బడి ఆటో భద్రమేనా!

ABN , First Publish Date - 2022-06-27T05:50:07+05:30 IST

పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పుస్తకాలు, యూనిఫాం, లంచ్‌ బాక్సులు లాంటి వస్తువులు కొనడంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వాటన్నింటికంటే ముఖ్యమైనది పిల్లలు పాఠశాలకు చేరే విధానంపై ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం లేదు.

బడి ఆటో భద్రమేనా!
నిబంధనలకు విరుద్ధంగా ఆటోల్లో పిల్లలను తరలిస్తున్న దృశ్యాలు

- నిబంధనలు పాటించని డ్రైవర్లు

- ప్రమాదపుటంచున విద్యార్థుల ప్రయాణం

- కిక్కిరిసిన ఆటోల్లో పాఠశాలలకు విద్యార్థులు

- పరిమితికి మించినా పట్టించుకోని అధికారులు

- తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం


కామారెడ్డి టౌన్‌, జూన్‌ 26: పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పుస్తకాలు, యూనిఫాం, లంచ్‌ బాక్సులు లాంటి వస్తువులు కొనడంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వాటన్నింటికంటే ముఖ్యమైనది పిల్లలు పాఠశాలకు చేరే విధానంపై ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని సంబంధింత వాహనాల యజమానాలు వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఆటోలు ముందు వరుసలో ఉన్నాయి. డబ్బు సంపాదనే తప్ప పిల్లల ప్రాణాల గురించి చాలామంది ఆటో డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఎంత మంది పిల్లలను ఎక్కిస్తే అంత ఆదాయం వస్తోంది అనే ఆలోచనలోనే డ్రైవర్లు ఉంటున్నారు. ఇదే ప్రమాదాలకు ముఖ్యకారణంగా మారుతుంది. స్కూల్‌ బస్సుల సమాచారం పూర్తిగా రవాణాశాఖ అధికారుల దగ్గర ఉంటుంది. కాబట్టి వీరు కొంతమేరకు నిబంధనలు పాటిస్తుంటారు. కానీ స్కూల్‌ ఆటోల సమాచారం అధికారుల వద్ద ఉండదు. ఈ ఆటోలకు రవాణా శాఖ నుంచి ప్రత్యేకమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో అధికారులు కూడా వీటిని నియంత్రించలేక పోతున్నారు. ఎక్కువ శాతం ఆటోలు ప్రధాన రహదారుల నుంచి కాక సందుల్లో, చిన్నచిన్న రోడ్ల వెంట పిల్లలను తీసుకెళ్తుండడంతో వీటిపై నియంత్రణ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆటోలపై తల్లిదండ్రులు, స్కూల్‌ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. 

ఏ ప్రమాదం ఎలా ముంచుకోస్తుందో..

నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను కుక్కి అతివేగంగా డ్రైవర్లు ఆటోలను తోలుతున్నారు. ఒకవైపు పాఠశాల సమయం ముగుస్తుందని గేటు వేస్తారని ముందు వెనక చూసుకోకుండా దూసుకు వస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అఽధికారుల నియంత్రణ లేకపోవడం, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల నిర్లక్ష్యంతో పాఠశాలల ఆటోలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రైవేట్‌ బస్సులకు ఫీజులు చెల్లించే స్థోమత లేని కారణంగా తప్పని పరిస్థితుల్లో తమ పిల్లలను ఆటోలో పంపించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక పల్లెల నుంచి సరైన బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

నిబంధనలు ఇలా..

ఆటోలు, టాటా మ్యాజిక్‌ లాంటి వాహనాలను పాఠశాల విద్యార్థులను తరలించేందుకు జిల్లాలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను తరలించే వాహనాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలను ఆటో డ్రైవర్‌లు పాటించడం లేదు. సాధారణ ఆటోలలో విద్యార్థులను ఆరుగురికి మించి ఎక్కించకూడదు. టాటా మ్యాజిక్‌లో 10 మందికి మించకూడదు. డ్రైవర్ల పక్కన ఎట్టి పరిస్థితుల్లో కూర్చోపెట్టకూడదు. స్కూల్‌ ఆటోలకు సైడురాడ్లు తప్పక అమర్చాలి. ప్రతీ స్కూల్‌ ఆటోలో ప్రథమ చికిత్స కిట్‌లు తప్పనిసరిగా ఉండాలి. ఆటోలకు సంబంధించిన వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు ఎఫ్‌సీ సర్టిఫికెట్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ తదితరాలు అందుబాటులో ఉంచుకోవాలి. డ్రైవర్‌ యూనిఫాం తప్పని సరిగా ధరించాలి. ఈ నిబంధనలు పాటించకుండా పోలీసు, రవాణాశాఖ దారుల్లో పట్టుబడితే జరిమానాలు భారీగా ఉంటాయని అధికారులు తెలుపుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడి ఓవర్‌ లోడింగ్‌కు పాల్పడితే భారీ జరిమానాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.

తల్లిదండ్రులు తస్మాత్‌ జాగ్రత్త

ఆటోలలో డ్రైవర్‌ సీటుకు అటు, ఇటు, లోపల కాస్తా కూడా ఖాళీ లేకుండా విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఆటోలలో విద్యార్థుల రాకపోకలు మాత్రం ఆగడం లేదు. ఏదైన ప్రమాదం జరిగిన తర్వాత బాధపడేకంటే తల్లిదండ్రులు ముందే మేల్కొనాలి. బడి పిల్లలను ఆటోలలో స్కూళ్లకు పంపే తల్లిదండ్రులు ఆటోలలో అసలు ఎంత మంది వెళ్తున్నారు. ఆటో డ్రైవర్‌ ఎన్ని ట్రిప్పులు వేస్తుండని తెలుసుకోవాలి. ఆటో డ్రైవర్‌ పూర్తి వివరాలు ప్రతీ తల్లిదండ్రుల వద్ద ఉండాలి. డ్రైవర్‌ ఎంత స్పీడ్‌లో వెళ్తున్నాడో, పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాడో ఎప్పటికప్పుడు పిల్లలను అడిగి తెలుసుకోవాలి. ఆటో సమాచారాన్ని సంబంధిత పాఠశాలలకు తల్లిదండ్రులే అందించాలి. స్కూల్‌ యాజమాన్యాలు, సిబ్బంది కూడా వారి స్కూళ్లకు ఎక్కువ మంది పిల్లలను తీసుకువచ్చే ఆటోలను అనుమతించకూడదు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే స్కూళ్లకు చెడ్డవారు వస్తుందని, స్కూల్‌ యాజమాన్యం కూడా బాధ్యతగా మెలగాలి.

Updated Date - 2022-06-27T05:50:07+05:30 IST