేలకు లోబడి ఉంటే 9 శాతం, రూ.50వేలకు పైచిలుకు ఉంటే 12 శాతానికి పెంచారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన రెండేళ్ల వాహనాలకు రూ.50వేల లోపు ఉన్న వాటికి 8శాతం, రూ.50 పైచిలుకు ఉంటే 11 శాతానికి పెంచారు. ఇలా సంవత్సరాల బట్టి లైఫ్‌ట్యాక్స్‌ నిర్ణయించారు.


ఫోర్‌ వీలర్స్‌, నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు..

రూ.5లక్షలలోపు ధర ఉండి కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి 13 శాతం లైఫ్‌ట్యాక్స్‌ విధిస్తుండగా రూ.5లక్షల నుంచి రూ.10లక్షల లోపు ఉన్న వాటికి 14 శాతం, రూ.10 నుంచి రూ.20లక్షల లోపు ఉన్న వాటికి 17 శాతం, రూ.20లక్షలపై చిలుకు ఉంటే 18 శాతానికి పెంచారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన రెండేళ్ల వాహనాలకు రూ.5లక్షల లోపు ధర ఉంటే 12 శాతం లైఫ్‌ట్యాక్స్‌ పెంచగా రూ.5లక్షల నుంచి రూ.10లక్షల ధర ఉంటే 13 శాతం రూ.10 నుంచి 20లక్షలు ఉంటే 16 శాతం, రూ.20లక్షలకు పైబడిన వాటికి 17 శాతం వరకు ప్రభుత్వం ట్యాక్స్‌ పెంచింది. ఇతర రాష్ట్రాల వాహనాలకు కాల పరిమితి ధరలను బట్టి 15శాతం వరకు పన్ను విధించారు. అయితే గతంలో ఒకే విధమైన ట్యాక్స్‌ ఉండగా ప్రస్తుతం ఆయా వాహనాల ధరలను బట్టి స్లాబ్‌ల వారిగా పన్నులను పెంచింది.


- లైఫ్‌ ట్యాక్స్‌ విధించడంపై ప్రభుత్వం ఆలోచించాలి

- సాయి, కామారెడ్డి

ఇప్పటికే వాహన ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సొంత వాహనం కొనుగోలు చేద్దామంటే ఆలోచించాల్సి వస్తోంది. గతంలో ఫ్యాషన్‌ప్రో, గ్లామర్‌ వంటి వాహనాలు రూ.67వేల నుంచి రూ.80వేల వరకు ఉండగా ప్రస్తుతం వాటి ధర రూ.92వేల నుంచి 95 వేల వరకు పెరిగింది. దానికి తోడు లైఫ్‌ట్యాక్‌ పెంచడంతో 97వేల  వరకు ధర చేరుకుంటుంది. రెండు, మూడు సంవత్సరాలలోనే దాదాపు ధర డబుల్‌ అవడంపై వాహనం కొనుగోలు చేయాలంటే సామాన్యునికి భారంగానే మారుతుంది. లైఫ్‌ట్యాక్స్‌ విధించడంపై ప్రభుత్వం ఆలోచించాలి.

Updated Date - 2022-05-16T05:17:50+05:30 IST