కొత్త ఏడాది.. కొత్త ఆశలు!

ABN , First Publish Date - 2022-12-31T23:37:30+05:30 IST

ఎన్నో ఆశలు.. మరెన్నో లక్ష్యాలతో కామారెడ్డి జిల్లా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

కొత్త ఏడాది.. కొత్త ఆశలు!

కొవిడ్‌ మరోసారి రావద్దని కోరుకుంటున్న వ్యాపారులు, ఉద్యోగులు

- ప్రభుత్వ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న యువత, నిరుద్యోగులు

- జనంలో ఉండేలా ప్రణాళిక చేసుకుంటున్న రాజకీయ నాయకులు

- జిల్లా మరింత అభివృద్ధి బాటలో నడవాలి

- 2023ను స్వాగతం పలికిన జిల్లా వాసులు

కామారెడ్డి, డిసెంబరు 31(ఆఽంధ్రజ్యోతి): ఎన్నో ఆశలు.. మరెన్నో లక్ష్యాలతో కామారెడ్డి జిల్లా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. విద్య, వైద్యం, ఉపాఽధి రంగాలతో పాటు ఆరోగ్యమే మహా భాగ్యం అంటూ జిల్లా మరింత అభివృద్ధి బాటలో నడవాలని ప్రజలు కోటి ఆశలతో ఆకాంక్షిస్తున్నారు. కరోనా మహమ్మారి మరోసారి విజృంభించకుండా కొత్త సంవత్సరం మరింత సాఫీగా సాగిపోవాలంటూ చిరు వ్యాపారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. కాలం కలిసివచ్చి పంటల ఉత్పత్తులకు మంచి మద్దతు ధర లభించాలని రైతన్నలు ఈ ఏడాది ఉంటామనే నమ్మకంతో ఉన్నారు. సాధారణ ఎన్నికలు ఈ ఏడాదిలోనే ఉండడంతో రాజకీయ నాయకులంతా జనంలో ఉండి వారి నమ్మకాన్ని పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక యువత శ నివారం పలుచోట్ల అర్ధరాత్రి వేళ టపాకాయలు పేలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ, కేక్‌లు కట్‌ చేసి న్యూ ఇయర్‌ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. 2022 సంవత్సరానికి గుడ్‌బై చెబుతూ.. 2023కి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు.

కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి..

2023 కొత్త సంవత్సరంపై జిల్లా వాసులు ఎన్నో కొత్తకొత్త ఆశలు పెట్టుకుంటున్నారు. విదేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత రెండు సంవత్సరాల పరిస్థితులు ఈ ఏడాదిలో రావద్దని అన్ని వర్గాల ప్రఽజలతో పాటు ప్రధానంగా చిరు వ్యాపారులు, ప్రైవేట్‌ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఈ కొత్త ఏడాదిలోనైనా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో యువతి, యువకులు, నిరుద్యోగులు ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఆశిస్తున్నారు. ప్రధానంగా కొత్త ప్రాజెక్టు అయిన కామారెడ్డిలో మెడికల్‌ కళాశాల పనులను ఈ ఏడాదిలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని రైతాంగానికి సాగునీరు అందించేందుకై కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాలో కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాఽధి కల్పించాలని యువత ఆకాంక్షిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, దోపిడీలు హత్యలు, ఆత్మహత్యలు లేకుండా చర్యలు తీసుకునేందుకు పోలీసుశాఖ సైతం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకుంటుంది.

జనంలోకి వెళ్లడమే రాజకీయ పార్టీల సంకల్పం

ఈ కొత్త ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో జనంలో ఉండేలా రాజకీయ పార్టీలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. రాజకీయ నాయకులు సైతం నిత్యం ప్రజల్లో మమేకం అయ్యేలా కార్యాచరణలకు దిగుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఏకచత్రాధిపత్యం సాగిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ, ఆ పార్టీ నాయకులు ఇదే ఊపును మరింత కొనసాగించేలా ప్రజాప్రతినిధులు గ్రామాల బాట పట్టారు. ఈ ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా కార్యాచరణను అమలుచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జిల్లాపైనే ఆశలు పెట్టుకున్న ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడాలని నిర్ణయించుకుంటున్నారు. తమ పార్టీల విధానాలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై బలంగా పోరాడడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేలా ఉద్యమ కార్యాచరణను చేపట్టాలని ఈ రెండు పార్టీల నాయకులు సంకల్పించుకున్నారు.

కొత్త సంవత్సరంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

- పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్పీకర్‌

కొత్త సంవత్సరంలో అన్ని రంగాల ప్రజలు తమతమ రంగాల్లో విజయాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలషించారు. జిల్లా ప్రజలకు 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలంతా నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలన్నారు.

మెడికల్‌ కళాశాల పనులు పూర్తి చేయడమే లక్ష్యం

- గంప గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌

కామారెడ్డి జిల్లా కేంద్రానికి మంజూరైన మెడికల్‌ కళాశాల పనులను కొత్త ఏడాదిలో పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌లోని రైతాంగానికి సాగు నీటిని అందించేందుకు కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు కొత్త సంవత్సరంలో పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తాం.

నాగమడుగు ఎత్తిపోతల పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం

- హన్మంత్‌షిండే, ఎమ్మెల్యే, జుక్కల్‌

జుక్కల్‌ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లోని రైతాంగానికి సాగు నీరు అందించేందుకు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను కొత్త ఏడాదిలో పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మాణం చేపట్టి పేదలకు అందిస్తాం. దెబ్బతిన్న రహదారులను మరమ్మతు చేస్తాం. ప్రతీ గ్రామానికి రహదారులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. 2023 సంవత్సరం అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నా. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం

- జాజాల సురేందర్‌, ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పలు ప్రణాళికతో ముందుకు పోతాం. నియోజకవర్గ నలుమూలల్లో అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం ఇచ్చే రూ.3లక్షలు, డబుల్‌బెడ్‌ ఇళ్లను నిరుపేదలకు కట్టిస్తాం. 22వ ప్యాకేజీ పనులు ఈ ఏడాదిలో పూర్తిచేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందిస్తాం.

అన్ని వర్గాల ప్రజలకు అంతా మంచే జరగాలి

- జితేష్‌ వి.పాటిల్‌, కలెక్టర్‌, కామారెడ్డి

కొత్త సంవత్సరంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాం. కొవిడ్‌ మరోసారి విజృంభించే అవకాశం ఉన్నందున అందరు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. అందరి సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి బాటలో నడుపుతాం. అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టితో మరింత రెట్టింపుతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. జిల్లా ప్రజలకు, రైతులకు, ప్రజాప్రతినిధులకు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండాలి

- శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత చేదు అనుభావాలను మర్చిపోయి ప్రజలందరు పక్కా ప్రణాళికతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. జిల్లా ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఉండేవిధంగా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తాం. ప్రతి ఒక్కరూ రహదారుల నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. న్యూయర్‌ వేడుకలను ప్రతి ఒక్కరూ కుటుంబసభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలి.

Updated Date - 2022-12-31T23:37:33+05:30 IST