అర్హులకే పోడు పట్టాలు

ABN , First Publish Date - 2022-10-08T04:28:43+05:30 IST

పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని ఎట్టి పరిస్థితిల్లోనూ అనర్హులకు పట్టాలు ఇవ్వకూడదని కలెక్టర్‌ రెవెన్యూ, పంచాయతీ, ఫారెస్టు అధికారులను ఆదేశించారు.

అర్హులకే పోడు పట్టాలు
లింగంపేటలో మాట్లాడుతున్న కలెక్టర్‌

- లింగంపేట మండలంలో 2,694
- ఎల్లారెడ్డిలో 777 దరఖాస్తులు
- పోడు భూముల పేరుతో చెట్లను నరికితే క్రిమినల్‌ కేసులు
- కలెక్టర్‌ జితేష్‌ వీ. పాటిల్‌


లింగంపేట, అక్టోబరు 7: పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని ఎట్టి పరిస్థితిల్లోనూ అనర్హులకు పట్టాలు ఇవ్వకూడదని కలెక్టర్‌ రెవెన్యూ, పంచాయతీ, ఫారెస్టు అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం లింగంపేట మండల పరిషత్తు కార్యాలయంలో లింగంపేట, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన అటవీ, పంచాయతీ, రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పోడు భూముల పరిరక్షణ కమిటీ సభ్యులు తీర్మానించిన వారికి భూములు కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నారని ఒక బీట్‌ అధికారి కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా అర్హులకు మాత్రమే ఇవ్వాలని సూచించారు. పోడు భూముల పట్టాల కోసం ఎవరైనా అధికారులను ఇబ్బందులు పెడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. పోడు భూముల పట్టాల కోసం లింగంపేట మండలంలో 2,694 మంది, ఎల్లారెడ్డి మండలంలో 777 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. పోడు భూముల జాయింట్‌ సర్వేను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాల ఆధారంగా ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సర్వేలు నిర్వహించాలని తెలియజేశారు. పోడు భూముల పేరిట చెట్లను నరికే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు సాగు చేస్తున్న భూములు అటవీ శాఖకు చెందినవా, రెవెన్యూకు చెందినవా అనేది ముందుగా తేల్చాలన్నారు.  ఎన్ని సంవత్సరాలుగా సాగులో ఉన్నారు అనే వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఫారెస్ట్‌ రేంజి అధికారి ఓంకార్‌, లింగంపేట, ఎంపీడీవో నారాయణ, తహసీల్దార్‌ మారుతి, ఆర్‌ఐ బాలయ్య, రెండు మండలాలకు చెందిన అటవీ అధికారులు, పంచాయతీల కార్యదర్శులు ఉన్నారు.

Updated Date - 2022-10-08T04:28:43+05:30 IST