చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా..

ABN , First Publish Date - 2022-09-08T06:36:55+05:30 IST

చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగాలంటే పోషకాహారం తప్పనిసరి. అయితే తల్లులకు సరైన అవగాహన ఉండడం లేదు. ఫలితంగా ఆరోగ్యంగా పుట్టకపోవడంతో పాటు ఎదగకపోవడం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి దీనిని నివారించేందుకు స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2018 నుంచి ప్రతీ సంవత్సరం సెప్టెంబరులో పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది.

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా..
కామారెడ్డిలో అవగాహన ర్యాలీ చేపడుతున్న ఐసీడీఎస్‌ సిబ్బంది

- తల్లీబిడ్డకు పోషకాహారం
- ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలపై ఫోకస్‌
- గర్భిణులు, బాలింతలకు అవగాహన
- పోషణ్‌ అభియాన్‌ పథకం నిర్వహణ
- ఈనెల 30 వరకు కొనసాగింపు

కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 7:
చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగాలంటే పోషకాహారం తప్పనిసరి. అయితే తల్లులకు సరైన అవగాహన ఉండడం లేదు. ఫలితంగా ఆరోగ్యంగా పుట్టకపోవడంతో పాటు ఎదగకపోవడం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి దీనిని నివారించేందుకు స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2018 నుంచి ప్రతీ సంవత్సరం సెప్టెంబరులో పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ మాసోత్సవాల్లో భాగంగా ప్రతీ వారం ఒక అంశంపై కార్యాచరణ చేపడతారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించడమే ఈ మాసోత్సవ లక్ష్యమని ఐసీడీఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ర్యాలీ నిర్వహించారు.
గర్భిణులకు, బాలింతలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యం
ప్రతీ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మీ పథకంలో అవగాహన కల్పించడమే మాసోత్సవాల ముఖ్య ఉద్దేశఽ్యం.  ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు గుడ్లు అందజేస్తున్నారు. కాగా పుట్టిన శిశువులకు ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించాల్సి ఉంటుంది. పోషక మహోత్సవ్‌లో భాగంగా ముందుగా చిన్నారుల వయస్సుకు తగిన ఎత్తు, బరువులను గుర్తిస్తారు. అలాగే ఆ పిల్లల ఇంటికి ప్రత్యేకంగా అదనపు ఆహారం అందిస్తారు. నెల తర్వాత పిల్లల ఎత్తు, బరువు ఎంత ఉందో సేకరిస్తారు. ఈ వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తలు ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎర్ర రంగు చార్టుల్లో పొందుపరిచి తల్లులకు ఇస్తారు. దీన్ని బట్టి ఆరేళ్లలోపు చిన్నారులకు ఏయే మోతాదులో పోషకాహారం అందించాలో వివరిస్తారు. ఇలా పోషకాహారం ద్వారా పిల్లలకు కలిగే ప్రయోజనాన్ని వివరించేలా అవగాహన కల్పిస్తారు. పిల్లల్లో చురుకుదనం, లోపపోషణ తగ్గించడం, పిల్లలు, మహిళలు, కౌమార బాలికల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించడం ఈ మాసోత్సవ లక్ష్యం. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా మాతా శిశు రక్షణ, పౌష్టికాహారం అందించే చర్యలు చేపడుతున్నారు. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతోంది.
నాలుగు వారాల పాటు వివిధ కార్యక్రమాలు
పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవంలో భాగంగా మొదటివారం విద్యాశాఖతో సమన్వయం చేసుకుని పిల్లల ఎత్తులు, బరువులు తప్పులు లేకుండా నమోదు చేస్తారు. రెండో వారంలో ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించడం, ఊరేగింపులు చేపడతారు. మూడో వారంలో న్యూట్రీగార్డెన్‌, కిచెన్‌ గార్డెన్‌లో భాగంగా సమతుల ఆహారం తీసుకోవడం, పాఠశాల ఆవరణలో కూరగాయల మొక్కలు పెంచడంపై అవగాహన కల్పిస్తారు. నాలుగో వారంలో పోషణ్‌ మేళా నిర్వహించి పౌష్టికాహారం కలిగిన పదార్థాలపై వివరిస్తారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి ఆహారం వంటి అంశాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తారు. పీహెచ్‌సీలను సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యత, ప్రయోజనాలను వివరిస్తారు. సీసా పాలు పట్టడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తారు. స్కూల్‌లు, అంగన్‌వాడీల్లో కూరగాయల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరిస్తారు. అనుభవం ఉన్న నిపుణులతో గర్భిణులు, బాలింతలకు యోగా తరగతులు నిర్వహిస్తారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారు.
చిన్నారులకు పోష్టికాహారం ఇలా..
శిశువు పుట్టిన గంటలోగా ముర్రుపాలు తాగించాలి. పిల్లలకు ఆరు నెలలు నిండేదాకా కేవలం తల్లిపాలే పట్టాలి. తాగునీరు లేదా ఇతర ద్రావణాలు ఏవి ఇవ్వకూడదు. ఇక 6 నెలల నుంచి 12 నెలలోపు పిల్లలకు ఇంట్లో వండిన అన్నం, పప్పు, కూర, గుడ్డు అయితే మెత్తగా చేసి, పండు అయితే గుజ్జుగా చేసి 250 మి.లి గిన్నెలో సగం నుంచి 3వ వంతు ఉండేలా చూసుకొని రోజుకు 3 నుంచి 4 సార్లు తినిపించాలి. ఉడికించిన బంగాళాదుంపలు, క్యారెట్‌ మెత్తగా చేసి తినిపించొచ్చు. చిరుతిండి(ఇంట్లో తయారు చేసిన స్నాక్స్‌ మాత్రమే) ఒక సారి పెట్టాలి. ఈ ఆహారంతో పాటు తల్లిపాలు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. మెత్తగా చేసిన అరటి, బొప్పాయి పండ్లను తినిపించాలి.

పోషకాహారంపై అవగాహన చేపడుతున్నాం
- రోచిష్మ, సీడీపీవో, దోమకొండ
పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవం నిర్వహిస్తున్నాం. నెల పాటు ప్రతీ వారం ఒక్కో అంశఽంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. పుట్టిన బిడ్డ వయస్సు తగ్గ ఎత్తు, బరువు ఉంటూ ఆరోగ్యంగా ఎదిగేలా తల్లులకు అవగాహన కల్పిస్తాం.

Read more