పరిహారం అందేనా?

ABN , First Publish Date - 2022-07-18T07:18:29+05:30 IST

జిల్లాలో భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినా ఇప్పటికీ పరిహారంపై ప్రకటన లేదు.. ఇన్‌పుట్‌ సబ్సిడీపై జీవో లేదు. పాత జీవో సమయం ముగియడంతో ప్రస్తుతం పంటలు నష్టపోయిన రై తులకు పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో పంటల సాగు కోసం వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన కొద్ది రోజులకే వర్షాల వల్ల పంటు నేలపాలు కావడంతో తీవ్ర ఆందోళన చెందు తున్నారు.

పరిహారం అందేనా?

జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలు  

ఇప్పటికీ పరిహారంపై ప్రకటన కరువు  

రెండేళ్ల క్రితం ముగిసిన జీవో గడువు  

ఇన్‌పుట్‌ సబ్సిడీపై కానరాని కొత్త జీవో

ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతుల వేడుకోలు  

స్వల్పకాలిక పంటలను సాగు చేయాలంటున్న అధికారులు

నిజామాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినా ఇప్పటికీ పరిహారంపై ప్రకటన లేదు.. ఇన్‌పుట్‌ సబ్సిడీపై జీవో లేదు. పాత జీవో సమయం ముగియడంతో ప్రస్తుతం పంటలు నష్టపోయిన రై తులకు పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో పంటల సాగు కోసం వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన కొద్ది రోజులకే వర్షాల వల్ల పంటు నేలపాలు కావడంతో తీవ్ర ఆందోళన చెందు తున్నారు. మిగిలిన పంటలు కాపాడుకునే ప్రయ త్నం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదు కోవా లని కోరుతున్నారు. జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పం టల స్థానంలో రైతులు కొత్త పంటలను వేసేం దుకు ప్రత్యామ్నాయ ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. పంటలు దెబ్బతిన్న గ్రామాల పరిధిలో రైతులకు అవగాహన కల్పించి మళ్లీ పంటలను వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీపై స్పష్టత కరువు

జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదు. ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఇచ్చిన జీవో గడువు ముగిసి రెండేళ్లు గడిసింది. ఇప్ప టి వరకు కొత్త జీవోను విడుదల చేయలేదు. వర్షాల కు దెబ్బ తిన్న పంటల కోసం ఇన్‌పుట్‌ సబ్సిడీని అందిం చేందుకు ఇప్పటి వరకు ఎలాంటి జీవోను విడుదల చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాత జీవో ప్రకారం వర్షాలకు పంట లు దెబ్బతింటే హెక్టారుకు 13,500 రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు ఈ నిధులను కేటాయిస్తారు. జిల్లాల వారీగా పంట నష్టం అంచనావేసి రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీనీ జమ చేస్తారు. అ యితే జీవో మనుగడలో లేనందున ఈ దఫా వర్షాల కు దెబ్బతిన్న రైతులకు సహాయం అందించడం కష్టమేనని అధికారుల సమాచారం బట్టి తెలుస్తోంది.

60 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట

జిల్లాలో వారం రోజుల పాటు పడిన వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటం వల్ల 60 వేల ఎకరాల వరకు పంట దెబ్బతింది. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల వారీగా దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించారు. ప్రభుత్వానికి ప్రాథమిక అంచనాలతో కూడిన నివేదికను పంపారు. జిల్లాలో ఈ వర్షాలకు వరి బాగా దెబ్బతింది. వరి, నారుమళ్లు కలిసి 45 వేల వరకు పంటలు దెబ్బతిన్నాయి. నాటువేసిన వారం రోజులలోపే భారీ వర్షాలు పడి పంట చేన్లలో నీళ్లు నిల్వడంతో ఈ పంట దెబ్బతింది. జిల్లాలో 15 వేల ఎకరాల వరకు సోయబీను పంట దెబ్బతింది. మొక్క జొన్న, పత్తి పంటలు ఐదు వేల ఎకరాల వరకు దెబ్బ తింది. పంటలకు వేలాది రూపాయలు పంటలకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

స్వల్ప కాలం పంటలపై అవగాహన

జిల్లాలో భారీగా పంటలు దెబ్బతినడంతో వ్యవ సాయశాఖ అధికారులు రైతులకు తక్కువ రోజులలో పండే పంటలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. వాటికి సంబంధించిన విత్తనాల ను సూచిస్తూ నేరుగా సాగుచేయాలని కోరుతున్నా రు. నారుమళ్లు వేసి నాటు వేయాలని కోరుతున్నారు. ఆగస్టు చివరి వరకు అవకాశం ఉన్నందున సమ యం మించిపోలేదని వివరించే ప్రయత్నం చేస్తున్నా రు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు సొసైటీల ద్వారా సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, ఎంటీయూ విత్తనాలను అందుబాటు లో ఉంచారు. రైతులు సమస్యలు ఎదుర్కోకుండా విత్తనాలు వెదజల్లే పద్ధతిలో సాగుచేయాలని కోరుతున్నారు. ఈ విధానంలో వరి వేయడం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి వస్తోందని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 

జిల్లాలో వర్షాలు తగ్గడంతో వరినాట్లు పెరిగాయి. వర్షాలకు దెబ్బతిన్న పంటలు కాపాడుకునేందుకు ఎరువుల వినియోగం పెంచడంతో 20 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచారు. సొసైటీలు, డీలర్ల ద్వారా అధికారులు సరఫరా చేస్తున్నారు.

ఎనిమిది ఎకరాల పొలం దెబ్బతింది..

ఫ రాజిరెడ్డి, మైలారం

జిల్లాలో కురిసిన వర్షాలకు ఎనిమిది ఎకరాల పొలం దెబ్బతింది. వేసిన పంట చేతికి రాలేదు. లక్షన్నర పెట్టుబడి పోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్లీ పంటలు సాగుచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమే పరిహారం అందించి ఆదుకోవాలి.

నాట్లు వేసిన వారానికే నీట మునిగింది..

ఫ అలూరి రాజన్న, నూతుపల్లి

వరి నాటు వేసిన వారం రోజులకే పంట మొత్తం నీట మునిగింది. వేసిన మొత్తం పంట దెబ్బతింది. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. పరిహారం అందించి పంటలు వేసుకునేందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందించాలి.

స్వల్పకాలిక రకాలు సాగుచేయాలి..

ఫ తిరుమల ప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి:

జిల్లాలో పంటలు దెబ్బతిన్న రైతులు స్వల్పకాలిక రాకాలు వేయాలి. వరి నారు పోసి నాట్లు వేసే బదులు వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలి. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాం. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పంటలను రక్షించుకోవాలి.

Updated Date - 2022-07-18T07:18:29+05:30 IST