యాసంగి సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-10-18T06:47:18+05:30 IST

జిల్లాలో వానాకాలం సాగు ముగుస్తుండడంతో యాసంగి సాగుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. సాగు ప్రణాళిక రూపొందించడంతో పాటు రైతులు వేసే పంటల ఆధారంగా కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

యాసంగి సాగుకు సన్నద్ధం

జిల్లాలో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న వ్యవసాయశాఖ

యాక్షన్‌ప్లాన్‌ ఖరారు చేసిన శాఖ అధికారులు

ఎరువులు, విత్తనాలను సరఫరా చేయాలని ప్రభుత్వానికి నివేదిక

విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా శనగ, వరి, నువ్వు విత్తనాల సరఫరా

యాసంగి సాగుకు ఈ నెల నుంచే రైతులకు పంట రుణాల పంపిణీ

నిజామాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వానాకాలం సాగు ముగుస్తుండడంతో యాసంగి సాగుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. సాగు ప్రణాళిక రూపొందించడంతో పాటు రైతులు వేసే పంటల ఆధారంగా కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో సాగయ్యే విస్తీర్ణం ఆధారంగా వీటిని సమకూర్చాలని ప్రభుత్వానికి నివేదించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నిం డుగా ఉండడం, భూగర్భ జలాలు ఎక్కువగా ఉండ డంతో గత యాసంగికంటే ఎక్కువ మొత్తంలో సాగ య్యే అవకాశం ఉందని ప్రణాళికలో పొందుపర్చారు. వరితో పాటు ఆరుతడి పంటలు కూడా ఎక్కువ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదించారు. 

ఈయేడు భారీగా వర్షాలు

జిల్లాలో ఈయేడు వర్షాలు భారీగా పడ్డాయి. ప్రధాన చెరువులతో పాటు ప్రాజెక్టులన్నీ నిండు కుండలా ఉన్నాయి. ఇప్పటికీ వర్షాలు పడుతుండడంతో చెరువుల నుంచి మత్తడుల ద్వారా నీరు పారుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన నిజాంసాగర్‌, శ్రీరామసాగర్‌ నిండుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం ఆయకట్టుతో పాటు భూగర్భ జలా లు ఎక్కువగా ఉండడం వల్ల అన్ని గ్రామాల పరిధిలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 

వచ్చేనెల నుంచి యాసంగి సాగు

జిల్లాలో యాసంగి సాగు నవంబరు నుంచి జనవరి వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆరుతడి పం టలు పూర్తవుతున్నందున రైతులు నవంబరు ఆరం భం నుంచే సాగు మొదలుపెడతారు. మొదట ఆరు తడి పంటలు వేసిన తర్వాత వరిసాగును చేస్తారు.  కొన్ని ప్రాంతాల్లో కోతలను మొదలుపెట్టారు. ఈ నెల నుంచి నవంబరు చివరి వరకు వరి కోతలు ముగిసే అవకాశం ఉంది. డిసెంబరు, జనవరి నెలల్లో వరిసాగును రైతులు చేపట్టనున్నారు. ప్రధాన ప్రాజెక్టులైన నిజాంసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టాలు ఉన్నందున యాసంగిలో 4లక్షల 96వేల 279 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికను ఖరారు చేశారు. గత సంవత్సరం యాసంగిలో 4లక్షల 71వేల 542 ఎకరాల్లో సాగు జరగగా అంతకంటే దాదాపు 25వేల ఎకరాల్లో ఎక్కువ మొత్తంలో సాగవుతుందని అంచనా వేశారు. ఈ యాసంగిలో వరి 3లక్షల 67వేల 739 ఎకరాలు, మొక్కజొన్న 19745 ఎకరాలు, శనగ 23297 ఎకరాలు, పెసర 76ఎకరాలు, మినుములు 519 ఎకరాలు, జొన్న 12344 ఎకరాలు, నువ్వులు 11450 ఎకరాలు, పొద్దు తిరుగుడు 15339 ఎకరాలల్లో సాగువుతుందని అంచనా వేశారు. జిల్లాలోని ఆర్మూర్‌ డివిజన్‌లో 40వేల ఎకరాలకు పైగా ఎర్రజొన్నను రైతులు సాగుచేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇవేకాకుండా ఇతర పంటలు మరో 5800ల ఎకరాల వరకు సాగవుతుందని ప్రణాళికలో పొందుపర్చారు. జిల్లాలో యాసంగిలో పెద్ద మొత్తంలో సాగ య్యే అవకాశం ఉండడంతో వరి సాగుకోసం లక్షా 10 వేల 320 క్వింటాళ్ల విత్తనం అవసరమని ప్రణాళికలో పొందుపర్చారు. మొక్కజొన్న కోసం 1579 క్వింటాళ్లు, శనగ సాగు కోసం 5824 క్వింటాళ్లు, జొన్న కోసం 493 క్వింటాళ్లు, నువ్వు సాగుకోసం 229 క్వింటాళ్లు, పొద్దు తిరుగుడు సాగు కోసం 310 క్వింటాళ్లు, ఎర్రజొన్న సాగుకోసం వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. యా సంగి సాగు కోసం మొత్తం 96651 మెట్రిక్‌ టన్నుల యూరియా, డీఏపీ 26167 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపి 12262 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 37427 మెట్రిక్‌ టన్నులు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెలలోనే 40 శాతానికి పైగా ఎరువులను యాసంగి సాగుకోసం అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

విత్తనాలు సిద్ధం చేసిన విత్తనాభివృద్ధి సంస్థ

జిల్లాలో యాసంగి సాగు కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల కోసం విత్తనాలను అందుబాటులో ఉంచింది. జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా కూడా ఈ సంస్థ ద్వారా సరఫరా చేయనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో శనగ ఈ నెల నుంచే వేయనున్నందున 4 రకాల శనగ విత్తనాలను అందుబాటులో ఉంచారు. శనగ జేజీ11 17వేల క్వింటాళ్లు, జాకి9218 8800  క్వింటాళ్లు, ఎన్‌బీఈజీ 49  6వేల క్వింటాళ్లు, ఎన్‌బీఈజీ3 3500ల క్వింటాళ్లను అందుబాటులో ఉంచారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నారు. జిల్లాలో యాసంగిలో వరిసాగు కోసం ఎంటీయూ 1010 10వేల క్వింటాళ్లు, కేఎన్‌ఎం 118 5వేల క్వింటాళ్లు, జేజీఎల్‌ 24423 వెయ్యి క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 వెయ్యి క్వింటాళ్లను ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సహకార సంఘాల నుంచి రైతులకు సరఫరా చేయనున్నారు. ఇవేకాకుండా జొన్న 213 క్వింటాళ్లు, నువ్వు లు 63 క్వింటాళ్లు, పెసర 18 క్వింటాళ్లు, మినుములు 12క్వింటాళ్లను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం శనగలను సహకార సంఘాల ద్వారా అమ్మకాలను చేస్తున్నారు. కేజీ రూ.63 చొప్పున 25కిలోల బ్యాగును 1575 రూపాయలకు రైతులకు అందిస్తున్నారు. 

 రుణాల పంపిణికీ ఏర్పాట్లు

యాసంగి సాగు మొదలుకానుండడంతో ఈ నెల నుంచే పంట రుణాలను బ్యాంకుల ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు రైతులకు యాసంగి సాగుకు పంట రుణాలను అందించనున్నారు. జిల్లాలో ఈ యాసంగిలో 1538.9 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. రైతులు సాగుచేసే పంట ఆధారంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఆయా బ్యాంకుల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు దఫాలు సమీక్షించిన అదికారులు రైతులకు ఈ పంట రుణాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. రైతులు వేసే పంటల ఆధారంగా ఈ రుణ పంపిణీ చేయనున్నారు.  

ముందస్తు ఏర్పాట్లు

జిల్లాలో యాసంగి సాగుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందే చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ తెలిపారు. యాక్షన్‌ప్లాన్‌ రూపొందించడంతో పాటు ప్రభుత్వానికి పంపించామన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాలు అందుబాటులో ఉంచే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరులోపే రైతులకు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో భూగర్భ జలాలతో పాటు ప్రాజెక్టులు నిండుగా ఉండడం వల్ల సాగు విస్తీర్ణం పెరగనుందని ఆయన తెలిపారు. 

ఉమ్మడి జిల్లాలో రైతులకు కావాల్సిన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందుబాటులో ఉంచామని సంస్థ మేనేజర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. రైతులకు కొన్ని రకాల విత్తనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. శనగ సాగు ముందే చేయనున్నందున అన్ని సొసైటీల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో యాసంగి సాగు మొదలవుతున్నందున రైతులకు పంట రుణాలను ఈ నెల నుంచే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. జిల్లాలో యాసంగిలో రైతులందరికీ రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వారు వేసే పంటల ఆధారంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలను అందిస్తామని తెలిపారు.

Updated Date - 2022-10-18T06:47:18+05:30 IST