తిరిగి వస్తామనుకోలేదు!

ABN , First Publish Date - 2022-03-05T07:24:31+05:30 IST

వారంతా విద్యార్థులు.. ఉన్నత విద్య కోసం దేశంగాని దేశం వెళ్లారు. ఉక్రెయిన్‌లో తమ చదువును కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు రష్యా యుద్ధోన్మాదం విద్యార్థులను భయపెడుతోంది. బాంబుల మోతతో దద్ధరిల్లుతున్న ఉక్రెయిన్‌లో క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

తిరిగి వస్తామనుకోలేదు!

క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం

బాంబుల మోతలు మరింత భయపెట్టాయి

బంకర్‌లలో బిక్కుబిక్కుమంటూ గడిపాం

సైరన్‌ మోగితే.. వణుకు పుట్టేది

కిలోమీటర్ల మేర కాలినడకన బోర్డర్‌కు చేరుకున్నాం

ఎట్టకేలకు ఇండియాకు చేరుకోవడం సంతోషంగా ఉంది

ఉక్రెయిన్‌ నుంచి జిల్లాకు చేరుకున్న విద్యార్థుల మనోగతం


వారంతా విద్యార్థులు.. ఉన్నత విద్య కోసం దేశంగాని దేశం వెళ్లారు. ఉక్రెయిన్‌లో తమ చదువును కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు రష్యా యుద్ధోన్మాదం విద్యార్థులను భయపెడుతోంది. బాంబుల మోతతో దద్ధరిల్లుతున్న ఉక్రెయిన్‌లో క్షణక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. సైరన్‌ మోగిందంటే చాలు బంకర్‌లలో తలదాచుకుంటున్నారు. కిలోమీటర్ల మేర కాలినడకన బోర్డర్‌కు చేరుకుంటున్నారు. ఆకలిదప్పులు ఓర్చుకుని.. ఎముకలు కొరుకుతున్న చలిని తట్టుకుని.. బాంబుల మోతను గుండె ధైర్యంతో భరించి.. కిలోమీటర్ల కొద్దీ నడిచి.. బతుకు జీవుడా అంటూ ఉక్రెయిన్‌ నుంచి సొంతగడ్డకు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా ఇంటికి తిరిగివస్తామని అనుకోలేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మరువలేనిదని జిల్లాకు చేరుకున్న విద్యార్థులు తమ అనుభవాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుకు చేరుకున్నాం..

బోధన్‌రూరల్‌: తాము ఉండే సిటీ నుంచి సరిహద్దుకు రావడానికి 30కి.మీ.ల దూరమే ఉంది. కానీ 24గంటల బస్సు ప్రయాణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుకు చేరుకున్నామని బోధన్‌కు చెందిన ముప్పరాజు వినయ్‌ తెలిపారు. మేము ఉండే సిటీపై నుంచియుద్ధ విమానాలు వెళ్లినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడ్డామని తెలిపారు. మూడేళ్ల క్రితం ఎంబీబీఎస్‌ చదవడానికి ఉక్రెయిన్‌కు వెళ్లానని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు సఫలం కావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నానన్నారు. ఢిల్లీకి వచ్చిన అనంతరం తెలంగాణ భవన్‌లో సేద తీరామని తెలిపారు. కాగా, మా బాబు ఇంటికి క్షేమంగా చేరుకోవడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంధ్యారాణి, నరేందర్‌ అన్నారు.

ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదు..

డిచ్‌పల్లి: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణంలో తాము ప్రాణాలతో తిరిగి స్వదేశానికి వస్తామని అనుకోలేదని మండలంలోని దూస్‌గాం నడిమి తండాకు చెందిన లకవత్‌ కిషోర్‌ కుమార్‌ కన్నీళ్ల పర్యంతమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం దూస్‌గాం తండాకు చేరడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి బస్‌ ద్వారా రొమేనియా బోర్డర్‌కు చేరుకోవడం కోసం తాము పడరానిపాట్లు పడ్డామని తెలిపారు. ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్‌కు వెళితే రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధ వాతావరణంతో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకోకుండానే రావడం జరిగిందని వాపోయారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కిషోర్‌ కుమార్‌ కోరుతున్నారు.

బంకర్‌లలో తలదాచుకున్నాము..

భీమ్‌గల్‌రూరల్‌: ఎప్పుడు ఏమవుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంకర్‌లలో తలదాచుకున్నామని కిలోమీటర్ల మేర కాలినడకన బోర్డర్‌కు చేరుకున్నామన్నాని ఉక్రెయిన్‌ నుంచి స్వగ్రామానికి చేరిన పాలెపు రుచిత తెలిపారు. బుధవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి గురువారం శంషాబాద్‌ ఏయిర్‌పోర్ట్‌కు చేరుకున్నామని తెలిపారు. ఎయిర్‌ పోర్ట్‌లో నా తల్లి దండ్రులను చూసి కన్నీరు ఆగలేదని రుచిత తెలిపింది. యుద్ధం మొదలైన నాటి నుంచే కష్టాలు అనుభవించామని, క్షణక్షణం భయంతో గడిపామని, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డామన్నారు. తాము ఉన్న ప్రదేశం నుంచి బస్సులో 50మంది విద్యార్థులతో కలిసి రెండు రోజులు ప్రయాణించి రొమోనియా బోర్డర్‌కు చేరుకున్నామని తెలిపారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి ఇంత నరకయాతన అనుభవిస్తామని కలలో కూడా అనుకోలేదని వాపోయారు. ఇంకా నా తోటి విద్యార్థులు ఉక్రెయిన్‌ లోనే ఉన్నారని, వారు కూడా క్షేమంగా స్వదేశాలకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న నేను ఇక ముందు ఎక్కడికి వెళ్లి చదవాలో అర్థం కావడంలేదన్నారు. 

సంతోషంగా ఉంది..

ధర్పల్లి: ఉక్రెయిన్‌లో వైద్య విద్యకోసం వెళ్లిన మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన శిరసు నిత్య గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఆ తర్వాత స్వస్థలానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీకి చేరుకున్న వైద్య విద్యార్థులకు అక్కడే తెలంగాణ భవన్‌లో వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. స్వదేశానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్న కుటుంబీకులు తమ బిడ్డ క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. 

కీవ్‌లో భయానక పరిస్థితులు..

నిజామాబాద్‌ అర్బన్‌: రష్యా -ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో భయానక పరిస్థితులు ఉన్నాయని నగరానికి చెందిన చైతాలి తెలిపింది. నగరంలోని కంఠేశ్వర్‌లో గల సత్యం అపార్ట్‌మెంట్‌లో ఉండే వెటర్నరీ డాక్టర్‌ సతీష్‌-సంగీతల కుమార్తె చైతాలి ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది.శుక్రవారం ఉక్రెయిన్‌ నుంచి తన ఇంటికి చేరుకున్న చైతాలి అక్కడ ఉన్న యుద్ధ వాతావరణాన్ని వివరించింది. భయానక పరిస్థితుల మధ్య నాలుగైదు రోజులు గడిపామని తాను ఉంటున్న ప్రాంతానికి 800 మీటర్ల దూరంలోనే పేలుడు జరిగిందని ఆమె తెలిపింది. ఇండియన్‌ ఎంబసీ కీవ్‌ని విడిచివెళ్లమని చెప్పగానే కాలినడకతో ప్రయాణాన్ని ప్రారంభించి అక్కడికి సమీపంలో ఓ రైలు ఎక్కి కొవెల్‌ సిటీకి చేరుకున్నామని అక్కడ నుంచి పొలాంగ్‌ వెళ్లి ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపింది. తమ ఎంబీబీఎస్‌ డిగ్రీని పొలాంగ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆమె తెలిపింది. ఎన్నో ఇబ్బందుల మధ్య తల్లిదండ్రుల చెంతకు చేరడం ఆనందగా ఉందని చైతాలి భావోద్వేగానికి గురైంది.

Updated Date - 2022-03-05T07:24:31+05:30 IST