ఆహార పదార్థాల్లో నాణ్యత కరువు

ABN , First Publish Date - 2022-10-07T06:07:00+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిల్వ చేసిన మాంసంతో వంటకాలు చేస్తూ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఆహార పదార్థాల్లో నాణ్యత కరువు
హోటల్‌లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన అధికారులు(ఫైల్‌)

- ఇష్టారాజ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వహణ
- నిల్వ చేసిన మాంసంతో వంటకాలు
- కంపుకొడుతున్న వంట గదులు
- పట్టించుకోని అధికారులు

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 6:
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిల్వ చేసిన మాంసంతో వంటకాలు చేస్తూ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వంట గదులు కంపుకొడుతున్నాయి. అయినా అఽటు మున్సిపల్‌ అధికారులు గాని, ఇటు ఫుడ్‌సేఫ్టీ అధికారులు గాని కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ఫిర్యాదు రాగానే తూతూ మంత్రంగా తనిఖీల పేరుతో అప్పుడప్పుడు ఫుడ్‌సేఫ్టీ అధికారులు చుట్టం చూపులా వచ్చి వెళుతూ శాంపిళ్ల సేకరణతోనే సరిపెడుతున్నారు. పోనీ మున్సిపల్‌ అధికారులు అయినా పట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. అధికారుల నిర్లక్ష్యంతో జిల్లా కేంద్రంలో హోటళ్లు, బార్‌, ఫ్యామిలీ రెస్టారెంట్లు, ఫుట్‌పాత్‌ తినుబండరాల వ్యాపారాలు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ప్రజల ఆరోగ్యానికి ఎసరు తెస్తున్నారు. కొన్నిచోట్ల నిల్వ ఉంచిన మాంసంతో వంటకాలు చేస్తుండడంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుస్తోంది. ఇటీవల ఓ హోటల్‌లో నిల్వ ఉంచిన బిర్యానీని వడ్డిస్తున్నారనే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చాలా చోట్ల కనిపించని నాణ్యత ప్రమాణాలు
మటన్‌, చికెన్‌ అమ్మకం సమయంలో జీవాలు ఆరోగ్యవంతంగా ఉన్నాయా లేదా అని పశు సంవర్థకశాఖ వైద్యులు పరిశీలించిన తర్వాతనే అమ్మకాలు జరపాలి. కానీ పలువురు అవేమీ పట్టించుకోకుండా ధనర్జానే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, మిర్చి, బార్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌, బేకరి, గప్‌చుప్‌ బండ్ల వరకు కనీస నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. రోజంతా వినియోగించిన నూనె చల్లారిన తర్వాత తిరిగి వాడరాదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదు. పలు మిర్చి దుకాణాలు, పలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకుల తీరుతో ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిలా ్లకేంద్రంలో 170 వరకు  హోటల్‌లు, రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లు 4, బేకరీలు 20, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు 30, టిఫిన్‌సెంటర్లు 80 వరకు ఉన్నాయి. అందులో అధిక మొత్తంలో నిర్వాహకులు ఎక్కడా పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే తినుబండారాల విక్రయాలు జరుపుతూ ప్రజల ప్రాణాలతో చెలాగాటం ఆడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నిల్వ చేసిన మాంసంతో వంటకాలు
మిగిలిపోయిన మటన్‌, చికెన్‌, ఇతర తినుపదార్థాలను డీ ఫ్రిజ్‌లో నిల్వచేస్తూ మరుసటిరోజు అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రంగులను కలుపుతూ కేన్సర్‌, గుండెజబ్బుల వంటి ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నారు. కొంతమంది యజమానులు ట్రేడ్‌, ఫుుడ్‌సేఫ్టీ లైసెన్స్‌ లేకుండానే హోటళ్లను యథేచ్ఛగా నడిపిస్తున్నారు. మరికొందరైతే మాంసం విక్రయాలు చేసే వారితో బేరం కుదుర్చుకుని నిల్వ ఉంచిన మాంసాన్ని తక్కువ ధరకు తీసుకువచ్చి వంటకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపల్‌ అధికారులు పలు దుకాణ సముదాయాల్లో దాడులు చేసినప్పుడు మాంసం నిల్వ ఉంచడంతో భారీ జరిమానా సైతం విధించారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడంతోనే వ్యాపారులు తమకు నచ్చినట్టుగా చేస్తున్నారని వాదనలు లేకపోలేదు.
అధ్వానంగా శానిటేషన్‌
శుభ్రత విషయంలో హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. టేబుళ్లను క్లీన్‌ చేసే సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్లేట్లు, గ్లాసులను రెండు బకెట్లలో ముంచేసి శుభ్రం చేయడంతోనే పని కానిచ్చేస్తున్నారు. పరిశుభ్రతపై అనేక హోటళ్లలో చిన్నపాటి గొడవలు జరుగుతునే ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో ఇవ్వన్నీ కనిపిస్తున్నా చర్యలు మాత్రం నామ మాత్రంగానే ఉంటున్నాయి. ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేక సార్లు పట్టుబడినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నది లేదు. శాంపిళ్ల సేకరణలో తప్పనితేలితే జరిమానా, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని దుకాణ యజమానులను, వ్యాపారులకు  హెచ్చరికలు జారీ చేసి తిరిగి వారి వద్దే మూమూళ్లను తీసుకుని చర్యలు తీసుకోకుండా నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడితే ఆయా తినుబండరాల కేంద్రాల్లో ఉన్న అధ్వానమైన శానిటేషన్‌ పరిస్థితులు బట్టబయలవుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Read more