పంద్రాగస్టుకు పాత దుస్తులేనా?

ABN , First Publish Date - 2022-08-12T05:36:31+05:30 IST

పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వ విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందేలా మాత్రం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పంద్రాగస్టుకు పాత దుస్తులేనా?
యూనిఫాంలు అందక సివిల్‌ డ్రెస్‌లలో పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థులు

- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందని యూనిఫాం

- పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా యూనిఫాం లేదు

- యూనిఫాం క్లాత్‌ వచ్చినా కుట్టించని పరిస్థితి

- జిల్లాలో మొత్తం 1లక్ష 3వేల 5వందల 87మంది విద్యార్థులు

- ఇప్పటి వరకు 25వేల మందికి మాత్రమే అందిన యూనిఫాంలు

- మిగతా 80వేల మంది విద్యార్థులు యూనిఫాంల కోసం ఎదురుచూపులు

- సమస్యగా మారిన కుట్టుకూలీ


కామారెడ్డి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వ విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందేలా మాత్రం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పుర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 25 వేల మంది విద్యార్థులకు మాత్రమే యూనిఫాంలను అందజేశారు. మిగతా 80వేల మందికి పైగా విద్యార్థులు యూనిఫాం కోసం ఎదురుచూస్తున్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. పాఠశాల యూనిఫాం అందక ఈ పంద్రాగస్టుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాత దుస్తులతోనే హాజరుకానున్నారు.

జిల్లాలో 1.3లక్షల మంది విద్యార్థులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో మొత్తం 1,011 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1లక్ష 3వేల 587 మందికి పైగానే విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ విద్యార్థులందరికీ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యాశాఖ తరపున పాఠ్యపుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాంను అందజేయాల్సి ఉంటుంది. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సరిపడా పుస్తకాలు, యూనిఫాం ఇప్పటికీ అందలేదు. ప్రస్తుతం 25వేల మందికి మాత్రమే యూనిఫాంను అందజేసినట్లు విద్యాశాఖధికారులు చెబుతున్నారు.

మూడేళ్లుగా అందని యూనిఫాంలు

జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు గత మూడేళ్ల నుంచి యూనిఫాం పంపిణీ చేయడం లేదు. గత రెండు విద్యా సంవత్సరాల్లో కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు జరగకపోవడంతో విద్యార్థులకు యూనిఫాంలు ఉపయోగపడలేదు. ఈ ఏడాది జూన్‌ 13 నుంచి యదావిధిగా పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో తరగతులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా యూనిఫాం పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చినిగిన దుస్తులతోనే పాఠశాలలకు వస్తూ అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఏటా అన్ని జిల్లాల్లో సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాంలను పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ జరిగినప్పటికీ కామారెడ్డిలో మాత్రం విద్యార్థులకు అందడం లేదు.

సమస్యగా మారిన కుట్టుకూలీ

జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫాం కోసం క్లాత్‌ను ప్రభుత్వం సరఫరా చేసింది. కానీ యూనిఫాం కుట్టు కూలీకై సమస్యలు ఏర్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు బాల, బాలికలకు కొలతలు తీసుకుని కుట్టుకూలి ఇచ్చే బాధ్యత ఎస్‌ఎంసీ సభ్యులకు అప్పగించారు. 1 నుంచి 7వ తరగతి వరకు షర్ట్‌, నిక్కర్‌, 8వ తరగతి నుంచి వారికి షర్ట్‌, ప్యాంట్‌ బాలుర కోసం కుట్టించి ఇవ్వాలి. కుట్టుకూలీకై ప్రభుత్వం రూ.50 చొప్పున రూ.100ను పాఠశాల ఖాతాలో జమ కూడా చేశారు. వచ్చిన వాటిని టైలర్‌కు అందజేసి కుట్టించాల్సి ఉంటుంది.

పాత బట్టలతోనే..

పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులు పాత బట్టలు వేసుకుని పాఠశాలలకు వెళ్తున్నారు. ఒక యూనిఫాంకు రూ.50 ఇవ్వడంతో టైలర్‌ నాణ్యతగా ఇవ్వడంతో ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేకపోవడంతో అవి ఏడాది కాలం ఉండకపోగా చిరిగిపోతున్నాయి. ఉన్నటువంటి వాటినే వేసుకుని పాఠశాలలకు వస్తున్నారు. ఈ నెల 15న జరిగే పంద్రాగస్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు వజ్రోత్సవాల కార్యక్రమాలను చేపడుతూ విద్యార్థులను భాగస్వామ్యులుగా చేస్తోంది. ఇప్పటికే ఈ వజ్రోత్సవాలు ప్రారంభమై పాఠశాలల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ విద్యార్థులకు యూనిఫాం అందకపోవడంతో పాత దుస్తులు చినిగిన యూనిఫాంతోనే పంద్రాగస్టు వజ్రోత్సవాలకు హాజరుకావాల్సి వస్తోంది.


ఆరు మండలాలకు దుస్తులను అందజేశాం

- శ్రీపతి, సెక్టోరియల్‌ అధికారి, కామారెడ్డి

జిల్లాలోని 6 మండలాలకు దుస్తులను అందజేశాం. మొత్తం 1లక్ష 3వేల 587 మంది విద్యార్థులకు గాను 25వేల మంది విద్యార్థులకు అందజేశాం. ఇప్పటికే క్లాత్‌ వచ్చింది కానీ కుట్టి విద్యార్థులకు అందడంలో కొద్దిమేర ఆలస్యం అవుతుంది. ఈనెల 16, 17 వరకు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం.

Updated Date - 2022-08-12T05:36:31+05:30 IST