నెలాఖరులోగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-03-05T07:25:49+05:30 IST

మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సహకరించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు.

నెలాఖరులోగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

నవీపేట, మార్చి 4: మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సహకరించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు చెందిన 5కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్‌ల పనులను శుక్రవారం కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించారు. స్థానిక ఇందిరమ్మ కాలనీ, బహదూర్‌పుర, సుభాష్‌నగర్‌ కాలనీలలో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా పనులను పలువురు అడ్డుకునే వారిపై పోలీసు కేసును నమోదుచేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

చెరువు శిఖం భూమి పరిశీలన..

మండల కేంద్రంలోని దర్యాపూర్‌ పెద్దచెరువు శిఖం భూమిని కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించారు. ఇటీవల చెరువు శిఖం భూమిని పలువురు కబ్జాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ లే అవుట్‌ను కూడా ఆయన పరిశీలించారు. దర్యాపూర్‌ చెరువు పూర్తి విస్తీర్ణాన్ని గూగుల్‌ మ్యాప్‌ ద్వారా సర్వే చేయాలని, చెరువులో ఒక్క గుంట శిఖం భూమి కూడా కబ్జా కావడానికి వీలు లేదని అఽధికారులను హెచ్చరించారు. మూడురోజుల్లో సంబంధిత నివేదికను తనకు అందజేయాలని తహసీల్దార్‌ లతను ఆదేశించారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్‌ సాజీద్‌ అలీ, ఎంపీవో రామకృష్ణ, పంచాయతీ రాజ్‌ ఈఈ బావయ్య, డీఈ రాజయ్య, ఏఈ శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం పరిశీలన..

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని వినాయక్‌నగర్‌లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్‌ నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరిచి ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ గోదాంను పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ మస్టర్లను సత్వరమే రూపొందించాలి..

ఉపాధిహామీ పథకం ద్వారా మెంటల్‌కాంపొనెంట్‌ కింద చేపట్టిన సీసీ రోడ్‌, డ్రైనేజీల నిర్మాణ పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో వీసీ ద్వారా మాట్లాడారు. శనివారం మధ్యాహ్నంలోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఎంపీడీవోలు, ఉపాధిహామీ ఏపీవోలు, పంచాయతీరాజ్‌ ఏఈలను ఆదేశించారు. 

Updated Date - 2022-03-05T07:25:49+05:30 IST