ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-10-08T04:25:44+05:30 IST

వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేపడుతోంది. మరో పక్షం రోజుల్లో వరి కోతలు మొదలుకానున్న నేపథ్యంలో ఈనెల 3వ వారంలో మార్కెట్‌కు ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు (ఫైల్‌)

- మరో పక్షం రోజుల్లో జిల్లాలో మొదలుకానున్న వరి కోతలు
- వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాటు చేస్తున్న అధికార యంత్రాంగం
- జిల్లాలో 2.98 లక్షల ఎకరాల్లో వరి సాగు
- 6 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు వస్తాయంటున్న వ్యవసాయశాఖ
- వానాకాలంలో 5.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోళ్లే లక్ష్యం
- 300లకు పైగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు
- ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నారు


కామారెడ్డి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి):
వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేపడుతోంది. మరో పక్షం రోజుల్లో వరి కోతలు మొదలుకానున్న నేపథ్యంలో ఈనెల 3వ వారంలో మార్కెట్‌కు ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ధాన్యం రాక ప్రారంభమైతే ఈనెల చివరి నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మరో వైపు ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ లోపు ఏర్పాట్లు చేసి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని జిల్లాయంత్రాంగం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 2.98లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. విస్తారంగా వర్షాలతో 6లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అంచనాలు వేశాయి. ఇందులో 5.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అనుకూలంగా 300లకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తేమ యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌, కాంటాలు, గన్నీ బ్యాగులు సమకూర్చుకునే పనిలో సంబంధితశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
5.50లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్ల లక్ష్యం
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2.98 లక్షల ఎకరాల్లో  రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ దిగువన నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నస్రూల్లాబాద్‌, పోచారం ప్రాజెక్టు కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌ మండలాలతో పాటు లింగంపేట, మాచారెడ్డి, దోమకొండ, కామారెడ్డి మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ లెక్కన 6 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులు అంచనా వేశారు. అయితే కొనుగోలు కేంద్రాలకు 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దిగుబడులకు తగ్గట్టుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల వరి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సంబంధిత శాఖ అధికారులతో పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు.
300లకు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 300లకు పైగా కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఽధాన్యం కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్‌, ఐకేపీ, మార్కెట్‌ యార్డుల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరో పక్షం రోజుల్లో జిల్లాలోని బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, లింగంపేట, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈనెల చివరికల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డులకు పెద్దమొత్తంలోనే రైతులు తరలించే అవకాశం ఉంది. వరి ధాన్యం సేకరణకు 1.25కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా ఇప్పటికే 60 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ కాంటాలు, గన్నీ సంచులను అందుబాటులో ఉంచనున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.
ఖాళీగా లేని మిల్లులు.. సరిపోని గోదాంలు
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలోనే ధాన్యం దిగుబడులు రానున్నాయి. ఈ ధాన్యం మొత్తం పెద్ద ఎత్తున కేంద్రాలకు రైతులు తరలించే అవకాశం ఉంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని దాచేందుకు జిల్లాలో సరిపడా గోదాంలు లేవు. ఉన్న రైసుమిల్లులు ఖాళీగా లేవు. దీంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలనే దానిపై యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. గత యాసంగి, వానాకాలం, యాసంగి మూడు సీజన్‌లకు సంబంధించి సీఎంఆర్‌ ధాన్యం, బియ్యం ఆయా రైసుమిల్లుల్లో గోదాంలలోనే ఉండిపోయింది. దీంతో ఈ వానాకాలం సీజన్‌లో కొనుగోలు చేసే ధాన్యం ఎక్కడికి తరలించాలనే దానిపై స్పష్టత లేకుండా పోతుంది. మరోవైపు మిల్లర్లు సైతం ఈ సీజన్‌లో కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కడ దించుకోవాలనే దానిపై సమాలోచనలో పడ్డారు. కొనుగోలు ప్రారంభం అయితే ఆయా మిల్లులకు కేటాయింపులు జరగనున్నాయి.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది
- చంద్రమోహన్‌, అదనపు కలెక్టర్‌, కామారెడ్డి
వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం కొనుగోళ్లపై జీవో జారీ చేయగానే కేంద్రాలను ప్రారంభిస్తాం. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై పలుమార్లు ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని ఆదేశించాం. ఈ సీజన్‌లో సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని ఇందులో 5.50 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. కొనుగోళ్లకు సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం ఆదేశిస్తే కొనుగోళ్లు చేపడతాం.

Updated Date - 2022-10-08T04:25:44+05:30 IST