వరి కోతలు షురూ

ABN , First Publish Date - 2022-04-11T06:07:17+05:30 IST

జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ బోర్లు కింద సాగు చేసిన వరి పంటలు కోతకు వచ్చాయి. కోతకు వచ్చిన పంటలను కోసేందుకు రైతులు బిజీ అయ్యారు.

వరి కోతలు షురూ
వరి పంటలను కోస్తున్న వరి కోత మిషన్లు

- జిల్లాలో మొదలైన వరి కోతలు 

- మార్కెట్లోకి ధాన్యాన్ని తీసుకువస్తున్న రైతులు

- ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

- దళారుల చేతిలో మోసపోయే అవకాశం

- సందిగ్ధంలో ధాన్యం కొనుగోళ్లు.. అయోమయంలో అన్నదాతలు

- జిల్లాలో యాసంగిలో 1.61 లక్షల ఎకరాల్లో వరి సాగు

- 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తుందని అంచనా


కామారెడ్డి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ బోర్లు కింద సాగు చేసిన వరి పంటలు కోతకు వచ్చాయి. కోతకు వచ్చిన పంటలను కోసేందుకు రైతులు బిజీ అయ్యారు. ఇప్పటికే కొందరు రైతులు వరి కోతలను ప్రారంభించారు. వరి కోత మిషన్లు సైతం గ్రామాల్లోని పంట పొలాలకు చేరుకున్నాయి. జిల్లాలో ఈ యాసంగిలో 1.61 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. వరి సాగుకు అనుగుణంగా సుమారు 4.30లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు.  ప్రభుత్వపరంగా ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటంతో కొనుగోళ్లలో సందిగ్ధం నెలకొంది. దీంతో రైతులు అయోమయంలో పడుతున్నారు. రైతులు ఇప్పుడిప్పుడే వరి కోతలను మొదలు పెట్టడంతో మార్కెట్లోకి ఽధాన్యాన్ని తీసుకువస్తున్నారు. మర్కెట్లో ధాన్యానికి మద్దతు ధర లభించకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

1.61 లక్షల ఎకరాల్లో వరి సాగు

యాసంగిలో వరిసాగు వద్దని ప్రభుత్వాలు చెప్పినా రిజర్వాయర్‌లు, చెరువులు, కాలువలు, బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు వరి పంటకే మొగ్గు చూపారు. ప్రత్యామ్నాయ పంటలకు రక్షణ లేకపోవడం, మార్కెటింగ్‌ వసతి కల్పించకపోవడంతో రైతులంతా వరినే ఎంచుకున్నారు. దీంతో జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 1,61,395 ఎకరాల్లో వరి సాగైంది. వరి సాగుపై ప్రభుత్వాలు ప్రకటన చేయడంతో యాసంగిలో రైతులు ఊగిసలాట మధ్య నాట్లు వేస్తూ వచ్చారు. గత ఏడాది 2.26 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా దాదాపు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ఈ ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ యాసంగిలోనూ 1.61 లక్షల ఎకరాల్లో సాగు చేయగా దాదాపు 4.03 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా దొడ్డు రకంతో పాటు సన్నరకం ధాన్యాన్ని రైతులు సాగు చేస్తుంటారు. అయితే ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందా, ఎఫ్‌సీఐ సేకరిస్తుందా లేక మిల్లర్లే ఎంతోకొంత ధరకు కొనుగోలు చేస్తారా అనే విషయంపై స్పష్టత రావటం లేదు.

అన్నదాతల్లో ఆందోళన

ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో సుమారు 1.61 లక్షల ఎకరాల వరకు వరి సాగైంది. వరితో పాటు మొక్కజొన్న, శనగ, పొద్దు తిరుగుడు, పప్పు దినుసు పంటలు సైతం వేల ఎకరాల్లోనే సాగు చేశారు. ఇప్పటికే మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, పప్పుదినుసు పంటలు చేతికొచ్చాయి. అదేవిధంగా వరి పంట కోతలు సైతం ప్రారంభం అయ్యాయి. పంటలు చేతికొస్తున్న సమయంలో రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. దానిని వదిలి కొనుగోళ్లపై అధికారంలో ఉన్న పార్టీలే రాజకీయం చేయడంపై రైతులు సైతం పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే వరి ధాన్యం రాశులు మార్కెట్‌లోకి రైతులు తరలించనున్నారు. ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటు చేయకపోవడం, స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం ఎక్కడ తడిసిపోయి నష్టపోతామోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మద్దతు ధర లభించక రైతులకు నష్టం

రైతుల ధాన్యన్ని కొనుగోలు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు రాజకీయాలు చేస్తున్నాయి. ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించిన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలను మాత్రం ఏర్పాటు చేయటం లేదు.  కనీసం బహిరంగ మార్కెట్‌లోనైన ధాన్యం విక్రయించుకుందామనే రైతులకు స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు లేవు. రైసుమిల్లులకు, దళారులకు రైతులు ఽధాన్యాన్ని విక్రయిస్తున్నప్పటికీ క్వింటాల్‌కు రూ.1400 మాత్రమే కొనుగోలు చేస్తున్నారని దీంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు రాజకీయం వదిలి కొనుగోళ్లపై వెంటనే ప్రకటన చేసి  కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-04-11T06:07:17+05:30 IST