జిల్లాలో మొదలైన యాసంగి పంటల సాగు

ABN , First Publish Date - 2022-12-16T01:24:44+05:30 IST

జిల్లాలో యాసంగి సాగు మొదలైంది. పంటలు వేసిన రైతులు రైతుబంధు కోసం వేచిచూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఈ నెలలోనే రైతుబంధు విడుదల చేస్తామని ప్రకటించడంతో పంటలను సాగుచేస్తున్నారు. వానాకాలం లాగానే యాసంగిలో కూడా పంటలకు ముందే రైతుబంధు వస్తుందని ఆశతో ఎదరుచూస్తున్న రైతులు ఇతర మార్గాల ద్వారా పెట్టుబడులు తీసుకువచ్చి పంటలను సాగుచేస్తున్నారు.

జిల్లాలో మొదలైన యాసంగి పంటల సాగు

నేటికీ విడుదలకాని రైతుబంధు మార్గదర్శకాలు

ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న రైతులు

లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణ పంపిణీ చేపట్టని బ్యాంకర్లు

జిల్లాలో ఇప్పటి వరకు 86వేల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం

నిజామాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో యాసంగి సాగు మొదలైంది. పంటలు వేసిన రైతులు రైతుబంధు కోసం వేచిచూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఈ నెలలోనే రైతుబంధు విడుదల చేస్తామని ప్రకటించడంతో పంటలను సాగుచేస్తున్నారు. వానాకాలం లాగానే యాసంగిలో కూడా పంటలకు ముందే రైతుబంధు వస్తుందని ఆశతో ఎదరుచూస్తున్న రైతులు ఇతర మార్గాల ద్వారా పెట్టుబడులు తీసుకువచ్చి పంటలను సాగుచేస్తున్నారు. బ్యాంకర్లు కూడా సకాలంలో రుణాలు అందించకపోవడంతో పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. ఆరుతడి పంటలను పూర్తిచేసిన రైతులు వరినాట్లలో నిమగ్నమవుతున్నారు.

రైతుబంధుకు ఎదురుచూపులు

రాష్ట్ర ప్రభుత్వం గత సీజన్‌లాగానే ఈ యాసంగిలో కూడా ముందుగానే రైతుబంధు విడుదల చేస్తుందని భావించిన జిల్లా రైతులకు నిరాశ మిగిలింది. ప్రతి సీజన్‌లో పంటలకు ముందుగానే రైతుల ఖాతాలో జమచేసిన ప్రభుత్వం డిసెంబరు ఆరంభమై రెండు వారాలు గడిచిపోయినా ఇప్పటికీ ప్రకటన వెలువడకపోవడంతో రైతులు రైతుబంధుకు ఎదురుచూస్తూన్నారు. జిల్లాలో వానాకాలంలో 2లక్షల 60వేల మంది రైతులకు రైతుబంధును అందించారు. సుమారు 256 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమచేశారు. వానాకాలం ఆరంభం జూన్‌లోనే రైతుబంధు అమలు ప్రారంభించడంతో రైతులు పంట పెట్టుబడులకు వినియోగించారు. విత్తనాలు, ఎరువులకు, కూలీలకు రైతుబంధు నిధులను ఉపయోగించారు. అయితే ఈ యాసంగి ఆరంభమై నెలన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు మాత్రం ఇంకా రైతుబంధుపై పూర్తి ప్రకటన వెలువడలేదు. సీఎం కేసీఆర్‌ ఈ నెలాఖరులోపు రైతుల ఖాతాలో జమచేస్తామని ప్రకటించినా విధివిధానాలు మాత్రం విడుదల చేయలేదు. కొత్త రైతుల కోసం మార్గదర్శకాలను ప్రకటించలేదు.

86వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం

జిల్లాలో యాసంగిలో ఇప్పటి వరకు 86వేల ఎకరాల్లో పంటలను వేశారు. మొక్కజొన్న, ఎర్రజొన్న, శనగతో పాటు ఇతర పంటలను సాగుచేశారు. వరిసాగు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం లాగానే ఈ యాసంగిలో కూడా పంటల విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరుతడి పంటలతో పాటు వరిసాగు మొదలుపెట్టే రైతులు ఎకరాకు 10 నుంచి 15వేల వరకు పెట్టుబడి పెట్టనున్నారు. దుక్కి దున్నడంతో పాటు ఎరువులు, కూలీలు, ట్రాక్టర్‌లకు ఈ పెట్టుబడిని పెట్టనున్నారు. రైతుబంధు నిధులు విడుదలైతే వీటితో పాటు మరికొన్ని నిధులను కలిపి పంటలను వేసేవారు. ప్రస్తుతం రైతుబంధు విడుదలకాకపోవడం, బ్యాంకుల నుంచి రుణాలు కూడా వేగవంతంగా ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించే రైతుబంధు కోసం జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు.

అందని బ్యాంకు రుణాలు

జిల్లాలో యాసంగి సాగు మొదలై నెలన్నర గడిచినా ఇప్పటి వరకు మాత్రం బ్యాంకులు రుణాలను సకాలంలో ఇవ్వడంలేదు. వానాకాలంలో లాగా రైతులకు అందించడంలేదు. యా సంగిలో 1508 కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ సహకార బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించారు. గ్రామాల వారీగా ఆయా బ్యాంకులకు కేటాయింపులు చేశారు. రైతులు వేసే పంటల ఆధారంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలను అందించాలని కోరారు. యాసంగిలో నవంబరు నుంచి మార్చి వరకు రుణ పంపిణీ చేస్తారు. రైతులకు నవంబరు, డిసెంబరు, జనవరి నెలలోనే ఎక్కు వగా పెట్టుబడికి డబ్బులు అవసరం ఉం టుంది. ఈ మూడు నెలల్లోనే ఆరుతడి పంటలతో పాటు వరినాట్లను వేస్తారు. ఈ పెట్టుబడికోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలను ఇవ్వాలి. నిర్ణయించిన లక్ష్యంలో ఈ మూడు నెలల్లోనే 80శాతం వరకు రుణ పంపిణీ పూర్తిచేయాలి. ఇప్పటి వరకు మాత్రం కనీసం పదిశాతం లోపు కూడా రుణాలను అందించలేదు. జిల్లాలో కేవలం వంద కోట్లలోపే ఇప్పటి వరకు పంట రుణాలను మంజూరు చేశారు. ఎక్కువ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు బ్యాంకర్లు మొగ్గుచూపడంలేదు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు ప్రతీవారం సమీక్షించిన ఇప్పటి వరకు మాత్రం రుణాల పంపిణీ పెరగలేదు. రైతుబంధుతో పాటు రుణాలను సకాలంలో అందిస్తే రైతులు కూడా వ్యాపారుల వద్ద అప్పులు తీసుకునే పరిస్థితి తప్పనుంది. జిల్లాలో రుణాలు అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. పూర్తిస్థాయిలో రైతులందరికీ రుణాలను అందిస్తామని తెలిపారు. రైతుబంధుపై మాత్రం ఇంకా మార్గదర్శకాలు రాలేదని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.

Updated Date - 2022-12-16T01:24:46+05:30 IST