దాడులు చేస్తున్నా.. ఆగని దందా!

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది. కొందరు వ్యాపారులు జిల్లా నుంచి పక్క రాష్ట్రాలకు చౌకధర బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారు. వ్యాపారులు లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు.

దాడులు చేస్తున్నా.. ఆగని దందా!
గాంధారిలో అధికారులు పట్టుకున్న రేషన్‌ బియ్యం

- నెల వ్యవధిలోనే 10కిపైగా కేసులు

- సుమారు 2వేల క్వింటాళ్లకు పైగా రేషన్‌ బియ్యం పట్టివేత

- జిల్లాలో పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం

- లబ్ధిదారుల నుంచి రేషన్‌ బియ్యం సేకరణ

- రీసైక్లింగ్‌ చేసి పక్క రాష్ర్టాలకు తరలింపు

- ఉచిత బియ్యం రూ.20 నుంచి 25 వరకు విక్రయింపు

- యథేచ్చగా సాగుతున్న అక్రమ వ్యాపారం

- ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేస్తున్నా ఆగని దందా


కామారెడ్డి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది. కొందరు వ్యాపారులు జిల్లా నుంచి పక్క రాష్ట్రాలకు చౌకధర బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారు. వ్యాపారులు లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఉచిత, రూపాయి కిలో బియ్యాన్ని ఇతర ప్రాంతాల్లో రూ. 20 నుంచి 25కి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నా అక్రమ రేషన్‌ బియ్యం దందా ఆగడం లేదు. మాచారెడ్డి మండలంలో రెండు రోజుల కిందట భవానీపేట తండా వద్ద ఓ డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డిలో ఓ గోదాంలో 140 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇలా నెలవ్యవధిలోనే సుమారు 10కిపైగా కేసులు నమోదు చేయడమే కాకుండా 2వేల క్వింటాళ్లలో రేషన్‌ బియ్యాన్ని సంబంధితశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇలా ఏదో ఒక చోట అధికారుల తనిఖీల్లో క్వింటాళ్ల కొద్ది పీడీఎస్‌ బియ్యం పట్టుబడుతున్నా కఠిన చర్యలు లేకపోవడంతో బియ్యం దందా చేస్తున్న వారు తేలికగా తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

40 శాతం రేషన్‌ బియ్యం పక్కదారి

జిల్లాలో రేషన్‌ దుకాణాల ద్వారా పౌర సరఫరాలశాఖ ప్రతీ నెల 5వేల మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. జిల్లాలో 557 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 2.46లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు గాను ప్రతినెల 5,450 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 30 నుంచి 40 శాతం రేషన్‌ బియ్యం దళారులు రీసైక్లింగ్‌ కోసం పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ర్టాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం పేదలకు రేషన్‌షాపుల ద్వారా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. గతంలో రూ.1 చొప్పున ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని ఇంట్లో ఎందరు ఉంటే అందరికి బియ్యం అందజేశారు. ప్రస్తుతం ఉచితంగా బియ్యం అందిస్తూ వస్తోంది. ఇలా జిల్లాలో ప్రతీ నెల 5వేల మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు సరఫరా చేస్తోంది. 

అమ్ముకుంటున్న లబ్ధిదారులు

జిల్లాలో చాలా మంది రేషన్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న దొడ్డు, సన్న బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపడం లేదు. పెద్దమొత్తంలో తెల్లటి రాళ్లు, ఎక్కువ శాతం నూకలు ఉండడంతో రేషన్‌ బియ్యాన్ని తినేందుకు ఇష్టపడని వారు తమ కోటా బియ్యాన్ని మార్కెట్‌లో ఎంతకో కొంతకు అమ్ముకుంటున్నారు. కొందరు చిన్నా చితక వ్యాపారులు పట్టణ, గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ దొడ్డు రకం బియ్యాన్ని కిలోకు రూ.15 నుంచి 20  వరకు కొనుగొలు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తమకు వచ్చిన బియ్యాన్ని వారికి విక్రయిస్తున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు సేకరించిన బియ్యాన్ని రూ.25 వరకు చెల్లించి మధ్య దళారులు కొంటున్నారు. వీరు సేకరించిన బియ్యాన్ని పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక వ్యాపారులకు అమ్మి లాభం పొందుతున్నారు. రేషన్‌ దుకాణాల్లో  ఉచితంగా లభించే బియ్యం దళారుల చేతులు మారేసరికి రూ.20 నుంచి 25కి చేరుతుంది. ఈ దందా బహిరంగంగా సాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. 

కేసులతోనే సరిపెడుతున్నారు

జిల్లాలో ఎన్‌పోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులు దాడులు చేస్తూ అక్రమ రేషన్‌ బియ్యాన్ని అడ్డుకొంటున్నప్పటికీ అక్రమదందా ఆగడం లేదు. పేదలు కడుపు నిండా తినడానికి ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఉచిత రేషన్‌ బియ్యం సరఫరా చేస్తుండగా ఇందులో 40 శాతం వరకు దళారుల మూలంగా రేషన్‌ బియ్యం జిల్లా సరిహద్దులు దాటి పక్క రాష్ర్టాలకు తరలివెళుతోంది. అధికారులు రేషన్‌ బియ్యం అక్రమ సరఫరాపై నిఘా పెడుతూ క్వింటాళ్ల కొద్ది స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన భిక్కనూర్‌, మద్నూర్‌, మాచారెడ్ది, వీర్కూర్‌, బాన్సువాడ, నాగిరెడ్డిపేట్‌, లింగంపేట్‌, బీబీపేట మండలాల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమ తరలిస్తుండగా అధికారులు పట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా దళారులను, వ్యాపారులను అదుపులోకి తీసుకుని  జరిమానాలతోనే సరిపెడుతున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చినా ఇట్టే బెయిల్‌పై వచ్చి తిరిగి అదే అక్రమ వ్యాపారాన్ని సాగించడంతో రేషన్‌ బియ్యం అక్రమ దందా ఆగడం లేదని సంబంధిత శాఖ అధికారులు వాపోతున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతాల్లో ఎక్కువగా నిల్వ చేయడంతో పాటు పెద్ద ఎత్తున కొందరు వ్యాపారులు పీడీఎస్‌ బియ్యాన్ని ఇంటింటికీ వెళ్లి కొనుగోలు చేస్తూ వారు అమ్మకాలు జరుపుతున్నా బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారని సమాచారం.


కఠిన చర్యలు తీసుకుంటాం

- రాజశేఖర్‌, డీఎస్‌వో, కామారెడ్డి జిల్లా

రేషన్‌ బియ్యాన్ని ఎవరైన అక్రమంగా తరిలిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా రేషన్‌ బియ్యం తరలకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారుల బృందం చేత నిఘా పెట్టిస్తున్నాం. లబ్ధిదారులు కూడా రేషన్‌ బియ్యాన్ని దళారులకు అమ్మవద్దు.

Read more