బ్యాంకులో చోరీ కలకలం

ABN , First Publish Date - 2022-07-06T05:35:15+05:30 IST

జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన చోరీ కలకలం సృష్టిస్తోంది. భారీ చోరీతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. సుమారు మూ డు గ్రామల ప్రజలు బ్యాంకులో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చోరీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు ఎదుట బారులు తీరారు.

బ్యాంకులో చోరీ కలకలం

ఆందోళనలో బుస్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఖాతాదారులు   

చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం 

నాలుగు బృందాలను నియమించిన పోలీసులు 

అంతర్రాష్ట్ర దొంగల ముఠాపైనే అనుమానాలు

నిజామాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన చోరీ కలకలం సృష్టిస్తోంది. భారీ చోరీతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. సుమారు మూ డు గ్రామల ప్రజలు బ్యాంకులో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చోరీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు ఎదుట బారులు తీరారు. త్వరగా దొంగలను పట్టుకుని సొత్తు రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడిన ముఠా వివరాలను సేకరిస్తున్నారు. నాలుగు బృందాలను నియమించి పాత కేసుల ఆధారంగా అంతర్రాష్ట్ర గ్యాంగులపై దృష్టిపెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దొంగలు జాతీయ రహదారి పక్కనే ఉన్న బ్యాంకులో  పక్కాగా స్కెచ్‌ వేసి ఆధునిక పద్ధతులను ఉపయోగించి చోరీకి పాల్పడ్డారు. 

సీసీ కెమెరాల ధ్వంసం 

మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి చొరబడిన దొంగలు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గ్యాస్‌ కట్టర్‌ల సహాయంతో బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు లాకర్‌ను తెరచి తాకట్టుపెట్టిన బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బంగారం విలువ సుమారు నాలుగున్నర కోట్లకు పైగా ఉండగా ఇతర లాకర్‌ల ధ్వంసానికి ప్రయత్నాలు చేసినా గ్యాస్‌ అయిపోవడంతో వదిలివెళ్లిపోయారు. 

ఖాతాదారుల్లో మూడు గ్రామాల ప్రజలు

బ్యాంకు పరిధిలో మూడు గ్రామాలకు చెందిన రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు తమ డబ్బులు డిపాజిట్‌ చేశారు. బంగారం కూడా కుదవపెట్టి రుణాలు తీసుకున్నారు. కొంతమంది ఈ బ్యాంకులో బంగారం లాకర్‌లో దాచుకున్నారు. బ్యాంకులో చోరీ ఘటన తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. ఊరుకి కొద్దిదూరంలో జాతీయ రహదారికి పక్కనేఉన్న ఈ బ్యాంకులో దొంగతనం జరగడంతో సోమవారం గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ పిలిపించి వివరాలు సేకరించిన పోలీసులు ఇతర రాష్ట్రాల దొంగల గ్యాంగుల పనే అని గుర్తించారు. వారి కోసం నాలుగు బృందాలను నియమించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హర్యానాతో పాటు రాష్ట్రంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగు బృందాల పోలీసుల ఆధ్వర్యంలో వారిని పట్టుకోవడంతో పాటు బంగారాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో గడిచిన కొన్నేళ్లుగా ఏటీఎంలు, బ్యాంకుల్లో చోరీ ఇదేవిధంగా చేస్తున్నారు. ఈ చోరీలన్నీ చేసేవారు మహారాష్ట్రతో పాటు హర్యానా, యూపీకి చెందిన దొంగలే ఉన్నారు. ప్రధాన రహదారులు, హైవేల పక్కన ఉన్న బ్యాంకులు, ఏటీఎంలే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు ఈ ముఠాలు పాల్పడుతుండడంతో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. దొంగతనం చేసిన తర్వాత దొంగలు ఏ వైపు వెళ్లారో డాగ్‌స్క్వాడ్‌ ద్వారా పరిశీలించారు. పోచంపాడ్‌ దాటిన తర్వాత నిర్మల్‌ జిల్లా పరిధిలోని సోన్‌లో టోల్‌గేట్‌ ఉండడంతో ఆవైపు వెళ్లే అవకాశం లేదని భావిస్తున్నారు. పోచంపాడ్‌ ప్రాజెక్టు మీదుగాగాని, మెండోరా నుంచి వేరే మార్గాల ద్వారా దొంగలు వెళ్లే అవకాశం ఉందని ఆ దారుల వెంట ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్‌ వరకు ఉన్న కెమెరాలు పరిశీలిస్తున్నారు. అదేరీతిలో సోన్‌ బ్రిడ్జి దాటిన తర్వాత ఉన్న టోల్‌గేట్‌ ప్రాంతంలో పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనానికి పాల్పడిన బుస్సాపూర్‌ తెలంగాణ బ్యాంకులోకి లాకర్‌ లేకాకుండా వేరే లాకర్‌లు ఉండడం వాటిలో కూడా బంగారం, కొంత క్యాష్‌ బ్యాంకులో ఉండడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దొంగలు సీసీ కెమెరాలు పగలగొట్టకు ముందు ఏవైపు నుంచి వచ్చారో పరిశీలిస్తున్నారు. బుస్సాపూర్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. బ్యాంకులో అన్ని సైరన్‌లు ఆపివేసి ఉండడం, గ్యాస్‌ అయిపోవడంతో దొంగలు వెళ్లిపోవడం వల్ల కొంతమేర నష్టం తగ్గిందని అధికారుల పేర్కొంటున్నారు. అన్ని లాకర్‌లు ఓపెన్‌ చేస్తే భారీగా బంగారంతో పాటు క్యాష్‌ ఎత్తుకెళ్లేవారని వాపోతున్నారు. బ్యాంకులో జరిగిన దొంగతనంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు. ఈ కేసును త్వరగా తేల్చేందుకు నాలుగు బృందాలను నియమించామన్నారు. బృందాల ఆధ్వర్యంలో దర్యా ప్తు కొనసాగిస్తున్నామని ఇతర రాష్ట్రాలకు చెం దిన గ్యాంగ్‌లు ఈ చోరీ చేశారని అనుమానిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తూనే త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

బ్యాంకు ఎదుట ఖాతాదారుల బారులు

మెండోర: జిల్లాలో సంచల నం సృష్టించిన బుస్సా పూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ ఘటన ఖాతాదారులను ఆందోళనకు గురిచేస్తోంది. విషయం తెలియగానే ఖాతాదారులు, రైతులు మంగళవారం అధిక సంఖ్యలో బ్యాంకుకు తరలివచ్చారు. అయితే బ్యాంకులో ఇంకా క్లూస్‌టీమ్‌ తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఎవరినీ లోపలికి అనుమతించడంలేదు. గోల్డ్‌లోన్‌ బాధితులు బ్యాంకు వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. బ్యాంకు అధికారులు ఎవరైతే గోల్డ్‌లోన్‌ తీసుకున్నారో వారికి అవగాహన కల్పించి భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు. కాగా,  బ్యాంకు వద్ద రాత్రి కూడా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంతర్రాష్ట ముఠాపైనే అనుమానం..

జిల్లా పోలీసు యంత్రాంగం దుండగులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా నాలుగు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సిద్దిపేట్‌, కుకునూర్‌, ఇందల్వాయిలో జరిగిన చోరీకి పాల్పడిన అంతర్రాష్ట ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర, హర్యాన, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట దొంగల కోసం ప్రత్యేక పోలీసు బృందం ఆయా రాష్ట్రాలకు వెళ్లారని సమాచారం. చోరీ జరిగిన తీరును ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు వివరాలను జిల్లా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు చేరవేస్తూ గాలింపు ముమ్మరం చేస్తున్నారు.

Updated Date - 2022-07-06T05:35:15+05:30 IST