విజయానికి సాంకేతం దసరా

ABN , First Publish Date - 2022-10-05T04:23:14+05:30 IST

నవరాత్రుల్లో ఆదిశక్తిని పూజిస్తూ వివిధ అలంకరణలో కొలుస్తూ చివరి రోజు విజయానికి చిహ్నంగా వేడుకను జరుపుకునేదే దసరా. మహిషాసురుడితో తొమ్మిది రోజులు పొరాడి విజయం సాధించిన రోజును విజయదశమిగా చేసుకుంటాం.

విజయానికి సాంకేతం దసరా
కామారెడ్డి మార్కెట్‌లో సందడి

- నేడు విజయదశమి

- జిల్లాలో పలు ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి

- కిటకిటలాడిన మార్కెట్‌ ప్రాంతాలు


కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 4: నవరాత్రుల్లో ఆదిశక్తిని పూజిస్తూ వివిధ అలంకరణలో కొలుస్తూ చివరి రోజు విజయానికి చిహ్నంగా వేడుకను జరుపుకునేదే దసరా. మహిషాసురుడితో తొమ్మిది రోజులు పొరాడి విజయం సాధించిన రోజును విజయదశమిగా చేసుకుంటాం. సద్దుల బతుకమ్మ పండుగ సంబురంగా జరుపుకున్న తర్వాత చేసే ప్రతీ పనిలో విజయం సాధించాలని అమ్మవారిని వేడుకుంటూ జరుపుకునేదే దసరా. అందుకు తగ్గట్గుగా వైభవంగా వేడుకలను జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలు ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు పూజారులు, ఆలయకమిటీ సభ్యులు పలు ఏర్పాట్లు చేశారు.

పూజలకు సిద్ధమైన ఆలయాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో విజయదశమి వేడుకలు జరిపేందుకు ఆలయాలు ముస్తాబయ్యాయి. మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌లో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఉదయం నుంచి పెద్దఎత్తున వాహన పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం గ్రామంలో రథంను ఊరేగింపు నిర్వహించడంతో పాటు ఊర్లోని ప్రతీ ఒక్కరికి కంకణాలు అందించి స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జంబి చెట్టుకు పూజలు నిర్వహించి రాత్రంతా స్వామివారి పూజలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆచారం గ్రామంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ పూజారులు పేర్కొంటున్నారు. అలాగే కామారెడ్డి మండలంలోని నల్లకుంట మైసమ్మ వద్ద వాహన పూజలు, కామారెడ్డి పట్టణ కేంద్రంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలో గల శారదాదేవి ఆలయం, పెద్దమ్మ దేవి ఆలయంలో పెద్దమ్మతల్లి విగ్రహానికి 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని తిరిగి గర్భగుడిలో పెట్టి ఉత్సవాలను ముగిస్తారు. గర్గుల్‌లో మహిషాసురుడి దహనం చేస్తూ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతాలతో పాటు ఆయా మండలాల్లో ఆలయాల్లో పూజలు నిర్వహించి జంబి ఆకును తీసుకువచ్చి అలయ్‌ బలయ్‌తో విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకుని వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు.

శమీ పూజలు.. పాల పిట్ట దర్శనం

దేవీ నవరాత్రులు నిర్వహించాక, పదో రోజు విజయదశమి కలిసి దసరా జరుపుకోవడం హిందువుల ఆనవాయితీ. దసరా రోజును శమీ చెట్టుకు పూజా చేయడం ప్రత్యేకత. ఈ చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురణాలు చెబుతున్నాయి. శమీవృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని ప్రజల నమ్మిక. జమ్మిచెట్టు ఆకులను ఇంట్లోని పూజ స్థలం, ధన స్థానం, నగదు పెట్టెలో ఉంచుతారు. శ్రీరాముని వనవాస సమయంలో కూటీరం కూడా జమ్మిచెట్టు చెక్కతోనే నిర్మించారని నమ్ముతారు. పాండువులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమి చెట్టుపై పెట్టినందున ఈ చెట్టుకు అంత ప్రాముఖ్యత పాలపిట్టను చూడడాన్ని అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. రైతులు తమ పంటలను ఇంటికి తీసుకువచ్చే సమయం కూడా ఇదే కావడంతో అమ్మవారిని భక్తితో కొలిసి కోతలు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతారు. పంట పొలాల్లో ఉన్న వరి గింజల మొక్కలను తీసుకువచ్చి పిట్టలకు ఆహారంగా అందించే ప్రయత్నాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

సందడిగా మారిన మార్కెట్‌ ప్రాంతాలు

తెలంగాణలో దసరా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగ వస్తే కొత్త బట్టలు కొనడం, దుకాణ సముదాయాల, ఆయుధ పూజ, వాహనాలు కొనుగోలు చేయడం లాంటివి చేస్తుంటారు. ఇందులో భాగంగా గత వారం రోజుల నుంచి జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, సిరిసిల్లా రోడ్డు, నిజాంసాగర్‌ రోడ్డు ప్రాంతం చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం సైతం విజయదశమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన జనంతో మార్కెట్‌ ప్రాంతం మొత్తం జన సమూహంగా మారింది.

ఇందిరాగాంధీ స్టేడియంలో లేని ఉత్సవాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రతీఏట పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతుండేవి. కానీ కరోనా సమయం నుంచి ఉత్సవాలకు బ్రేక్‌ పడుతూ వచ్చింది. ఈ యేడు కూడా ఉత్సవాలు నిర్వహించడం లేదు. లేజర్‌షోతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ధర్మశాల వద్ద మాత్రమే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

నేటితో ముగియనున్న నవరాత్రి ఉత్సవాలు

జిల్లాలో నవరాత్రి ఉత ్సవాలు ముగియనున్నాయి. ప్రతీ సంవత్సరం 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహించడంతో పాటు అర్ధరాత్రి వరకు యువతి, యువకులు దాండియాతో వేడుకలను నిర్వహించుకుంటారు. దసరా రోజు అమ్మవారికి పూజలు చేసిన అనంతరం తర్వాత రోజు అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాల మాదిరిగానే అమ్మవారిని డప్పుచప్పుల మధ్య తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే సుర్యోదయం అయ్యేలోపు అమ్మవారిని నిమజ్జనం చేయాల్సి ఉంటుంది కనుక గురువారం సాయంత్రం అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.

Read more