కామారెడ్డిలో కుండపోత
ABN , First Publish Date - 2022-08-05T05:26:53+05:30 IST
జిల్లాలోని కామారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షాకాలం సీజన్లో జిల్లా కేంద్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సాయంత్రం రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అవడం కాకుండా చెరువులను తలపించాయి.
- ఈ సీజన్లో కామారెడ్డిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
- 116.0 మి.మీ కురిసిన వర్షం
- జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి జలమయమైన రహదారులు
- లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా చేరిన వరద
- విద్యానగర్ కాలనీలో ఇళ్లలోకి చేరిన వరద నీరు
- జిల్లాలో దంచికొట్టిన వర్షం
- ఎట్టకేలకు మరోమారు నిండి అలుగు దూకుతున్న జంగంపల్లి చెరువు
కామారెడ్డి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కామారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షాకాలం సీజన్లో జిల్లా కేంద్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సాయంత్రం రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అవడం కాకుండా చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద వచ్చి చేరింది. కామారెడ్డిలో రెండు గంటల వ్యవధిలోని 116.0 మి.మీ వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కామారెడ్డిలోని కాకుండా జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. గత నెలలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి వాగులు వరద ఉధృతితో ప్రవహించాయి. కానీ భిక్కనూరు మండలంలోని జంగంపల్లి చెరువు మాత్రం నిండుకోలేదు. గురువారం కురిసిన భారీ వర్షానికి ఆ చెరువు ఎట్టకేలకు నిండుకుని అలుగు దూకుతుంది.
జిల్లా వ్యాప్తంగా 60.8 మి.మీ వర్షపాతం నమోదు
జిల్లాలో వర్షం దంచి కొట్టింది. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 60.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి పట్టణంలో 116.0 మి.మీ వర్షం కురువగా అత్యల్పంగా నిజాంసాగర్‌లో 1.3 మి.మీ వర్షపాతం నమోదైంది. రాజంపేటలో 85.3 మి.మీ, కామారెడ్డిలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రాంతంలో 66.8, తాడ్వాయిలో 60.8, గాంధారిలోని రామలక్ష్మణపల్లిలో 45.0, రామారెడ్డిలో 44.0, నిజాంసాగర్ మండలంలోని హసన్‌పల్లిలో 35.5, మాచారెడ్డిలో 31.5, గాంధారిలో 30.0, సదాశివనగర్‌లో 20.8, లింగంపేటలో 18.8, ఎల్లారెడ్డిలో 13.0, పిట్లంలో 10.8, మాచారెడ్డిలోని ఇసాయిపేటలో 6.3, పెద్దకొడప్గల్లో 5.0, మద్నూర్‌లో 3.8, బిచ్కుందలో 12.20, బాన్సువాడలో 16.2, బీర్కూర్‌లో 21.0, నాగిరెడ్డిపేటలో 11.2, జుక్కల్‌లో 8.2, పెద్దకొడప్గల్లో 14.1, నస్రుల్లాబాద్‌లో 18.2 మి.మీ వర్షపాతం నమోదైంది
జిల్లా కేంద్రంలో వరద నీటితో ఇబ్బంది పడ్డ ప్రజలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన నిజాంసాగర్, దేవునిపల్లి ప్రాంతంలో పలుచోట్ల భారీ వరద చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాలలు వదిలే సమయం కావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉండడం వరద భారీగా రావడంతో కార్లు, వాహనాలు, ప్రయాణికులు వరదలో ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతంలో గతంలో సైతం పెద్ద ఎత్తున నీరు నిల్వ ఉండడంతో రోడ్డు పనులు చేపట్టిన మురికి కాలువల్లో పేరుకపోయిన పూడికమట్టిని అంతంత మాత్రంగానే తొలగించడంతో వరద నీరు పోయే అవకాశం లేక భారీగా నీరు నిలిచింది. ఇక విద్యానగర్ కాలనీలోని గ్యాస్ ఏజెన్సీ దగ్గర గల ఓ ఇంట్లోకి మోకాలు లోతు వరకు నీరు చేరింది. ఆ ప్రాంతంలో సైతం మురికి కాలువలు అధ్వానంగా ఉన్నాయని నీరు ప్రవహించే మార్గం లేక ఇళ్లలోకి నీరు వచ్చి చేరిందని ప్రజలు పేర్కొంటున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులన్నీ అలుగు దూకుతున్నాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 12,600 క్యుసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగులలో నీరు నిల్వ ఉంది. 17.802 టీఎంసీలు కాగా 16.357 టీఎంసీలలో నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు 12,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టు నుంచి సైతం నీటి విడుదల కొనసాగుతుంది.