సిద్ధమవుతున్న ఐటీ టవర్‌

ABN , First Publish Date - 2022-01-03T07:08:44+05:30 IST

జిల్లాలో ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. కొత్త కలెక్టరేట్‌తో పాటు ఈ భవనాన్ని ప్రారంభించి అందుబాటులోకి తేనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో అనుమతులు ఇవ్వనున్నారు.

సిద్ధమవుతున్న ఐటీ టవర్‌

నూతన కలెక్టరేట్‌తోపాటు ప్రారంభించే అవకాశం

ఐటీ కంపెనీలతో ఒప్పందాలకు అధికారుల ప్రయత్నాలు

సుమారు 750 మందికి ఉద్యోగ అవకాశాలు

ఎదురుచూస్తున్న జిల్లాలోని నిరుద్యోగులు

నిజామాబాద్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. కొత్త కలెక్టరేట్‌తో పాటు ఈ భవనాన్ని ప్రారంభించి అందుబాటులోకి తేనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో అనుమతులు ఇవ్వనున్నారు. ఈ ఐటీ టవర్‌లో వారికి కావాల్సిన విధంగా స్పేస్‌ను అలాట్‌ చేయనున్నారు. భవనం ప్రారంభానికి ముందే వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సుమారు 15 కంపెనీలతో ఒప్పందం చేసుకుని 700లకు పైగా ఉద్యోగాలను స్థానిక యువతకు కల్పించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలతో చర్చించి జిల్లాలో ఏర్పాటు చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

పూర్తయిన నిర్మాణ పనులు..

నగరంలోని బైపాస్‌ రోడ్డులో నూతన కలెక్టరేట్‌ పక్కన నిర్మిస్తున్న ఐటీ టవర్‌ పనులు మొత్తం పూర్తయ్యాయి. భవనంలోని చిన్న చిన్న పనులను పూర్తిచేస్తున్నారు. ఈ ఐటీ టవర్‌ను జీ ప్లస్‌, మూడంతస్తులతో నిర్మాణం చేశారు. సుమారు రూ.50కోట్ల వరకు నిధులను వెచ్చిస్తున్నారు. ఐటీ కంపెనీలకు అవసరమైనవిధంగా భవన నిర్మాణాన్ని చేశారు. మొత్తం భవనంలో 50వేల స్క్వేర్‌ఫీట్‌ స్థలం అందుబాటులో ఉండేవిధంగా నిర్మాణం చేశారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా ఐటీ ఉద్యోగాలను కల్పించేందుకు ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పటికే కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ప్రారంభించి స్థానికంగా కంప్యూటర్‌ సైన్స్‌, అనుబంధ కోర్సులు చదివిన వారికి ఉపాధిని కల్పించారు. అదే రీతిలో జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఈ ఐటీ టవర్‌లో వివిధ కంపెనీలకు కేటాయించి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు మిగిలిన అన్ని పనులు పూర్తిచేసి కొత్త కలెక్టరేట్‌తో పాటు ఈ భవనాన్ని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన కలెక్టరేట్‌కు పక్కనే ఉన్న ఈ భవనం నిర్మాణం పూర్తిచేయడంతో పాటు చుట్టుపక్కల మిగిలిన పనులు చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తిచేయడంతో పాటు చుట్టూర మొక్కలు నాటి ప్రారంభోత్సవానికి అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారు. 

కంపెనీలతో ఒప్పందాలు..

 జిల్లాలో కొత్తగా నిర్మాణం చేసిన ఈ ఐటీ టవర్‌లో ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చేందుకు ఐటీ, పరిశ్రమశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఐటీ టవర్‌లో 15 కంపెనీల వరకు పెట్టుకునేందుకు అవకాశం ఉండడంతో నిర్మాణం పూర్తయినందున ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పనిచేస్తున్న కంపెనీల శాఖలను ఈ ఐటీ టవర్‌ లో ఏర్పాటు చేసి ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు..

సీఎం కేసీఆర్‌ జిల్లాకు వచ్చేలోపే కనీసం 5 కంపెనీల వరకు ఒప్పందాలు చేసుకుని వాటి శాఖలను ఈ ఐటీ టవర్‌లో ఏర్పాటు చేసేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ భవనంలో 50వేల స్క్వేర్‌ఫీట్‌ అందుబాటులో ఉండడం వల్ల 15 కంపెనీలు ఏర్పాటు చేసిన సరిపడా స్థలం ఉంది. ఈ ఐటీ టవర్‌లో మొత్తం కంపెనీలు ఏర్పాటు చేస్తే 750 మంది వరకు స్థానికంగా ఉండే యువతకు ఉద్యోగాలు రానున్నాయి. ఇక్కడ కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీలు, పీజీలు పూర్తిచేసినవారు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే పనిచేసుకునే అవకాశం రానుంది. కంపెనీల ఒప్పందాల కోసం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాఖల అధికారులతో మాట్లాడుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిసి త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో నిర్మాణం అయిన ఈ ఐటీ టవర్‌లో మంచి కంపెనీలు వచ్చేవిధంగా చూడాలని కోరారు. పెద్ద కంపెనీలు వస్తే భవిష్యత్‌లో ఇతర కంపెనీలు కూడా సొంతంగా వాటికి సంబంధించిన శాఖలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని వారు మంత్రిని కోరడంతో త్వరగా కంపెనీలతో మాట్లాడి ఒప్పందాలు చేసుకోవాని అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో ఐటీ టవర్‌ ప్రారంభమైతే జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగాలు రానున్నాయి. జిల్లా కేంద్రంలో చేపట్టిన ఐటీ టవర్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఇంజనీర్‌ అజ్మీర్‌ తెలిపారు. త్వరలో అన్ని పనులు పూర్తిచేసి భవన ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెలలో కొన్ని కంపెనీలతో ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-03T07:08:44+05:30 IST