ధాన్యం సేకరణకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-09-22T07:45:02+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై యంత్రాంగం దృష్టిపెట్టింది. వచ్చే నెల నుంచి ధాన్యం రానుండడంతో అధికారులు ముందస్తుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని గ్రామాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కావాల్సిన గన్నీ బ్యాగులు, వాహనాలు, కూలీలను సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు.

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు

ఽధాన్యం కొనుగోళ్లపై అధికారుల దృష్టి 

వచ్చే నెల నుంచి  ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు 

12 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి రానుందని అధికారుల అంచనా

నిజామాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై యంత్రాంగం దృష్టిపెట్టింది. వచ్చే నెల నుంచి ధాన్యం రానుండడంతో అధికారులు ముందస్తుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని గ్రామాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కావాల్సిన గన్నీ బ్యాగులు, వాహనాలు, కూలీలను సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ లేనివిధంగా 12లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేయడంతోపాటు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికలు పంపింది. ఈ మేరకు ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది.

భారీగా సాగు

జిల్లాలో వానాకాలంలో భారీగా వరిసాగును చేశారు. జిల్లాలో మొత్తం 4లక్షల 16వేల 168 ఎకరాల్లో ఈ పంటను వేశారు. బోధన్‌ డివిజన్‌లో నెల ముందుగా వరినాట్లు వేయగా మిగతా మండలాల్లో ఆగస్టు వరకు వరిసాగును కొనసాగించారు. జిల్లాలో దొడ్డు రకాలను 2లక్షల 25వేల 964 ఎకరాల్లో సాగుచేశారు. ఈ సాగు విస్తీర్ణం వల్ల ఈ సీజన్‌లో సరాసరి 6లక్షల 46వేల 830.44 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో సన్న రకాలు లక్షా 90వేల 205 ఎకరాల్లో సాగుచేశారు. ఈ విస్తీర్ణం వల్ల 5లక్షల 43వేల 844.51 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సన్న, దొడ్డు రకాలను కలిపి 11లక్షల 90వేల 674 మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబ డి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేశారు. కలెక్టర్‌తో పాటు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

ముందస్తు ఏర్పాట్లు

జిల్లాలో గత సంవత్సరం కంటే ఎక్కువగా వరిసాగు కావడం దిగుబడి కూడా 12లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని గ్రామాల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత సీజన్‌లో ఏర్పాటు చేసిన విధంగానే 540 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే 2లక్షల మెట్రిక్‌ టన్నులు అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగానే గన్ని బ్యాగులు, వాహనాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సన్న రకాలను ఎక్కువగా రైస్‌ మిల్లర్స్‌ కొనుగోలు చేసిన ఎక్కువమంది రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తుండడంతో ఈ సీజన్‌లో సుమారు 8లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు, పౌరసరఫరాల అధికారులు అంచనా వేస్తున్నారు. ధాన్యం తరలించేందుకు వాహనాలు కూడా ఎక్కువ మొత్తంలో అవసరం కావడంతో ముందస్తుగానే ఏర్పాట్లు సిద్ధమవుతున్నారు.

 రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు 

జిల్లాలో యాసంగిలో ధాన్యం ఇప్పటికీ మిల్లింగ్‌ చేయకపోవడం వల్ల ఏ రైస్‌మిల్‌ ఖాళీగా లేదు. అన్ని రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. వానాకాలంలో వచ్చే మొత్తం దిగుబడి నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో మార్కెట్‌ గోదాంలు, యార్డులు, ఇతర ప్రాంతాల్లో ఽధాన్యం నిల్వచేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్‌లో సుమారు 12 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై దృష్టిసారించామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్‌ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో సమావేశం నిర్వహించి వివరాలను ప్రభుత్వానికి పం పిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణం గా అక్టోబరులో కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

Read more