పట్టి పీడిస్తున్న బీపీ, షుగర్‌

ABN , First Publish Date - 2022-12-31T00:52:15+05:30 IST

జిల్లాలోని వేలాది మందిని బీపీ, షుగర్‌ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.

పట్టి పీడిస్తున్న బీపీ, షుగర్‌
ప్రభుత్వం అందిస్తున్న ఎన్‌సీడీ కిట్‌

- ఎన్‌సీడీ సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు

- బాధితుల్లో యువకులే అధికం

- సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 30: జిల్లాలోని వేలాది మందిని బీపీ, షుగర్‌ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నాన్‌ కమ్యూనికేబుల్‌ డీసీజెస్‌ (ఎన్‌సీడీ) సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. రక్తపోటుతో బాధపడుతున్న వారిలో ఎక్కువ శాతం మంది 30 శాతం నుంచి 50ఏళ్ల లోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ శాతం మందికి రక్తపోటు నియంర

తణలో ఉండటం లేదు. జిల్లా జనాభాలో 15 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. వీరి ఆరోగ్య పరిస్థితి పలు సందర్భాల్లో ఇబ్బందికరంగా మారుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా గుండె సంబంధిత వ్యాధుల భారిన పడటంతో పాటు ప్రాణాంతంకంగా మారవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్‌ (షుగర్‌)తోను అనేక మంది అవస్థలు పడుతున్నట్లు సర్వేలో తేలింది. జిల్లాలోని సుమారు 9 శాతం మందికిపైగా షుగర్‌ రోగులు ఉన్నట్లు అధికారుల నివేదిక ద్వారా తెలుస్తోంది. చాలా మంది తమకు షుగర్‌ ఉందనే విషయాన్ని బయటకు చెప్పడం లేదని వైద్యులు చెబుతున్నారు. టెస్టుల కోసం వెళితే ఇతరులకు తెలుస్తుందనే భయంతోనూ పరీక్షలు చేయించుకోవడం లేదని పేర్కొంటున్నారు.

ప్రతీనెల మందుల పంపిణీ

జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ అధికారులు చేపట్టిన ఎన్‌సీడీ సర్వే ప్రకారం మొత్తం 74,517 మంది రక్తపోటును ఎదుర్కొంటున్నట్లు తేలింది. వీరిలోనూ పట్టణ ప్రాంతాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. కంప్యూటర్‌ సంబంధిత ఉద్యోగాలు చేసే వారితో పాటు, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఉద్యోగాల వేటలో ఉంటూ ఒత్తిడికి లోనవుతున్న వారితో పాటు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి వ్యాధికి కారణమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో యాబై ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా బీపీతో బాధపడుతున్నట్లు తేలింది. వీరందరిని గుర్తించిన వైద్యఆరోగ్యశాఖ ప్రతీ నెల మందులను పంపణీ చేస్తోంది.

46,183 మంది షుగుర్‌ వ్యాధిగ్రస్తులు

జిల్లాలో 46,813 మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యాధి భారిన పడ్డ వారిలో యువత కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. డయాబెటిస్‌ వ్యాధి జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. వంశపారంపర్యంగా లేదా మానసిక ఒత్తిడి, జంక్‌ఫుడ్‌ తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, పొగాకు, మద్యం వంటి వ్యసనాలతో పాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోకపోవడం వంటివి షుగర్‌ వ్యాప్తికి కారణాలుగా తెలుస్తోంది. పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ షుగర్‌ రోగులు ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రస్తుతం వీరందిరికి ప్రభుత్వం ఎన్‌సీడీ కిట్లు పంపిణీ చేస్తుంది.

జిల్లాలో 30వేల కిట్ల పంపిణీ

- లక్ష్మణ్‌సింగ్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

జిల్లాలో అత్యధిక మంది బీపీతో బాధపడుతున్నట్లు తేలింది. బీసీ ఉన్నవాళ్లు తప్పకుండా డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. రోగులకు ఎన్‌సీడీ కిట్‌ ద్వారా ప్రభుత్వం అన్ని రకాల మందులు అందిస్తోంది. క్రమంగా తప్పకుండా వాడుకోవాలి. షుగర్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయద్దు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న వారికి మొదటి విడతలో 30వేల కిట్లను పంపిణి చేశాం.

Updated Date - 2022-12-31T00:52:20+05:30 IST