పెరిగిన వరి సాగు

ABN , First Publish Date - 2022-09-11T06:21:26+05:30 IST

జిల్లాలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. నిజాంసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులు ముందే నిండడంతో ఆయకట్టులో భారీగా సాగుచేశారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు నిండడంతో పంటల సాగు భారీగా పెరిగింది.

పెరిగిన వరి సాగు
వరి పంట

జిల్లాలో పెరిగిన వరి పంట విస్తీర్ణం 

అత్యధికంగా వరిసాగు చేసిన రైతులు

అధికారులకు సవాలుగా మారనున్న ధాన్యం కొనుగోలు

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు 

ఇప్పటి వరకు 50శాతమే పంట రుణాల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబరు 10, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. నిజాంసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులు ముందే నిండడంతో ఆయకట్టులో భారీగా సాగుచేశారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు నిండడంతో పంటల సాగు భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా ఈ పంటల విస్తీర్ణం పెరిగింది. ఆరుతడి పంటలకన్నా వరిసాగునే ఎక్కువమంది రైతులు చేశారు. జిల్లాలో పంటల విస్తీర్ణం పెరిగినట్లు ఈ క్రాప్‌ బుకింగ్‌ ద్వారా వ్యవసాయ అధికారుల సర్వే ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో పంటల విస్తీర్ణం భారీగా పెరిగిన రుణాల పంపిణీ మాత్రం అనుకున్నవిధంగా జరగలేదు. ఇప్పటి వరకు 50శాతంలోపే రుణ పంపిణీ చేశారు. 

జూన్‌ నుంచే వర్షాలు..

జిల్లాలో జూన్‌ ఆరంభం నుంచే వర్షాలు పడడంతో పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. జూన్‌, జూలై నెలలో అత్యధికంగా వర్షాలు పడడం, శ్రీరామ్‌సాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు నిండడం వల్ల భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. భారీ వర్షాలతో అన్ని చెరువులు జూలై నెలలోనే నిండడంతో సెప్టెంబరు మొదటి వారం వరకు ఆరుతడి పంటలతో పాటు వరిసాగును ఎక్కువమంది రైతులు చేశారు. జూలై నెలలో భారీ వర్షాలతో పంటలకు అంతరాయం ఏర్పడినా ఆగస్టు నెలలో ఎక్కువ మొత్తంలో సాగుచేశారు. ఆరుతడి పంటలకు అవకాశం లేకపోవడంతో రైతులు వరిసాగువైపే మొగ్గుచూపారు. జిల్లాలో క్లస్టర్‌ల వారీగా వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన క్రాప్‌బుకింగ్‌ సర్వేలో ఈ పంటల విస్తీర్ణం తేలింది. జిల్లాలోని 108 క్లస్టర్‌ల పరిధిలో ఈ సర్వేను నిర్వహించారు. క్లస్టర్‌ల పరిదిలోని గ్రామాల వారీగా సర్వే నెంబర్‌ల ఆధారంగా సర్వే చేయగా మొత్తం 5లక్షల 36వేల 494 ఎకరాల్లో పంటలు సాగుచేసినట్లు నిర్ధారించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో అత్యధికంగా ఈ వానకాలంలో వరిసాగువైపు రైతులు మొగ్గుచూపారు. జిల్లాలో వరి సాగు నాలుగు లక్ష 15వేల 440 ఎకరాలకు పైగా సాగును చేశారు. గత సంవత్సరంకంటే సుమారు 23వేల ఎకరాల్లో ఎక్కువ మొత్తంలో ఈ పంటను వేశారు. జిల్లాలో గత సంవత్సరం వానకాలంలో 3లక్షల 93వేల ఎకరాల్లో ఈ పంటను వేశారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో జూన్‌, జూలై నెలలో వరినాట్లు పూర్తిచేశారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో ఆగస్టు నెలలో ఎక్కువగా ఈ పంటను వేశారు. ఆరుతడి పంటలు ముఖ్యంగా మొక్కజొన్న, సోయా ఎక్కువగా సాగుచేశారు. వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో ఇతర పంటలను సాగుచేయలేదు. వర్షాలు ఉండడం వల్ల ఈ వానకాలంలో వరిసాగు ఎక్కువగా జరిగినట్లు ఏఈవోలు నిర్వహించిన క్రాప్‌ బుకింగ్‌ సర్వేలో బయటపడింది. ఈ వానకాలంలో పసుపు సాగు కూడా 21వేల 754 ఎకరాల్లో చేశారు. 

జిల్లాలో ధాన్యం కొనుగోలు సవాలే.. 

జిల్లాలో వరిసాగు భారీగా జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో రైతులు ఈ పంటను సాగుచేశారు. జిల్లాలో 4లక్షల 15వేల 446 ఎకరాల్లో ఈ పంటను వేశారు. దిగుబడి కూడా పది లక్షల మెట్రిక్‌ టన్నులకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ద్వారా ప్రతీ వానకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో వరిసాగు కావడం వల్ల జిల్లా యంత్రాంగానికి సవాల్‌గానే మారనుంది. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర సొసైటీల ద్వారా ప్రతీ సీజన్‌లో కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 450 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ధాన్యం కొనుగోలు భారీ మొత్తంలో ఏర్పాటు చేస్తే తప్ప కొనే పరిస్థితి లేదు. అదికార యంత్రాంగం ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమైంది. అక్టోబరు 3వ వారం నుంచి వరి కోతలు కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యే అవకాశం ఉండడంతో కొనుగోళ్లకు ప్రభుత్వం ఆదేశం ఇవ్వగానే చేపట్టే విధంగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. గన్నీబ్యాగులు, వాహనాలు, కూలీలతో పాటు ఇతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఈ వానాకాలంలో సాగు బాగా పెరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను శాఖ తరఫున చేశామన్నారు. అత్యధికంగా వరిసాగు జిల్లాలో ఈ వానకాలంలో రైతులు చేశారని ఆయన తెలిపారు. 

రుణ పంపిణీ అంతంత మాత్రమే.. 

జిల్లాలో పంటల రుణాలు మాత్రం అనుకున్నవిధంగా జరగడంలేదు. జిల్లాలో భారీ వర్షాలు పడి పంటల విస్తీర్ణం పెరిగిన రుణ పంపిణీ మాత్రం లక్ష్యాలకు అనుగుణంగా జరగడంలేదు. మే నుంచి సెప్టెంబరు వరకు వానకాలం పంటల రుణాలు ఇవ్వాల్సి ఉన్న ఆగస్టు చివరి నాటికి 50శాతం రుణాలను కూడా పంపిణీ చేయలేదు. జిల్లాలో ఈ వానకాలంలో రూ.2,308 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్ల కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబరులోపు వందశాతం పంట రుణాలను రైతులకు అందించాలని బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్ణయించారు. జిల్లాలో అర్హులైన 2లక్షల 33వేల 377 మంది రైతులకు ఈ పంట రుణాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎన్నిమార్లు సమీక్షించిన వానకాలం పంట రుణాలు మాత్రం రూ.1,162 కోట్లే ఇచ్చారు. లక్ష్యంలో 50శాతం మేరకు పంపిణీ చేశారు. ఈ నెలాఖరులో వానకాలం పంట రుణాల పంపిణీ కాలం ముగుస్తోంది. ఇంకా మూడు వారాలే గడువు ఉన్న ఇప్పటి వరకు మాత్రం ఏ బ్యాంకు కూడా లక్ష్యాలను చేరుకోలేదు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 8వేల 279 మంది రైతులకు ఈ పంట రుణాలను పంపిణీ చేశారు. సెప్టెంబరు నెలంతా రుణాల పంపిణీ చేసిన 70శాతంలోపే పంట రుణాలు రైతులకు అందే అవకాశం ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలు అందకపోవడం వల్ల రైతులు ఇతర మార్గాల్లో పంట రుణాలను తెచ్చుకుని పెట్టుబడి పెడుతున్నారు.

Read more