అందని రుణం
ABN , First Publish Date - 2022-08-04T06:06:29+05:30 IST
రైతుల పంట రుణమాఫీ అంశం హామీలకే పరిమితం అయింది. ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేయకుండా ఉండడంతో రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలకు మోక్షం కలగడం లేదు. పాత రుణం చెల్లింపులు పూర్తికాకుండా కొత్తగా మంజూరు చేసేది లేదంటూ జిల్లాలోని పలు బ్యాంకర్లు రైతులకు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ పంటలు సాగవుతున్నప్పటికీ బ్యాంకులు మాత్రం కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు.
- రుణమాఫీపై రైతులకు తప్పని నిరీక్షణ
- సకాలంలో అందని పంట రుణాలు
- గతంలో తీసుకున్న రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు
- రైతుబంధు నగదును వడ్డీకి జమ చేసుకుంటున్న పరిస్థితి
- కొత్త పంట రుణాల కోసం బ్యాంకర్ల కొర్రీలు
- ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఇవ్వని బ్యాంకర్లు
- జిల్లాలో వానాకాలం పంట రుణాల లక్ష్యం రూ.1,656 కోట్లు
- రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు
- పంటల సాగుకు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్న వైనం
కామారెడ్డి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రైతుల పంట రుణమాఫీ అంశం హామీలకే పరిమితం అయింది. ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేయకుండా ఉండడంతో రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలకు మోక్షం కలగడం లేదు. పాత రుణం చెల్లింపులు పూర్తికాకుండా కొత్తగా మంజూరు చేసేది లేదంటూ జిల్లాలోని పలు బ్యాంకర్లు రైతులకు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ పంటలు సాగవుతున్నప్పటికీ బ్యాంకులు మాత్రం కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు. ఎన్నికల సమయంలో రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ వాటిని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు రైతుబంధు కింద వచ్చిన నగదును సైతం వడ్డీకి పలు బ్యాంకర్లు జమ చేసుకుంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు రైతులకు ఇవ్వాలంటూ ప్రతీ ఏటా ప్రభుత్వం లక్ష్యాలను నిర్ధేశిస్తున్నా దానికి తగ్గట్టుగా రుణాలు ఇవ్వడం లేదని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
వానాకాలం రుణాల లక్ష్యం రూ.1,656 కోట్లు
ఇప్పటికే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అధికారులు నిర్ణయించారు. ఇందులో రుణ పంపిణీ లక్ష్యం రూ.4,700 కోట్లు ఉండగా, ప్రాధాన్యరంగాలకు రూ. 1,100 కోట్లు, వ్యవసాయరంగానికి రూ.3,600 కోట్లు కేటాయించారు. ఇందులో పంట రుణాల కోసం రూ.2,757 కోట్లు కేటాయించగా ఈ వానాకాలం పంట రుణాల లక్ష్యం రూ.1,656 కోట్లుగా, యాసంగి పంట రుణ లక్ష్యం రూ. 1,101 కోట్లుగా నిర్ధేశించారు. ఆయా బ్యాంకులకు లక్ష్యాలను సైతం పంట రుణాల కోసం లక్ష్యాన్ని కేటాయించారు. ఇందులో ఈ వానాకాలం సీజన్లో 1,39,274 మంది రైతులకు గాను రూ.1,656 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 22,654 మంది రైతులకు రూ.240 కోట్లు పంట రుణాలను ఆయా బ్యాంకర్లు ఇచ్చారు. అయితే గతంలో తీసుకున్న రుణాలు రైతులు చెల్లించకుంటే కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ప్రతీ సీజన్లోనూ బ్యాంకర్లు వారివారికి నిర్ధేశించిన లక్ష్యానికి తగ్గట్టుగా పంట రుణాలు ఇవ్వకపోవడంతో లక్ష్యాలను చేరుకోవడం లేదు. దీంతో రైతులు పంట రుణాలకు నోచుకోవడం లేదు. పంట రుణాల కోసం బ్యాంకులకు రైతులు వస్తే రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు జిల్లా ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సూచిస్తున్నా బ్యాంకర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. వానాకాలం పంటల సాగు మొదలై రెండు నెలలు కావస్తున్నా లక్ష్యానికి తగ్గట్టుగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
జబర్దస్త్గా వడ్డీ వసూళ్లు
జిల్లాలో 90 శాతం మంది రైతులు మూడేళ్ల నుంచి తీసుకుంటున్న పంట రుణాలకు ఆయా బ్యాంకులు జబర్దస్త్గా 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. గతంలో ఏడాది లోపు చెల్లించే పంట రుణాలకు 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 3 శాతం వడ్డీ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేవి. కానీ కొంత కాలం నుంచి ప్రభుత్వాలు వడ్డీ సరిగా చెల్లించడం లేదు. ఆయా ప్రభుత్వాలు వడ్డీ చెల్లించినప్పుడు తిరిగి ఖాతాలో జమచేస్తామని ప్రస్తుతం అయితే వడ్డీ కట్టాలంటూ రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కొంత ఆలస్యమైనా కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్నేళ్లుగా చెల్లించడం లేదు. దీంతో వడ్డీతో సహ చెల్లించిన రైతులకే తిరిగి రుణాలు ఇస్తున్నారు.
పాత రుణాల స్థానంలో కొత్తవి
చాలా మంది రైతులు భూమిని బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పంట రుణాలు తీసుకునేవారు. ప్రస్తుతం సాగు ఖర్చులు పెరిగాయి. పంట రుణం పెంచి ఇవ్వాలని రైతులు కోరినా బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఎక్కువ రుణాలు కావాలంటే భూమిని తనఖా పెట్టాలని బ్యాంకర్లు అంటుండడంతో చాలా మంది రైతులు ఇచ్చిన రుణాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉండి ఇప్పటివరకు పంట రుణాలు తీసుకొని రైతులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారు. ఇప్పటికీ కేవలం రుణం తీసుకున్న రైతుల నుంచి వడ్డీతో సహ మొత్తం తీసుకుని తిరిగి కొత్త పంట రుణాలు ఇస్తున్నారు. ఈ సందర్భంలోనూ వ్యవసాయ భూమికి సంబంధించి 1బీ రికార్డు జిరాక్స్ కాపీలను తీసుకుంటున్నారు.
కొత్త రుణాలకు కోర్రీలు
భూ రికార్డుల ప్రక్షాళనలో జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంగా సుమారు 46వేల మందికి డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. సంబంధిత రైతుల పంట రుణాలకు బ్యాంకులకు వెళితే కొర్రీలు పెడుతున్నారు. రేపు, మాపు అంటూ కొన్ని బ్యాంకులు తిప్పుతుండగా పాత రుణాలే రెన్యూవల్ చేస్తున్నా వచ్చే నెల చూస్తామంటూ బ్యాంకర్లు దాట వేస్తున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే ఈసీ కావాలి, మండల పరిధిలో బ్యాంకుల్లో ఇప్పటి వరకు రుణాలు తీసుకోలేదని నో అబ్జక్షన్ ధ్రువ పత్రాన్ని తీసుకురావాలని నిర్ధేశిస్తున్నారు. ఇలా నిబంధనల కొర్రీలతో రైతులకు బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టు రైతులు ప్రదక్షణలు చేస్తున్నా రుణాలు అందని పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులే కల్పించుకుని సకాలంలో రుణాలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు
ఈ వానాకాలం సీజన్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు సైతం పంటల సాగు ముమ్మరం చేశారు. విస్తారంగా పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు, సీఎం కిసాన్ పథకాల ద్వారా ఎంతో కొంత నగదు అందినప్పటికీ ప్రస్తుతం పంటల సాగు కోసం పెరిగిన ధరలతో ఆ నగదు సరిపోవడం లేదు. దీంతో పంట రుణాలపై బ్యాంకర్లను ఆశ్రయిస్తే వారి నుంచి స్పందన ఉండడం లేదు. చివరకు పంటల సాగు కోసం రైతులకు వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. పంట రుణాలకు బ్యాంకులు సవాలక్ష కొర్రీలు పెడుతుండడంతో రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు సైతం అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. దీంతో పంటల సాగులో రైతులకు అప్పులే మిగులుతున్నాయే తప్ప లాభాలు ఏమి ఉండడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.