ఆయనదే పెత్తనం

ABN , First Publish Date - 2022-03-05T05:58:29+05:30 IST

జిల్లా కలెక్టరేట్‌ వేదికగా సమావేశ హాల్‌లో శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ స్థాయి దళితబంధు అవగాహన సదస్సును నిర్వహించారు.

ఆయనదే పెత్తనం
కలెక్టరేట్‌ సమావేశ హాల్‌లో జరిగిన దళితబంధు అవగాహన సదస్సు వేదికపై కూర్చున్న ఓ మహిళ జడ్పీటీసీ భర్త

- పేరుకే మహిళా ప్రజా ప్రతినిధులు

- ప్రజాపాలనలో వారి ప్రాత నామ మాత్రమే

- అన్ని సమావేశాలు కార్యక్రమాల్లో భర్తలదే రాజ్యం

- తాజాగా దళితబంధు సమావేశంలో వేదికపై ఓ మహిళా జడ్పీటీసీ భర్త

- మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి

- జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు


కామారెడ్డి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టరేట్‌ వేదికగా సమావేశ హాల్‌లో శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ స్థాయి దళితబంధు అవగాహన సదస్సును నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, దళితబంధు లబ్ధిదారులు పాల్గొన్నారు. అయితే వేదికపై ఆసీనులైన ప్రభుత్వవిప్‌తో పాటు కలెక్టర్‌, ఉన్నతాధికారుల పక్కనే ఎలాంటి పదవి లేకున్నా ఓ మహిళ జడ్పీటీసీ భర్త హోదాతో వేదికపై కూర్చోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇతని పక్కనే చివరిలో ఇద్దరు మహిళ ప్రజాప్రతినిధులు చివర కూర్చీలు వేసి కూర్చోబెట్టడంతో తోటి ప్రజాప్రతినిధులు పెదవి విరిచారు. అయితే ఇలా జడ్పీలోనే కాకుండా మున్సిపల్‌, గ్రామ పంచాయతీ సమావేశాల్లోనూ, ఇతర అభివృద్ధి పనుల పర్యవేక్షణలోనూ మహిళ ప్రజాప్రతినిధులకంటే భర్తలది, కొడుకులది, కుటుంబ సభ్యుల పెత్తనం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. విద్య, వైద్య, ఉద్యోగం, వ్యాపార తదితర రంగాల్లో మహిళలు స్వతంత్రంగా రాణిస్తున్నారు. రాజకీయ రంగంలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో స్వాత్రంత్రంగా వ్యవహరించ లేకపోతున్నారు. మహిళ ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, ఆలోచనలలో భర్తలు జోక్యం చేసుకుంటున్నారు. చాలా చోట్ల మహిళ ప్రజాప్రతినిధులను కుర్చీలకే పరిమితం చేసి పురుషులు అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

జిల్లాలో మహిళ ప్రజాప్రతినిధుల వివరాలు

జిల్లాలోని గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల్లో మహిళలకు చట్టసభలు, సగం రిజర్వేషన్‌లు కల్పించాయి. జిల్లాలో 22 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇందులో 12 మంది మహిళలు జడ్పీటీసీలుగా ఉన్నారు. 12 మంది ఎంపీపీలు ఉండగా 136 ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు. 526 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో సగానికి పైగా అనగా 402 గ్రామ సర్పంచ్‌లుగా మహిళలు కొనసాగుతున్నారు. ఇక జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ సగం మంది కౌన్సిలర్‌లు మహిళలే ఉన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్‌లు ఉండగా ఇందులో 27 మంది మహిళ కౌన్సిలర్‌లు కొనసాగుతున్నారు. బాన్సువాడలో 19 కౌన్సిలర్‌ స్థానాలు ఉండగా 9 మంది మహిళ కౌన్సిలర్‌లు, ఎల్లారెడ్డిలో 12 కౌన్సిలర్‌లు ఉండగా ముగ్గురు మహిళ కౌన్సిలర్‌లు ఉన్నారు.

భర్తలదే ఆధిపత్యం

జిల్లాలో కొద్ది మంది మహిళ ప్రజాప్రతినిధుల విషయంలో తప్పితే చాలా మంది మహిళలు తమకు వచ్చిన పదవులకు సంబంధించి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళ ప్రజాప్రతినిధులు పేరుకే ఉన్నట్లు కనిపిస్తోంది. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు సర్పంచ్‌లు కౌన్సిలర్‌లుగా గెలిచిన మహిళ స్థానాల్లో వారి భర్తలదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఇంకా కొన్ని మహిళ రిజర్వ్‌ స్థానాల్లో వారి కుమారులే పాలన, రాజకీయం, అభివృద్ధి తదితర అన్ని విషయాలను చూసుకుంటున్నారు. కేవలం అధికారిక సమావేశాలకు తప్పితే గ్రామభివృద్ధికి సంబంధించి మహిళ ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. తమ భర్తలే చూసుకుంటున్నారు. అందుకే తమకు ఎందుకులే అనే భావన అధిక మంది మహిళ ప్రజాప్రతినిధులలో కనిపిస్తోంది. దీంతో చేసేదేమి లేక వారు తమ ఇంటి బాధ్యతలకు కులవృత్తులకే పరిమితం అవుతున్నారు. కొన్నిసార్లు అధికారిక సమావేశాల్లో సైతం భర్తలే తమ భార్యల తరపున పాల్గొంటున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.

ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా..

మహిళ ప్రజాప్రతినిధుల స్థానాల్లో భర్తల జోక్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. మహిళ ప్రజాప్రతినిధుల కుర్చీలో, విధుల్లో, పాలనలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని అందులో పేర్కొంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మెరుగుపడడం లేదు. అఽధికారిక కార్యక్రమాల్లో మహిళ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నప్పటికీ వారిని కూర్చీలకే పరిమితం చేసి భర్తలు అధికారులకు సమాధానం ఇస్తున్నారు. దీంతో మహిళలు అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. జిల్లాలో మహిళ ప్రజాప్రతినిధులకు బదులు భర్తల జోక్యంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ప్రయోజనం ఉండడంలేదు.

Read more