నేతల కనుసన్నల్లోనే భూ కబ్జాలు

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

జిల్లాలోని పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో ప్రభుత్వ, అసైన్‌మెంట్‌ భూములపై పలువురు నేతల కన్ను పడుతోంది.

నేతల కనుసన్నల్లోనే భూ కబ్జాలు
పోకాల కుంటలో మట్టిని నింపి కబ్జా చేసిన వెంచర్‌ నిర్వాహకులు

- పట్టణాల్లో ప్రభుత్వ భూములపై నేతల కన్ను

- ఇటీవల మూడు మున్సిపాలిటీల్లో పలు ప్రభుత్వ భూముల కబ్జా

- కుంటలు, చెరువులను వదలని నేతలు

- కామారెడ్డి నడిబొడ్డున కోట్లు విలువ చేసే కుంట భూమి కబ్జాకు యత్నం

- ప్రధాన రహదారి పక్కనే ఎల్లమ్మకుంట అర ఎకరం భూమి కబ్జాలోకి

- ఎల్లారెడ్డిలో దేవాదాయ, సొసైటీ, కుంటల భూముల కబ్జా 

- బాన్సువాడలోని కోట్లు విలువ చేసే ప్రభుత్వ అమ్మకానికి పెట్టిన కబ్జాదారులు

- స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల ఆగడాలతోనే కబ్జాలు


కామారెడ్డి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో ప్రభుత్వ, అసైన్‌మెంట్‌ భూములపై పలువురు నేతల కన్ను పడుతోంది. ఇటీవల మూడు మున్సిపాలిటీల్లో స్థానికంగా ఉండే అధికార పార్టీకి చెందిన నేతలు భూముల కబ్జాకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా కేంద్రమైన కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువుల శిఖం భూములు పలువురు నేతల కబ్జాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అధికారులతో కుమ్మక్కై అక్రమంగా పట్టాలు సృష్టించి భూములు కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ, మండల శివారుల్లో ప్రభుత్వ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు పాగా వేసేస్తున్నారు. పట్టణాల్లో, శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు జోరందుకోవడం, వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతుండడంతో భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. దీంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ స్థలాలపై పడుతోంది. మున్సిపల్‌, రెవెన్యూ, నీటి పారుదల శాఖలకు చెందిన పార్కులు, కుంటలు, ఖాళీ ప్రభుత్వ స్థలాలను స్థానిక నేతలతో కలిసి కబ్జాదారులు దర్జాగా ఆక్రమిస్తూ ప్లాట్లుగా మార్చుతూ కోట్లు విలువ చేసే భూములను అమ్మేస్తున్నారు. ఈ వ్యవహారమంతా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.

కామారెడ్డిలో ప్రభుత్వ భూములపై నేతల కన్ను 

కామారెడ్డి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. జిల్లా కేంద్రంగా మారడంతో పట్టణ శివారులోని కొత్త కాలనీలు వెలుస్తూ వచ్చాయి. శివారు ప్రాంతాలను సైతం బల్దియాలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతాల్లో నివాస గృహాలు, భారీ భవంతుల నిర్మాణాలు వెలుస్తుండడంతో భూముల విలువ అమాంతంగా పెరిగిపోయింది. ఖాళీ స్థలాలు సైతం దొరకని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో పట్టణంలోని ప్రభుత్వ, అసైన్‌మెంట్‌, నీటిపారుదలశాఖ, ఆర్‌అండ్‌బీ స్థలాలపై స్థానికంగా ఉండే కబ్జాదారులు నేతల అండతో కబ్జాలకు పాల్పడుతున్నారు. జిల్లా నడిబొడ్డున ఉన్న ఎన్నో సంవత్సరాల చరిత్ర గల డిగ్రీ కళాశాలకు చెందిన భూములను ఇప్పటికే కొందరు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు. అయితే ప్రధాన రహదారి పక్కన ఉన్న గ్రౌండ్‌ను కబ్జా చేసేందుకు స్థానికంగా ఉండే కొందరు నేతలు ఇతరులతో కోర్టులో కేసు వేసి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ ప్రాంతంలోనూ కొందరు నేతలు ప్రభుత్వ భూములను కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న ఎల్లమ్మకుంటను స్థానికంగా ఉండే కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రఽదాన రహదారి పక్కనే కుంట ఉండడంతో అందులోకి మట్టిని కుడిపేసి సుమారు ఎకరంన్నర కుంట భూమిని కబ్జాపెట్టారు. కబ్జా బహిరంగంగా అయినప్పటికీ సంబంధిత మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు నేతలను అడ్డుకునే దమ్ములేకుండా పోయింది. కబ్జాదారులకు అధికారులు అండగా ఉన్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎల్లారెడ్డిలో గుంట భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారు

ఎల్లారెడ్డి మున్సిపల్‌గా ఏర్పడిన తర్వాత శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు రెక్కలు వచ్చాయి. కొన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో కలవడంతో ఆ గ్రామాల్లోని వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జాదారులు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వెంచర్లుగా మార్చి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. అక్రమ వెంచర్లకు అనుమతులు ఇవ్వవద్దని నాన్‌ లేఅవుట్‌లు జరగకుండా చూడాలని ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తున్నా అక్రమ వెంచర్లు మాత్రం ఆగడం లేదు. వెంచర్లు, లేఅవుట్‌ల చాటున స్థానికంగా ఉండే ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారు. ఇటీవల పోకాల కుంటకు సంబంధించిన ఎకరన్నర భూమిని స్థానిక వెంచరు నిర్వాహకులు కబ్జా చేసి మట్టితో కుడిపేశారు. గత ఆరునెలల కిందట ఎల్లారెడ్డి పట్టణంలోని బస్సుడిపో సమీపంలో ఎల్లారెడ్డి సొసైటీకి సంబంధించిన ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన సొసైటీ పాలకవర్గ సభ్యుల్లోని కొందరు తమ పేరిట గుంట చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆరోపణలు రావడంతో కొందరు రెవెన్యూతో పాటు సహకార శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములను కాపాడాల్సిన పాలకవర్గ సభ్యులే సొంత సంస్థ భూమిని కబ్జా చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో గల బీసీ కాలనీ పక్కన దేవాదాయశాఖకు సంబంధించిన రెండెకరాల భూమిని గతంలో కొందరు కబ్జాచేసి వెంచర్లుగా మార్చి ప్లాట్లను విక్రయించారు. ఈ భూములను ఇప్పటికీ కబ్జాదారుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకోకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.


- బాన్సువాడలోను ఆగని భూ కబ్జాలు.

బాన్సువాడ బల్ధియాలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు, రియల్టర్‌లు స్థానిక నేతల అండతో ఆ స్థలాల్లో పాగా వేసేస్తున్నారు. కోట్ల విలువ చేసే మున్సిపల్‌ స్థలాలు, అసైన్‌మెంట్‌ భూములను కబ్జాచేసి విక్రయానికి పెడుతున్నారు. బాన్సువాడ పట్టణంలో ఇటివల ఇస్లాంపూర్‌ కాలనీలో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి ప్లాట్లుగా మార్చారు. ఈ కాలనీలోని మున్సిపాలిటికి చెందిన రెండెక్కరాల నాలుగు గుంటల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్‌చేసుకున్నారనే దానిపై వివాదం నెలకొంది. ఈ వివాదంతో ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లను కూడా రద్దుచేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పట్టణంలోని కొత్తగా ఏర ్పడిన ఓ వెంచర్‌కు సంబంధించిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖాళీ స్థలాన్ని నిర్వహకులు మున్సిపల్‌కు కేటాయించారు. ఈ ఖాళీ స్థలాన్ని స్థానికంగా ఉండే ఓ నేత ఆక్రమించేందుకు ప్రయత్నించగా స్థానికులు ఫీర్యాదుతో మున్సిపల్‌ అధికారులు ఆ స్థలం చుట్టు హద్దులు పాతి బల్దియా స్థలమని బోర్డుఏర్పాటుచేశారు. అంతేకాకుండా పట్టణ శివారుల్లోని అసైన్‌మెంట్‌ భూములకు సైతం సంబంధిత శాఖ అధికారులతో నకిలి పత్రాలను సృష్టించి కబ్జాచేసి వెంచర్లుగా మార్చేస్తున్నారు. ఇదంతా స్థానికంగా ఉండే కొందరు నేతల అండతోనే చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాని అధికారుల్లో మాత్రం భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో మరింత విమర్శలకు తావిస్తుంది.

Read more