కట్టుకున్నోళ్లే.. కడతేరుస్తున్నారు!

ABN , First Publish Date - 2022-09-08T06:38:45+05:30 IST

జీవితాంతం తోడుంటానని, కంటికి కనురెప్పలా చూసుకుంటానని చేస్తున్న బాసలు - మాటలు గాలిలో కలిసిపోతున్నాయి. అనుమానంతో భార్యను, పిల్లలను చంపుతున్న భర్తలు, భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం, భర్త మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం అడ్డుగా ఉందని భార్యను చంపడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటుండడం ఆందోళన కల్గిస్తోంది.

కట్టుకున్నోళ్లే.. కడతేరుస్తున్నారు!
ఆర్మూర్‌లో భార్యను చంపిన భర్త

- ఆందోళన కల్గిస్తున్న వివాహేతర సంబంధాల హత్యలు
- అడ్డుతొలగించుకునేందుకు ఘాతుకాలు
- అయినవారే హతమారుస్తున్న వైనం
- డబ్బు, వివాహేతర సంబంధాలు హత్యలకు ప్రధాన కారణం
- రోజుకో హత్య - ఆత్మహత్యలతో పెరుగుతున్న నేర ప్రవృత్తి
- కట్టుకున్నుల్లే కడతేరుస్తున్న సంఘటనలు
- నిజామాబాద్‌ జిల్లాలో వరుసగా మూడు రోజుల్లో మూడు సంఘటనలు
- మంటకలుస్తున్న మానవ సంబంధాలు
- ఉమ్మడి జిల్లాలో ఐదు నెలల్లో 23కు పైగా వివాహేతర సంబంధాల హత్యలు

కామారెడ్డి, సెప్టెంబరు 7(ఆంఽధ్రజ్యోతి): జీవితాంతం తోడుంటానని, కంటికి కనురెప్పలా చూసుకుంటానని చేస్తున్న బాసలు - మాటలు గాలిలో కలిసిపోతున్నాయి. అనుమానంతో భార్యను, పిల్లలను చంపుతున్న భర్తలు, భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం, భర్త మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం అడ్డుగా ఉందని భార్యను చంపడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటుండడం ఆందోళన కల్గిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో వరుసగా మూడు రోజుల్లో మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో ఐదు నెలల్లో 23కు పైగా వివాహేతర సంబంధాల హత్యలు, ఆత్మహత్యలు జరగడం గమనార్హం. వివాహేతర సంబంధాల ముసుగులో ఈ మధ్య కాలంలో ఇరు జిల్లాలో అనేక కుటుంబాలు వీధి పాలయ్యాయి.  కొడుకు చేతిలో ఆస్తి కోసం తండ్రి హత్య, కన్న కొడుకు మరో కాపురానికి అడ్డుగా ఉంటాడని కడతేర్చిన కసాయి తండ్రి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ, మానవ సంబంధాలను మంటగల్పుతున్నారు.
కట్టుకున్నోళ్లే కడతేరుస్తున్నారు
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ వివాహేతర సంబంధాల హత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. జీవితాంతం కలిసి ఉంటానంటూ పెండ్లి చేసుకున్న భార్య, భర్తలు ఒకరిపై ఒకరు అనుమానం, అక్రమ సంబంధాలతో కట్టుకున్నోళ్లనే కడతేరుస్తున్నారు. గడిచిన 5 నెలల కాలంలో వివాహేతర సంబంధాలతో సుమారు 23కు పైగానే హత్యలు జరిగినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో వరుసగా మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. మూడు రోజుల కిందట ఆర్మూర్‌లో కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేశాడు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే రుద్రూర్‌ మండలంలో తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడు మద్యం తాగించి భర్తను చెరువులోకి నెట్టి హత్య చేశాడు. బుధవారం కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త సాయిలు. గత నెల ఆగస్టు 25న తాడ్వాయి మండలం చిట్యాలలో భార్య రమ్యను భర్త సంజీవులు గొడ్డలితో హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.  రెండు నెలల కిందట బిచ్కుంద మండలం దౌల్తాపూర్‌ శివారులో హన్మబోయిని అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన వివాహేతర సంబంధానికి భర్త హన్మబోయిని అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య అనురాధ ప్రియుడు పోష బోయినితో కలిసి హత్య చేశాడు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రమేష్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధానికి రమేష్‌ అడ్డువస్తున్నాడనే కారణంతో మృతుడి భార్య ప్రియుడితో కలిసి హతమార్చారు. మృతదేహాన్ని నూతన ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. పెద్దకొడప్‌గల్‌ మండలానికి చెందిన ఓ మహిళతో రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఓరోజు ఇద్దరు కలిసి ఉండడాన్ని గమనించిన సదరు మహిళ భర్త అతడి మెడకు వైరు బిగించి చంపి పోలీసులకు లొంగిపోయాడు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన మల్లయ్య ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు అతనిని హతమార్చారు. నాగిరెడ్డిపేటలో వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని బాలుడిని చంపేశారు. బీర్కూర్‌లో భార్యను భర్త అనుమానంతో హతమార్చాడు. కామారెడ్డిలో భార్య తన తల్లిదండ్రులతో కలిసి భర్తను హత్య చేయించింది. ఇలా పలు కారణాల వల్ల వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వివాహేతర హత్యలే ఎక్కువ
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో ఇటీవల హత్య సంఘటనలు పరిశీలిస్తే వివాహేతర సంబంధాలు, ఆస్తి తగదాలు, ప్రేమ వ్యవహారాల హత్యలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2016లో 23 హత్యలు జరుగగా ఇందులో 8 వివాహేతర సంబంధాలతోనే జరిగినట్లు స్పష్టమైంది. 2017 సంవత్సరంలో 31 హత్యలు, 2018 సంవత్సరంలో 23 హత్యలు జరిగాయి. 2019లో 25 హత్యలు, 2020లో 30, 2021లో 38, 2022లో 23 జరుగగా అందులో చాలా వరకు వివాహేతర సంబంధాల నేపథ్యంలో, పరువు హత్యలు ఉన్నట్లు తెలుస్తోంది. హత్యలకు డబ్బు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలే ప్రధాన కారణమవుతున్నాయి.  జిల్లాలో ఇటీవల జరిగిన అన్ని హత్య కేసుల్లో డబ్బు, వివాహేతర సంబంధాలే జరిగాయన్నదే స్పష్టమవుతోంది. అంతేకాక మద్యం మత్తులో విచక్షణ మరిచి హత్యలకు పాల్పడుతున్నట్లు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే అర్థమవుతోంది. క్షణికావేశంలో హత్యలకు పాల్పడడం వల్ల వారు జైలు పాలై తమ జీవితాలను కూడా నశానం చేసుకుంటున్నారు.
ఈ కారణాల వల్లే హత్యలు
ప్రస్తుత సమాజంలో జరుగుతున్న హత్యలకు ఈ కింది కారణాల వల్లనే అవుతున్నట్లు తెలుస్తోంది.  కనుమరుగైపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల మధ్య వయస్సులో చాలా తేడా,  భార్యాభర్తల మధ్య సంతృప్తికరమైన సంసారిక జీవితం లేకపోవటం, భార్యాభర్తల మధ్య ఎడమొహం పెడమొహం, ఇష్టం లేని బలవంతపు పెళ్లీళ్లు - కాపురాలు,  ఒకరిపై ఒకరి ప్రవర్తనపై అనుమానాలు,  బాధలు - ఇబ్బందులు పంచుకోలేకపోవటం, ఆస్తి తగదాలు - వ్యక్తుల బలహీనతలు, ఆర్థికంగా ఎదగాలనే అత్యాశలు, ఆధునిక పోకడలు - టీవీ మీడియా, స్నేహం పేరుతో కుటుంబాల మధ్య చిచ్చు, మానసిక సమస్యల ప్రభావం లాంటి కారణాలతోనే తరచూ హత్యలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడవుతోంది.

Read more