ఐదేళ్లయినా.. అనుమతులు లేవు

ABN , First Publish Date - 2022-12-07T00:31:44+05:30 IST

నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన మాస్టర్‌ ప్లాన్‌కు ఐదేళ్లుగా అనుమతులు రావడం లేదు. అన్ని ప్రక్రియలు పూర్తయినా ఇప్పటికీ జీవో వెలువడలేదు. ప్రభుత్వం నుం చి గెజిట్‌ విడుదల కాలేదు. నగరంలో భారీగా జనాభా సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ 48ఏళ్ల క్రితం అమలుకు వచ్చిన పాత మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే అనుమతు లు ఇస్తున్నారు.

ఐదేళ్లయినా.. అనుమతులు లేవు

నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన మాస్టర్‌ప్లాన్‌కు అనుమతులు కరువు

ఇప్పటికీ పాత మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే పర్మిషన్లు

పెరుగుతున్న జనాభాకు సరిపడా అందని మౌలిక వసతులు

కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమలులోకి వస్తే పూర్తికానున్న బైపాస్‌ రోడ్లు

నిజామాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన మాస్టర్‌ ప్లాన్‌కు ఐదేళ్లుగా అనుమతులు రావడం లేదు. అన్ని ప్రక్రియలు పూర్తయినా ఇప్పటికీ జీవో వెలువడలేదు. ప్రభుత్వం నుం చి గెజిట్‌ విడుదల కాలేదు. నగరంలో భారీగా జనాభా సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ 48ఏళ్ల క్రితం అమలుకు వచ్చిన పాత మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే అనుమతు లు ఇస్తున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో జనాభా 4లక్షలు దాటి శివారు కాలనీలు, గ్రామా లు కలిసిపోయినా కొత్త మాస్టర్‌ప్లాన్‌ మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. ఐదేళ్ల క్రితం కొత్త మాస్టర్‌ప్లాన్‌కు రూప కల్పన చేసినా ఇప్పటికీ అమలులోకి రాలేదు. పాత మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే అనుమతులు ఇవ్వడంతో రోడ్లు వెడల్పు కావడంలేదు. పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా అభివృద్ధి జరగడంలేదు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ వల్ల ఇతర ప్రాంతాల నుంచి వాహనాలను మళ్లించి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఐదేళ్ల క్రితం మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన

నగర కార్పొరేషన్‌కు కొత్త మాస్టర్‌ప్లాన్‌ కోసం ఐదేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు. నగర కార్పొరేషన్‌ పరిధిలో మాస్టర్‌ప్లాన్‌ కోసం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ప్రైవేట్‌ కన్సల్టెన్సీ ద్వారా సర్వే చేశారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించేందుకు 2017లో నిర్ణయం తీసు కుని పలుమార్లు అధికారులో సమీక్షించా రు. మంత్రి కేటీ ఆర్‌ సమక్షంలో కొత్త మాస్టర్‌ప్లాన్‌పై సమీక్షించి ప లు మార్పులు చే శారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో శివా రు గ్రామాలు కూడా కార్పొరేషన్‌లో కలవడం తో మళ్లీ మాస్టర్‌ప్లాన్‌లో మా ర్పులు చేశారు. శివారు గ్రామాల ను కలిపి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చారు. ఈ ప్లాన్‌కు ప్రజాభిప్రాయాన్ని సేకరణ శివారు గ్రామాలతో పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించారు. వచ్చే 20ఏళ్లలో నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండడం, జనా భా పెరగడం, వాహనాల సంఖ్య కూడా రెట్టింపుకానుండడంతో నుడా పరిధిలోని 73 గ్రామాలను కలిపి కొత్తగా మళ్లీ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని గత ఏడాది ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. మున్సిపల్‌ అడ్మి నిస్ర్టేషన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ప్లానింగ్‌ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నుడా పరిధిలోని గ్రామాల్లో కొత్త మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ప్ర జాభిప్రాయ సేకరణ చేశారు. నుడా సమావేశాన్ని నిర్వహించి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించారు. మొ త్తం నుడా గ్రామాలను కలిపి కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. దీనికి డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సంతకాలను చేశారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ను మున్సిపల్‌శాఖ మంత్రికి పంపించారు. ఆ శాఖ మంత్రి కూడా సంతకాలను చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మాస్టర్‌ప్లాన్‌ పెండింగ్‌లో ఉంది.

నగర కార్పొరేషన్‌ ఏర్పడి 18 ఏళ్లు

నగర కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం 1974లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగానే అనుమతులను మంజూరు చేస్తున్నారు. నగర కార్పొరేషన్‌ ఏర్పడి 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ కొత్త మాస్టర్‌ప్లాన్‌ లేకపోవడం వల్ల 48 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ మాస్టర్‌ప్లాన్‌ పైనే ఆధారపడుతున్నారు. దానికి అనుగుణంగానే భవన నిర్మాణా లు, అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. ఆ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నగరాన్ని అబివృద్ధి చేస్తున్నారు. నిజామాబాద్‌ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారడం, శివారు గ్రామాలు కార్పొరేషన్‌లో కలవడం వల్ల జనాభా భారీగా పెరిగింది. నగర కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం నాలుగున్నర లక్షల వరకు జనాభా ఉంది. మూడు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నా నగరంలో నిత్యం వేలాది వాహనాలు వచ్చి వెళ్తున్నాయి. నగరం జనాభా పెరిగిపోవడం, దానికి అనుగుణంగానే కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం అనుమతులన్నీ టీఎస్‌బీపాస్‌ కింద ఇస్తున్న పాత చట్టం ప్రకారమే అనుమతులను మంజూరు చేస్తున్నారు. పాత మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని శివారు కాలనీల్లో 30ఫీట్ల రోడ్లు ఉన్న అనుమతులు మంజూరు చేస్తున్నారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో ఇండస్ర్టియల్‌ ఏరియా, రెసిడెన్షియల్‌ ఏరియా, ఎడ్యుకేషన్‌ ప్రాంతం, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పర్యావరణ ప్రాంతాలు ఉన్నాయి. వీటితో పాటు రోడ్ల వైశాల్యం, బైపాస్‌ రోడ్లు, రింగ్‌రోడ్‌ల ప్రతిపాదనలు కొత్త మాస్టర్‌ప్లాన్‌లో ఉన్నాయి. వచ్చే 20 ఏళ్లలో పెరిగే జనాభాకు ఇబ్బందులు లేకుండా రోడ్లను వెడల్పు చేయడంతో పాటు వారికి కావాల్సిన పార్కులు, పారిశ్రామిక ప్రగతి, పర్యావరణం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చారు.

నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు

నగరం పెరగడం వల్ల ప్రతిరోజూ వచ్చే వాహనాలు, ప్రయాణికుల వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. నగరంలో ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోవడంతో పాటు పలు సందర్భాల్లో వాహనాలు నిలిచిపోతున్నాయి. పాత మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అయినా కాలనీ రోడ్లను ప్రధాన రోడ్లను వెడల్పు చేయకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ అమలులోకి రాగానే నగరం చుట్టూ 5 కి.మీలో కొత్త రింగ్‌రోడ్‌ రానుంది. బైపాస్‌ రోడ్‌ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. దీంతో నగరానికి వచ్చే సగానికి పైగా వాహనాలను ఈ రోడ్లకు మళ్లిస్తే ట్రాఫిక్‌ సమస్య తప్పనుంది. కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమలులోకి వస్తే కావాల్సిన మౌలిక వసతులు ఏర్పడనున్నాయి.

Updated Date - 2022-12-07T00:31:46+05:30 IST