అప్పు.. ముప్పు!
ABN , First Publish Date - 2022-08-13T06:32:14+05:30 IST
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపులు అందరికీ తెలిసిందే. తాజాగా యాప్‌ల ఏజెంట్ల నుంచి వస్తున్న బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. రుణ గ్రహితలు తాము రుణం తీసుకుని ఊబిలో కూరుకుపోతుండడమే కాకుండా కాంటాక్ట్‌గా ఇతరుల నెంబర్లు, వారి అనుమతి లేకుండా ఇస్తూ వారిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

- కొంపముంచుతున్న లోన్‌యాప్‌లు
- డౌన్లోడ్ చేసుకుంటే ట్రాప్‌లో పడినట్టే..
- బాధితులు నష్టపోయిన సొమ్ము రూ. లక్షలపైనే..
- జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్లో ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న కేసులు
- ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్న పోలీసులు
కామారెడ్డి టౌన్, ఆగస్టు 12: ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపులు అందరికీ తెలిసిందే. తాజాగా యాప్‌ల ఏజెంట్ల నుంచి వస్తున్న బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. రుణ గ్రహితలు తాము రుణం తీసుకుని ఊబిలో కూరుకుపోతుండడమే కాకుండా కాంటాక్ట్‌గా ఇతరుల నెంబర్లు, వారి అనుమతి లేకుండా ఇస్తూ వారిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేనందుకే ఇలాంటి ఘటనలు చేసుకుంటుండగా అరికట్టకపోతే ఈ విష వలయం ఒక వ్యవస్థగా మారే అవకాశం ఉందని ఇటీవల ఆర్బీఐ పలు లోన్‌యాప్ నిర్వాహకులకు పలు సూచనలు చేసింది. వాటిని పూర్తిస్థాయిలో అమలుచేస్తేనే వేధింపుల నుంచి ఇబ్బందులు తప్పనున్నాయి.
అత్యవసరమే కొంపముంచుతోంది
అత్యవసరమనో, సులువుగా రుణం వస్తుందనో లోన్యాప్ను ఆశ్రయిస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్టే. చిన్న మొత్తానికి సైతం ప్రాసెసింగ్ ఫీజు, అధికవడ్డీలతో యాప్ నిర్వాహకులు దోచేస్తున్నారు. రుణవాయిదాలు(ఈఎంఐ) సకాలంలో చెల్లించకుంటే ఇబ్బందికర మెసేజీలు, అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతారు. రుణం తీసుకున్న వారి ఫొటోలను మార్ఫింగ్చేసి పంపించడమో లేదంటే కాంటాక్ట్‌లో ఉన్న వారికి బూత్ మెసేజీలతో బెదిరించడం చేస్తుండడంతో ఎవరికి చెప్పుకోలేక తెలియక మదనపడుతున్నారు. యాప్ నిర్వాహకుల మాయమాటలు, సోషల్ మీడియాల్లో పోస్టింగ్‌లను నమ్మి మోసపోవద్దని పోలీసులు తరచూ చెబుతునే ఉన్నా మోసాలు జరుగుతునే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గత నెల 18న అన్నౌన్ నెంబర్ నుంచి మీకు లోన్ వచ్చిందని చెప్పి ఓ లింక్ తన ఫోన్‌కు పంపాడు. దీంతో సదరు వ్యక్తి ఆ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోగానే రూ.35,205 డబ్బు జమ అయింది. యాప్‌లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అతనికి వ్యక్తిగత వివరాలు యాప్‌లోకి అనుమతి ఇవ్వడంతో ఫొటోలు మార్పింగ్ చేసి సైబర్ నేరస్తుడు బ్లాక్ మెయిల్ చేయడం, బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. దీంతో రూ.78 వేలను చెల్లించినప్పటికీ వేధింపులు తగ్గలేదు. సైబర్ నేరస్తుడి ఫోన్ నెంబర్‌ను బ్లాక్‌లో పెట్టగా దాదాపు 40 ఫోన్ నెంబర్లతో వేధింపులకు దిగడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలా జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఈ తరహాలో ఆశచూపి డబ్బులు దండుకుంటూ మానసిక వేదనలకు గురిచేస్తున్న యాప్‌లు చాలానే ఉన్నాయి.
మోసాలు ఎలా జరుగుతున్నాయంటే..
బ్యాంకుల్లోకి వెళితే సవాలక్ష పత్రాలు, ప్రశ్నలు, తక్కువ వడ్డీకి లోన్ వస్తుందని సోషల్ మీడియాలో కనిపించే లోన్ యాప్‌లపై దృష్టి సారిస్తున్నారు. ఒక యాప్‌ను చూస్తే చాలు ఇతర యాప్ నిర్వాహకులకు సోషల్ మీడియాలో లోన్ల కోసం వెతుకుతున్నారని గ్రహించడమో లేదంటే ఇతర యాప్‌లో లోన్ తీసుకుంటే చాలు ఇక ఫోన్ల మోత మోగుతూ చివరకు ఎలాగైన సరే లోన్లను తీసుకునేలా మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. మొదట్లో లోన్‌యాప్ నిర్వాహకులు రూ.5వేల నుంచి రూ.20వేల వరకు రుణాలు ఇస్తారు. 20 నుంచి 25 శాతం వడ్డీ వసూలు చేస్తామని తొలుత చెబుతారు. రుణం ఇచ్చేటప్పుడే అందులో పది శాతానికి పైగా ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, జీఎస్టీ పేరుతో కోత పెడతారు. లోన్ ఇచ్చిన తర్వాత ఊహించని విధంగా వడ్డీ, ఎక్కువ డబ్బులు చెల్లించాలంటూ టార్చర్ పెడతారు. ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైతే భారీగా పెనాల్టీలు, చక్రవడ్డీలు వేస్తారు. తాము చెప్పినంత చెల్లించకపోతే రికవరి ఏజెంట్లు ద్వారా నరకం చూపిస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి
తక్కువ వడ్డీకిలోను ఇస్తామంటే ఎవరిని నమ్మవద్దు. బ్యాంకు లేదా ఆర్గనైజేషన్ వాళ్లు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణం ఇవ్వరు. సైబర్ నేరగాళ్లు మన ఫొటోలను మార్పింగ్ చేసి మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి పెడతామని బెదిరిస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలి. సెల్‌ఫోన్ యాప్ స్టోర్‌లో కొత్త యాప్‌ను డౌన్లోడ్ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వ్యక్తిగత వివరాలను గుర్తు తెలియని వారికి ఇవ్వడం ప్రమాదకరమని జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ఈ తరహ కేసులో జిల్లా కేంద్రంతో పాటు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో పదుల సంఖ్యలో నమోదవుతుండడంతో లోన్‌యాప్‌లపై హెచ్చరికలు జారీ చేస్తున్నా పెడచెవిన పెడుతుండడంతో మోసపోతున్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.