దోమకొండ గడికోటకు అంతర్జాతీయ గుర్తింపు

ABN , First Publish Date - 2022-11-27T23:44:08+05:30 IST

తెలంగాణలో చారిత్రాత్మక కట్టడాల్లో దోమకొండ కోట ఒకటి. ఇలాంటి కోటకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆసియా ఖండంలోని ఆసియా-పసిఫిక్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ అవార్డుకు యునెస్కో దోమకొండ కోటను ఎంపిక చేయడం గర్వకారణం.

దోమకొండ గడికోటకు అంతర్జాతీయ గుర్తింపు
దోమకొండ కోట

- దేశంలోనే తెలంగాణలో రెండు చారిత్రాత్మక కట్టడాలకు యునెస్కో అవార్డులు

- జిల్లాలోని దోమకొండ కోట ఎంపిక

- చారిత్రాత్మక కట్టడాలు, సాంస్కృతిక కార్యక్రమాల పునరుద్ధరణకు యునెస్కో అవార్డు

- కోటలో అద్భుత కట్టడాలు.. అలనాటి కళా నైపుణ్యాలు

- పర్యాటకులను ఆకట్టుకునేలా కోట అందాలను పునరుద్ధరించిన కోట ట్రస్ట్‌

- రాంచరణ్‌-ఉపాసనల పెళ్లితో దోమకొండ కోటకు దేశంలోనే గుర్తింపు

- యునెస్కో అవార్డుతో అంతర్జాతీయ గుర్తింపు

దోమకొండ, నవంబరు 27: తెలంగాణలో చారిత్రాత్మక కట్టడాల్లో దోమకొండ కోట ఒకటి. ఇలాంటి కోటకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆసియా ఖండంలోని ఆసియా-పసిఫిక్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ అవార్డుకు యునెస్కో దోమకొండ కోటను ఎంపిక చేయడం గర్వకారణం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రెండు చారిత్రాత్మక కట్టడాలు యునెస్కో అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో దోమకొండ కోట ఒకటి కాగా మరొకటి హైదరాబాద్‌లోని మెట్లబావి. దోమకొండకోట చారిత్రాత్మక కట్టడం, సాంస్కృతిక కార్యక్రమాలు పునరుద్ధరించడంతో యునెస్కో అవార్డుకు ఎంపికైనట్లు ట్రస్ట్‌ సభ్యులు చెబుతున్నారు. మెగా హీరో రాంచరణ్‌ దోమకొండ కోట వంశస్తులైన కామినేని అనిల్‌కుమార్‌ కుమార్తె అయిన ఉపాసనను మెగా హీరో రాంచరణ్‌ వివాహం చేసుకోవడంతో దేశంలోనే కోటకు గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆ కోటే యునెస్కో అవార్డుకు ఎంపిక కావడంతో అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లయిందని కామినేని వంశస్తులతో పాటు జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యూనెస్కో అవార్డుకు దోమకొండ కోట

జిల్లాలోని దోమకొండ కోట యునెస్కో అవార్డుకు ఎంపికైంది. ఆసియా ఖండంలోని ఆరు దేశాల నుంచి పలు చారిత్రాత్మక కట్టడాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఈ అవార్డుకు ఎంపిక కాగా భారతదేశంలోని తెలంగాణలో రెండు చారిత్రాత్మక కట్టడాలకు యునెస్కో అవార్డు దక్కాయి. ఇందులో ఒకటి కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ కోట కాగా హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహి టుంబ్స్‌ కాంప్లెక్స్‌లోని మెట్లబావిని యునెస్కో అవార్డుకు ఎంపిక చేశారు. 2022 సంవత్సరానికి గాను ఆసియా-పసిఫిక్‌ అవార్డ్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ అవార్డుకు వివిధ దేశాల నుంచి మొత్తం 287 ప్రతిపాదనలు రాగా అందులో ఆరు దేశాలకు చెందిన 13 ప్రాజెక్టులను యునెస్కో ఎంపిక చేసింది. దోమకొండ కోట ప్రైవేటు నిర్మాణమైనప్పటికీ సాంస్కృతిక స్థలంగా విజయవంతంగా పునరుద్ధరించిన నేపథ్యంలో యునెస్కో అవార్డుకు ఎంపికైనట్లు దోమకొండ కోట ట్రస్ట్‌ సభ్యులు వెల్లడించారు. దోమకొండ కోట 18వ శతాబ్దంలో కామినేని వంశస్థులు నిర్మించారు. సుమారు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఈ కోట నిర్మాణం ఉంది. ఈ కోటలో అద్దాల మేడ, రాజభవనం, అశ్వసాలు, బుర్జులతో పాటు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతనమైన శివాలయం ఉంది. ప్రస్తుతం ఈ కోట నిర్వహణ మొత్తం కామినేని అనిల్‌కుమార్‌ చేపడుతున్నారు. కామినేని అనిల్‌కుమార్‌ మెగాస్టర్‌ చిరంజీవికి వియ్యంకుడు. ప్రముఖ సినీహీరో మెగాస్టార్‌ చిరంజీవి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు దోమకొండ కోటను పర్యాటక స్థలంగా పునరుద్ధరించారు. దోమకొండ కోటలో మెగా కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

18వ శతాబ్దంలో నిర్మించిన దోమకొండ కోట

దోమకొండ కోట ప్రాచీన సంస్థానాల్లో ఒకటి. ఆ కాలంలో నిజాం షాహిరాజులకు కానిమేని వంశప్రభులు సామంతులుగా ఉండి పాలించే వారని చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్దం నుంచి 20వ శాతబ్దం వరకు దీనిని కామినేని వంశస్తులు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. జమిందారీ వ్యవస్థ రద్దు అయ్యే వరకు కామినేని వంశస్తులు దోమకొండ పట్టణ కేంద్రంగా పరిపాలన సాగించే వారని దోమకొండతో పాటు భిక్కనూరు, సదాశివనగర్‌, రామారెడ్డి మండలాలు మెదక్‌ జిల్లాలోని పలు గ్రామాలు వీరి ఆధీనంలో ఉండేదని, రామారెడ్డిలోని కాలభైరవ స్వామి, భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయం వీరి ఆధీనంలోనే ఉండేదని తెలిపారు. వీరి పాలన కొనసాగించిన చాలా గ్రామాలకు వీరి వారసుల పేర్లు ఉండడం విశేషం. ఆ కాలంలోనే కోటలో అద్భుతమైన భవనాలను నిర్మింపజేశారు. కోట లోపల ఉన్న భవనాల్లో దర్బార్‌ హాల్‌, నాట్యశాల, అంతఃపురం, అద్దాల మేడ ముఖ్యమైనవి. అందులో అద్దాల భవనం ప్రత్యేకమైనది. ఈ మేడను 1922లో నిర్మించినట్లు శాసనం ఉంది. ఈ కోటలో మహాదేవుని ఆలయం ఉంది. అప్పట్లో ఆలయానికి రాణి రుద్రమాదేవి పూజలు చేసి వెళ్లినట్లు శాసనంలో ఉంది. కోటలోనే ప్రతీ కట్టడం ప్రత్యేకంగా నిర్మించడం వల్ల కోటను కాపాడుకునేందుకు వారి వారసులైన కామినేని వంశస్తులు కోటకు ఆరు సంవత్సరాల కిందట మరమ్మతు పనులు చేపట్టారు. కోట వైభవాన్ని కాపాడే చిహ్నాలు, చిత్ర శిల్పకళలు శిథిలావస్థకు చేరుకున్న సమయంలో గత కాలంలో ఎలా నిర్మించారో ప్రస్తుతం అంతటి పరిజ్ఞానంతో మళ్లీ ఆ కట్టడాలకు జీవంపోసి పునర్‌ నిర్మించారు.

రాంచరణ్‌ - ఉపాసన పెళ్లితో దోమకొండ కోట దేశవ్యాప్తంగా వెలుగులోకి..

జిల్లాలోని దోమకొండ కేంద్రంలో గల గడికోట పర్యాటకులను కనువిందు చేస్తోంది. పర్యాటక శోభను సంతరించుకోవడంతో ఈ కోటకు దేశ వ్యాప్తంగానే గుర్తింపు లభించింది. మెగా హీరో రాంచరణ్‌ - ఉపాసన పెళ్లితో దోమకొండ కోట దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఈ కోటను సందర్శించేందుకు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తూ పోతున్నారు. దీంతో ఈ కోటకు రోజు రోజుకూ పర్యాటకుల సందడి నెలకొంటుంది. అప్పుడప్పుడు దోమకొండ కోటలో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు మెగా హీరోలైన రాంచరణ్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ పలు విందు వినోదాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన వేడుకలను కోటలోనే రెండు రోజుల పాటు మెగా కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. ప్రతీ శివరాత్రి సమయంలోనూ కోటలోని శివాలయంలో కామినేని వంశస్థులతో పాటు మెగా హీరో రాంచరణ్‌, ఉపాసన దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. స్థానిక దోమకొండ గ్రామస్థులే కాకుండా చుట్టు పక్కల గ్రామల ప్రజలు సైతం శివరాత్రి సందర్భంగా కోటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతుంటారు.

Updated Date - 2022-11-27T23:44:11+05:30 IST