కలిసిరాని కాలం!

ABN , First Publish Date - 2022-08-18T05:59:35+05:30 IST

జిల్లాలో ప్రస్తుత వానాకాలం రైతులకు కలిసి రావడంలేదు. అధిక వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లాలో భారీగా పంటలు దెబ్బతినగా.. ఉన్నకొద్దిపాటి పంటలు వరి, మొక్కజొన్న, సోయా తెగుళ్ల బారిన పడుతున్నాయి. అధిక వర్షాలతో పంటలు నీటమునిగి రైతులు ఆర్థికంగా నష్టపోగా.. పంటలపై చీడపీడలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

కలిసిరాని కాలం!

జిల్లా వ్యాప్తంగా పంటలకు సోకుతున్న తెగుళ్లు   

దెబ్బతింటున్న వరి, సోయా, మొక్కజొన్న

పంటలను కాపాడేందుకు రైతుల తిప్పలు   

అధికారులు పట్టించుకోవాలని వేడుకోలు

అధిక వర్షాలతోనే తెగుళ్లు : వ్యవసాయ శాస్త్రవేత్తలు

నిజామాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ప్రస్తుత వానాకాలం రైతులకు కలిసి రావడంలేదు. అధిక వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లాలో భారీగా పంటలు దెబ్బతినగా.. ఉన్నకొద్దిపాటి పంటలు వరి, మొక్కజొన్న, సోయా తెగుళ్ల బారిన పడుతున్నాయి. అధిక వర్షాలతో పంటలు నీటమునిగి రైతులు ఆర్థికంగా నష్టపోగా.. పంటలపై చీడపీడలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. వ్యవసాయశాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పలు రకాల మందులను పిచికారీ చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 5లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 5లక్షల ఎకరాల వరకు పంటలు సాగయ్యాయి. వీటిలో వరిసాగే ఎక్కువగా అయింది. జిల్లాలోని చెరువులన్నీ నిండ డం, ప్రాజెక్టులు నిండి గేట్లను ఎత్తివేయడం, భూగర్భజలాలు ఎక్కువగా ఉండడంతో రైతులు వరి సాగుకు మొగ్గుచూపారు. జిల్లాలో ఇప్పటి వరకు వరి 3లక్షల 70వేల ఎకరాలకు పైగా సాగుచేశారు. వరితో పాటు సోయా, మొక్కజొన్న, పసుపు, కూరగాయలతో పాటు ఇతర పంటలను సాగుచేశారు.

తెగుళ్లతో రైతుల దిగాలు

జిల్లాలో పంటలకు సోకుతున్న తెగుళ్లతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నీటిమునిగి తెగుళ్ల బారిన పడ్డాయి. గత నెలలో పడిన వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. వర్షాల నుంచి పంటలను కాపాడుకున్న రైతులకు ఇప్పటికీ ఇబ్బందులు తప్పడంలేదు. అయితే వ్యవసాయ అధికారులు గ్రామాల్లో సర్వే నిర్వహించి సుమారు 60వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. జూలై నెలలో మొత్తం 24 రోజుల పాటు వర్షాలు పడడంతో పంటలకు భారీగా నష్టం జరిగింది. ఆగస్టు ఆరంభం నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ముసురుతో కూడిన వర్షాలు పడుతుండడం వల్ల పంటలకు తెగుళ్లు వస్తున్నాయి. వరితో పాటు ఇతర పంటలు ఈ తెగుళ్ల వల్ల దెబ్బతింటున్నాయి.  జిల్లాలో వరి ఎక్కువగా సాగుచేయగా ఈ పంటకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు, తాటాకు తెగులు, మొగి పురుగు తెగులు సోకుతోంది. దీంతో వరి ఎర్రబడడం, కాండం దెబ్బతినడం జరుగుతుంది. పొలాల్లో నీళ్లు ఉండడం, ఎక్కువ మొత్తంలో నత్రజని సంబంధిత ఎరువులను ఉపయోగించడం వల్ల ఈ తెగుళ్లు సోకుతున్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పొటాష్‌కు సంబంధించిన మందులను ఎక్కువగా సూచించడంతో పాటు వరిలో పొటాష్‌ ఎరువును వేయాలని కోరుతున్నారు. జిల్లాలోని బోధన్‌ డివిజన్‌తో పాటు అన్ని డివిజన్‌లలో ఈ తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. రైతులకు ముందుగానే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వివరించడంతో అప్రమత్తమై మందులను స్ర్పే చేస్తున్నారు. వరుసగా వర్షాలు పడడం వల్ల వరిలో గడ్డి కూడా అంతరంగా పెరుగుతుంది. గడ్డి ఎక్కువ కావడం వల్ల వరి ఎదిగేందుకు సమస్యలు ఏర్పడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు వేసిన తర్వాత గడ్డి మందు స్ర్పే చేసిన ఎక్కువగా వర్షాలు పడడంతో అది పనిచేయకపోవడం వల్ల ఈ గడ్డి పెరుగుతుంది. నెలదాటిపోయిన వరిలో గడ్డి మందు స్ర్పే చేయవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

సోయాబిన్‌కూ తెగులు

జిల్లాలో వరితో పాటు సోయాబిన్‌ కూడా తెగులు వ్యాపిస్తోంది. తెల్లదోమ తెగులుతో పాటు ఎల్లోమోజాయిక్‌వైరస్‌ తెగులు వ్యాప్తిచెందుతోంది. ఏర్గట్ల, జక్రాన్‌పల్లి, మోర్తాడ్‌, వేల్పూర్‌తో పాటు పలు మండలాల పరిధిలో వేసిన సోయాబిన్‌కు ఈ తెగులు వ్యాపిస్తోంది. బోధన్‌, కోటగిరి, రేంజల్‌ మండలాల పరిధిలో ఈ తెగులు సోయాబిన్‌కు సోకినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు నుంచి రక్షించేందుకు సెప్కోమైసిన్‌, ఫొటోమైసిన్‌ మందులను పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. ముందుగానే గుర్తించి స్ర్పే చేయడం ద్వారా తెగులును అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు రైతులకు వివరిస్తున్నారు. 

ఐదు ఎకరాల్లో వరికి మొగితెగులు..

ఫ శ్రీనివాస్‌, రైతు (కోటగిరి)

ఐదు ఎకరాల్లో వరిసాగు చేశాను. వర్షాలకు వరి బాగానే ఎదిగిన తెగుళ్లు సోకాయి. మొగిపురుగు వల్ల వరి దెబ్బతింటుంది. వర్షాలు తగ్గకపోవడం, ఎండల వల్ల ఈ తెగులు ఎక్కువగా వచ్చింది. వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం మందులను పిచికారీ చేస్తున్నాను.

వాతావరణం అనుకూలించకే తెగుళ్లు..

ఫ  డాక్టర్‌ నవీన్‌, కేవీకే శాస్త్రవేత్త

వర్షాలు భారీగా పడడం, వాతావరణం అనుకూలించక  పంటలకు తెగుళ్లు సోకుతున్నాయి. వరి, మొక్కజొన్న, సోయా పంటలకు తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయి. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి మందులను పిచికారీ చేయాలి. పంటలకు అవసరమైన పొటాష్‌ ఎరువులను వాడాలి.

Updated Date - 2022-08-18T05:59:35+05:30 IST