రాయితీ సద్వినియోగం

ABN , First Publish Date - 2022-03-04T05:42:30+05:30 IST

ట్రాఫిక్‌ చలాన్లపై ప్రభుత్వం పోలీసుశాఖ తీసుకున్న రాయితీ నిర్ణయంతో వాహనదారులకు ఊరట లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి అమలు చేస్తున్న రాయితీ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

రాయితీ సద్వినియోగం
ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

- చలానా కడుతున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనులు

- గత ఏడాది జిల్లా పరిధిలో ఈచలాన్లు 4,42,728

- కట్టాల్సిన జరిమానాలు రూ.5కోట్ల 69 లక్షలు

- ఈనెల చివరి వరకు అవకాశం


కామారెడ్డి, మార్చి 3: ట్రాఫిక్‌ చలాన్లపై ప్రభుత్వం పోలీసుశాఖ తీసుకున్న రాయితీ నిర్ణయంతో వాహనదారులకు ఊరట లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి అమలు చేస్తున్న రాయితీ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. మూడు డివిజన్ల పరిధిలో త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌, నో పార్కింగ్‌, సీట్‌బెల్ట్‌, డ్రంకెన్‌డ్రైవ్‌తో పాటు జిల్లా కేంద్రంలో సిగ్నల్‌ జంపింగ్‌ తదితర ఉల్లంఘనులపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించిన విషయం విధితమే. అయితే వాహనదారులు చెల్లించే రాయితీని మొదట హైదరాబాద్‌ వరకే పరిమితం చేయాలనుకున్న అధికారులు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం కల్పించారు. దీంతో వాహనదారులు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా జరిమానాలు చెల్లిస్తున్నారు. తొలిరోజు 2,548 చల్లాన్లపై ఉన్న జరిమానాలు రూ.1కోటి 15 లక్షల 6వేల 515 ప్రభుత్వానికి చెల్లించారు. వాస్తవానికి చలాన్లకు రూ.2కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా రాయితీ పోని మిగిలిన డబ్బులను చెల్లించారు.

జిల్లా పరిధిలో 4,42,728 చలాన్లు

జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు సివిల్‌, ట్రాఫిక్‌ పోలీసులు 4,42,728 చలాన్ల రూపంలో రూ.5,69,19,225 జరిమానా విధించారు. పెండింగ్‌ చలాన్లపై పలు సందర్భాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రత్యేక డ్రైవ్‌లో నిర్వహించి జరిమానాలు కూడా వసూలు చేశారు. కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో వాహనాలపై పెద్ద మొత్తం పెండింగ్‌ చలాన్లు ఉండగా వాహనం స్వాధీనం చేసుకుని జరిమానా చెల్లించిన తర్వాత విడిచిపెట్టిన సందర్బాలున్నాయి. మూడు డివిజన్‌ల పరిధిలో పలుచోట్ల అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనదారులకు నేరుగా జరిమానా విధించి ఇంటికి పంపించారు.

రాయితీ ఇలా..

ద్విచక్రవాహనాలు, ఆటోలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కార్లు, భారీ వాహనాలకు 50 శాతం చొప్పున ప్రభుత్వం రాయితీ కల్పించింది. జరిమానా చెల్లించడానికి ఈనెల 31 వరకు గడువు నిర్ణయించింది. అయితే తమ వాహనాలపై ఎంత జరిమానా ఉంది. ఎంత చెల్లించాలనే దానిపై గ్రామీణ ప్రాంత వాహనదారులకు అవగాహన తక్కువగా ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వాహనాల తనిఖీ సమయంలో పట్టుబడిన వాహనదారులకు కూలంకుషంగా వివరిస్తున్నారు. దీంతో వాహనదారులు పెండింగ్‌ చలానా చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. తొలిరోజు 2,548 చల్లాన్లపై ఉన్న జరిమానాలు రూ.1కోటి 15 లక్షల 6 వేల 515 ప్రభుత్వానికి చెల్లించగా, రెండో రోజు 8,672 చలాన్లపై ఉన్న జరిమానాలు 3కోట్ల 3లక్షల 77 వేల 860 రూపాయలను ప్రభుత్వానికి వాహనదారులు చెల్లించారు.


వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి

- శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి

పెండింగ్‌ చలాన్లకు సంబంధించి జరిమానా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలి. ద్విచక్రవాహనదారులు, ఆటోలు, కార్లు, ఆర్టీసీ బస్సులకు రాయితీ కల్పించింది. ఈ నెల 31 వరకు వాహనదారులు తమ పెండింగ్‌ చలాన్ల జరిమానా చెల్లించాలి.

Updated Date - 2022-03-04T05:42:30+05:30 IST