ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ముమ్మర తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-29T06:21:52+05:30 IST

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. వైద్య అధికారులు బృందాలు గా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులను జల్లెడపడుతున్నారు. అన్ని ఆసుపత్రులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఆసుపత్రిలో వసతులు, సిబ్బంది, చికిత్స విధానాలను పరిశీలిస్తున్నారు.

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ముమ్మర తనిఖీలు

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జల్లెడపడుతున్న వైద్య ఆరోగ్యశాఖ బృందాలు

నిబంధనలు పాటించని వాటిపై చర్యలకు సిఫారసు

ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి పెంచుతున్న ఆస్పత్రి యాజమాన్యాలు

నిజామాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. వైద్య అధికారులు బృందాలు గా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులను జల్లెడపడుతున్నారు. అన్ని ఆసుపత్రులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఆసుపత్రిలో వసతులు, సిబ్బంది, చికిత్స విధానాలను పరిశీలిస్తున్నారు. ఎవరికివారే బృందాలు తమ నివేదికను డీఎంహెచ్‌వోకు అందిస్తు న్నారు. పలు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. అనేక ఆసుపత్రుల్లో కనీస వసతులతో పాటు సరిపడా సిబ్బందిలేరని తమ నివేదికల్లో పేర్కొంటున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులతో పాటు స్పెషలిస్టు వైద్యులు లేకున్నా చికిత్స అందిస్తున్నారని చాలా ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీకి కావాల్సిన పరికరాలు లేవని తనిఖీల్లో తేలడంతో ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. 

తొమ్మిది బృందాల తనిఖీలు

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్య ఆరోగ్యశాఖ బృందాలతో పాటు కలెక్టర్‌ నియమించిన బృందాలు తనిఖీ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వైద్య శాఖ ఆధ్వర్యం లో తొమ్మిది బృందాలు సీనియర్‌ వైద్యుల నేతృత్వంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ కొన్ని ఆసుపత్రులను తనిఖీ చేస్తూ తమ నివేదికలను ఏరోజుకు ఆ రోజు డీఎంహెచ్‌వోకు పంపిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా తీసుకున్న వివరాలకు అనుగుణంగా కొన్ని ఆసుపత్రులకు నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలు తీసు కోవాలని తమ నివేదికలో సీనియర్‌ వైద్యులు పేర్కొంటున్నారు. 

ఆస్పత్రుల్లో వసతుల లేమి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలు చేపట్టిన వైద్య బృందాలకుప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చాలా వసతులు కల్పించలేదని గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్‌లిస్టు ప్రకారం తనిఖీలు చేస్తుండగా చాలా ఆసుపత్రుల్లో కనీస వసతులు లేకపోవడంతో పాటు సిబ్బంది కొరతను గుర్తించారు. శిక్షణ పొందిన సిబ్బందిలేక కొద్ది రోజుల పాటు ఆసుపత్రి వర్గాలు శిక్షణ ఇచ్చి పనులు చేసుకుంటున్నట్లు  వైద్య అధికారులు గుర్తించారు. 

కానరాని ఫైర్‌ సేఫ్టీ

జిల్లాలో కొన్ని పెద్ద ఆసుపత్రులు మినహాయిస్తే ఏ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగినా ఫైర్‌ ఇంజన్‌ తిరిగే పరిస్థితులు లేవు. పెద్ద ప్రమాదాలు జరిగితే కాపాడేందుకు కావాల్సిన పరికరాలు లేవు. అన్ని ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీకి సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాల్సి ఉన్న ఎక్కువమంది నామమాత్రంగా కొన్ని పరికరాలను మాత్రమే ఉంచారు.  కొన్ని ఆసుపత్రులు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న సమయం గడిచినా మళ్లీ రెన్యువల్‌ చేయించలేదు. ఎక్కువ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రకటించినా కావాల్సిన వైద్యులు మాత్రం లేరు. కొంతమంది స్పెషలిస్టు వైద్యులు నగరంలోని పలు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. నర్సింగ్‌హోంలు పెట్టినపుడు కొన్ని రకాల సేవలే చేస్తామని అనుమతులు తీసుకున్నా కొన్ని ఆసుపత్రుల్లో అనుమతులు లేకుండానే సిజేరియన్‌లు చేస్తున్నారు. ప్రసవాలను కొనసాగిస్తున్నారు. వీటికి సంబంధించిన ఆపరేషన్‌ థియేటర్‌, డెలివరీ రూంలు కూడా తగినవిధంగా ఏర్పాట్లు చేయలేదు. కొన్ని ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్‌లు ఉన్నా డెలివరీ రూంలు లేనట్లు తనిఖీల్లో గుర్తించారు. చాలా ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్‌, ఇతర సిబ్బందికి సంబంధించిన జిరాక్స్‌ సర్టిఫికెట్లు ఉంచిన వారిలో సగం మంది పనిచేయడంలేదని గుర్తించారు. నగరంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌, ఇతర ప్రాంతాల్లో ఉన్న నర్సింగ్‌హోంలలో ల్యాబ్‌లు కూడా తగిన విధంగా లేనట్లు గుర్తించారు. ఈ వివరాలన్నీ నమోద చేసుకున్న వైద్య బృందాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి నివేదికలు ఇస్తున్నారు. పలు ఆసుపత్రులపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పదిరోజుల్లోనే రెండు రకాల బృందాలు తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఆయా ఆసుపత్రుల యజమానులు తమకు దగ్గరగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారు. చర్యలు చేపట్టకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తనిఖీ లు కొనసాగుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. కొన్ని ఆసుపత్రులకు నోటీసులు ఇస్తున్నామని మరికొన్ని ఆసుపత్రుల్లో మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.

బోధన్‌లో కొనసాగుతున్న తనిఖీలు

బోధన్‌ రూరల్‌: ప్రైవేట్‌ ఆసుపత్రుల తనిఖీల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ల్యాబ్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సమత మాట్లాడుతూ.. ల్యాబ్‌లు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆమె సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఫార్మాట్‌ ప్రకారం వివరాలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. బోధన్‌లో ల్యాబ్‌లు, డెంటల్‌, ఫిజియోథెరఫీ తదితర ఆసుపత్రులను తనిఖీలు నిర్వహించామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. తనిఖీల్లో వైద్య సిబ్బంది నిర్మల తదితరులు ఉన్నారు.

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నిబంధనలు ఇలా..

తప్పనిసరిగా వైద్యులు అందుబాటులో ఉండాలి

శిక్షణ పొందిన సిబ్బందిని  నియమించుకోవాలి

అగ్ని ప్రమాదాలు జరిగితే ఆర్పేందుకు కావాల్సిన పరికరాలు ఉండాలి

ప్రతిరోజూ వినియోగించే  మందులు, ఇతర వస్తువులకు సంబంధించిన బయోలాజికల్‌ వెస్ట్‌కు సంబంధించి పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డ్‌ నిబంధన ప్రకారం ఏర్పాట్లు ఉండాలి

రోగులకు వేటింగ్‌ రూంలతో పాటు స్పెషలిస్టు డాక్టర్‌లో బోర్డులో పెట్టిన విధంగా సేవలు అందించాలి

ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవలు అందించాలి. వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఉండాలి

Updated Date - 2022-09-29T06:21:52+05:30 IST