రంజుగా రాజకీయం.. పండుగగా వ్యవసాయం!

ABN , First Publish Date - 2022-12-31T00:59:34+05:30 IST

2022లో జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. ప్రధానంగా ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు పొటాపోటీగా చేపట్టాయి.

రంజుగా రాజకీయం.. పండుగగా వ్యవసాయం!
జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న రాహుల్‌ గాంధీ

- కాంగ్రెస్‌లో జోష్‌ నింపిన రాహుల్‌ జోడో యాత్ర

- ఎల్లారెడ్డిలో మన ఊరు-మన పోరుతో రేవంత్‌రెడ్డి బహిరంగసభ

- జిల్లాలో వైఎస్‌ఆర్‌టీపీ షర్మిల పాదయాత్ర

- జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

- పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు, కేటీఆర్‌, హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డిల పర్యటన

- జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరు

- కాలం కలిసొచ్చినా.. ప్రకృతి కన్నెర్రతో వ్యవసాయానికి నష్టమే..

- విస్తారంగా వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులకు జలకళ.. విస్తారంగా పంటల సాగు

- అకాల వర్షాలతో రైతులకు, పంటలకు తీవ్ర నష్టం

- జిల్లాలో ఆగని నేరాలు, ఘోరాలు.. నెత్తురోడిన రహదారులు

- పెరిగిన సైబర్‌ నేరాలు, హత్యలు, ఆత్మహత్యలు

- 2022 సంవత్సరం సంగతులు

కామారెడ్డి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): 2022లో జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. ప్రధానంగా ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు పొటాపోటీగా చేపట్టాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారంతో అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు వైఎస్‌ఆర్‌టీపీ వామపక్షాలు సైతం ప్రజల్లోకి వెళ్తూ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. పాదయాత్రలు, బహిరంగ సభలు, ర్యాలీలతో పట్టణ కేంద్రంలోనే కాకుండా మండల, గ్రామాల్లోనూ రాజకీయ పార్టీలు సందడి చేశాయి. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. రాజకీయం ఇలా ఉండగా జిల్లాకు పలు ప్రాజెక్టులు సైతం మంజూరు అయ్యాయి. ప్రధానంగా మెడికల్‌ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విస్తారంగా వర్షాలు కురువడంతో కాలం కలిసొచ్చిందని ఆనందంలో ఉన్న అన్నదాతల ఆశలను ప్రకృతి కన్నెర్ర చేసి భారీ, అకాల వర్షాలతో అడియాశలు చేసింది. విస్తారంగా వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రైతులు విస్తారంగా పంటలు సాగు చేస్తుంటారు. అయితే కోతల సమయంలో అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. జిల్లాలో ఈ యేడు కూడా నేరాలు, ఘోరాలు ఆగలేదు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు చాలానే జరిగాయి. జిల్లాకు ఈ ఏడాది నెత్తుటి మరకనే విధించింది. దొంగతనాలతో పాటు హత్యలు, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు జరిగాయి. జిల్లాలో 2022 కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. నేటితో ఈ ఏడాది ముగియనుంది. జిల్లాలో ఈ ఏడాదిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రముఖల పర్యటనలు, విషాధాలు, వింతలు, ఆందోళనలు, ఉద్యమాలపై ‘ఆంరఽధజ్యోతి’ అందిస్తున్న సంవత్సరం సంగతులు.

అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆందోళనతో రోడ్డెక్కిన బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు

రాష్ట్రంలో అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ ఈ ఏడాదిలో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను వెలిబుచ్చుతుందంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నాలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే కేంద్రప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై బీఆర్‌ఎస్‌ ఆందోళన చేపట్టింది. అంతేకాకుండా అభివృద్ధి పేరిట జిల్లాలో మంత్రులు పర్యటించారు. బీబీపేట మండలం కోనాపూర్‌లో మున్సిపల్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. బాన్సువాడలో నర్సింగ్‌ కళాశాలను, మద్నూర్‌లో నూతన మండలం డోంగ్లీని, కామారెడ్డిలో న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ తదితరులు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపిన రాహుల్‌ పాదయాత్ర

ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు ప్రజా సమస్యలే ఎజెండాగా పలు ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతూ వచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ముఖ్యనేతలతో బహిరంగ సభలు పాదయాత్రలు నిర్వహించారు. మన ఊరు-మన పోరు కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభను నిర్వహించి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా కాంగ్రెస్‌ శ్రేణుల్లోనూ జోష్‌ నింపారు. నవంబరులో ఏఐసీసీ నేత రాహుల్‌గాంఽధీ జిల్లా మీదుగా భారత్‌ జోడో యాత్ర రెండు రోజుల పాటు కొనసాగింది. తెలంగాణ వ్యాప్తంగా సాగిన రాహుల్‌ పాదయాత్ర వీడ్కోల్‌ బహిరంగ సభ జుక్కల్‌లో నిర్వహించడంతో రాహుల్‌ ప్రసంగం కాంగ్రెస్‌ శ్రేణులను మరింత ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ సైతం నియోజకవర్గంలో పలుమార్లు పాదయాత్ర చేపడుతూ ప్రజల్లోకి వెళ్లారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ధాన్యం కొనుగోళ్లు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌ చార్జీల పెంపుపై ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతూ వచ్చారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన

కేంద్ర, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబరులో జిల్లాలో మూడు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరుతో పాటు బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతానికై కార్యకర్తలు సమావేశాన్ని చేపడుతూ జిల్లాలో పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటించారు. ఇందులో భాగంగానే బీర్కూర్‌లో ఓ రేషన్‌షాప్‌ను పరిశీలించిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రేషన్‌ పంపిణీలో వాటా ఎంత అని జిల్లా కలెక్టర్‌ను కేంద్ర మంత్రి ప్రశ్నించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అదేవిధంగా కామారెడ్డి, ఎల్లారెడ్డిలోనూ కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొన్నారు. మరోవైపు బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను భిక్కనూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అదేవిధంగా కామారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల జిల్లాలో వారం రోజుల పాటు పాదయాత్ర కొనసాగించింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర నిర్వహించి స్థానిక ఎమ్మెల్యేల అవినీతిపై దుమ్మెత్తిపోశారు.

పెరిగిన సైబర్‌ నేరాలు.. తగ్గని రోడ్డు ప్రమాదాలు

జిల్లాలో 2022లో రహదారులు నెత్తురొడ్డాయి. హత్యలు, ఆత్మహత్యలు సైతం పెరిగాయి. దొంగతనాలు పరపాటిగా మారాయి. రోజుకో సైబర్‌ నేరం కేసులు నమోదవుతూ వచ్చాయి. జిల్లాలో మాచారెడ్డి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మృత్యువాత పడ్డారు. అదేవిధంగా ఎల్లారెడ్డి పట్టణ శివారులో అన్నాసాగర్‌ వద్ద లారీని ఢీకొని టాటాఏసీ ట్రాలీ ఘటనలు సుమారు 8 మంది మృత్యువాత పడ్డారు. ఇలా జిల్లాలో ఏదో ఒకచోట ప్రతిరోజూ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం ప్రాణ నష్టం జరుగుతునే ఉంది. ఈ యేడు 505 రోడ్డు ప్రమాదాలు.. 237మంది మృతి చెందారు. 277 సైబర్‌ కేసులు నమోదు కాగా రూ.2కోట్లు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. జిల్లాలో గతంతో పోలిస్తే పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు. ఈ ఏడాది 35 హత్యలు జరుగగా.. 390 ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఆశ.. నిరాశ!

ఈ ఏడాది కాలం వ్యవసాయరంగంతో పాటు రైతాంగానికి కలిసివచ్చిందని ఎంతగానో ఆశగా చూశారు. కానీ పంటలు చేతి కొచ్చి కోతల సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడం అకాల వర్షాలు, వడగళ్లు రైతుల ఆశలపై నిండా నీళ్లు పోశాయి. గత యాసంగి సీజన్‌తో పాటు ఇటీవల ముగిసిన వర్షాకాలం సీజన్‌లోనూ జిల్లా రైతులు విస్తారంగా పంటలను సాగు చేసినా దిగుబడులు వచ్చే సమయంలో ఓ వైపు అకాల వర్షాలు మరోవైపు కొనుగోళ్లపై ప్రభుత్వాల ఆంక్షలు రైతులను ఆగం చేసింది. గత యాసంగి సీజన్‌లో జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలను రైతులు సాగుచేశారు. ఇందులో వరి 2.10 లక్షల ఎకరాల్లో సాగు చేయగా మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. గత వర్షాకాలంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు జిల్లాలోని నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు సైతం అమాంతంగా పెరిగాయి. గడిచిన వానాకాలం సీజన్‌లో 5 లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగయ్యాయి. వరి 3 లక్షల ఎకరాల్లో సాగు కాగా 6 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడులు వచ్చాయి. అయితే ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం నెలకొంటూ వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోళ్ల లొల్లి మొదలైంది. ధాన్యం కొనుగోలు చేసిది మీదంటే మీదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పడడంతో కొనుగోళ్లలో జాప్యం నెలకొంటూ వచ్చింది. దీనికి తోడు అకాల వర్షాలు రైతులను మరింత ఆగం చేసింది. ఇలా ఈ ఏడాది యాసంగి వానాకాలం సీజన్‌లలో ఽపంటలు విస్తారంగా సాగైన దిగుబడులు వచ్చిన కొనుగోళ్లలో జాప్యం నెలకొనడం, మద్దతు ధర లేకపోవడం తీవ్ర నష్టానే మిగిల్చింది.

పలువురు అధికారుల బదిలీలు

ఈ ఏడాదిలో పలువురు జిల్లా స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. జిల్లా ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌గా పని చేసిన వెంకట మాధవరావు పలు వివాదాలతో జిల్లా నుంచి బదిలీపై వెళ్లిపోయారు. అనంతరం అదనపు కలెక్టర్‌గా చంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించింది. డీఆర్‌డీఏ పీడీగా సాయన్న బాధ్యతలు చేపట్టారు. మత్స్యశాఖ, పంచాయతీశాఖ, వైద్యఆరోగ్యశాఖ, డీఎస్‌వో బదిలీపై జిల్లాకు వచ్చారు. అదేవిధంగా జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ కళాశాలను మంజూరు చేసింది. దీంతో పాటు ఇటీవల మెడికల్‌ కళాశాలకు చెందిన ప్రొఫెసర్‌లను సైతం నియమించారు. కొత్త మండలాలుగా డోంగ్లీ, పల్వంచను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-12-31T00:59:34+05:30 IST

Read more