యథేచ్ఛగా ఆపరేషన్లు
ABN , First Publish Date - 2022-08-04T06:12:29+05:30 IST
జిల్లాలో యథేచ్ఛగా సిజేరియన్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్‌లు చేస్తున్న వారిని గుర్తించారు. నోటీసులు సైతం అందజేశారు. అయితే ఇప్పటి వరకు సంబంధిత ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్‌లు
ఆసుపత్రులపై చర్యలు కరువు
నోటీసులతోనే సరిపుచ్చుతున్న అధికారులు
ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు
యథావిధిగా కొనసాగుతున్న సిజేరియన్‌లు
నిజామాబాద్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో యథేచ్ఛగా సిజేరియన్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్‌లు చేస్తున్న వారిని గుర్తించారు. నోటీసులు సైతం అందజేశారు. అయితే ఇప్పటి వరకు సంబంధిత ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆసుపత్రుల యజమానులు ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తేవడంతో అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్‌లు జరిగినట్లు నివేదికలు సమర్పించినా.. ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్డంలేదు. సిజేరియన్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేయడంలేదు. ఇప్పటికీ అనేక ఆసుపత్రుల్లో సిజేరియన్‌లు యథావిధిగానే కొనసాగుతున్నాయి. దీంతో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది.
ప్రైవేట్‌లో 90శాతం సిజేరియన్లే..
జిల్లాలో రాష్ట్ర సగటుకంటే ఎక్కువగా సిజేరియన్‌లు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. సిజేరియన్‌లను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా సిజేరియన్‌లు ఎక్కువగా చేస్తే మహిళలకు ప్రమాదాలు ఏర్పడుతాయని తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో రాష్ట్ర సగటుకంటే ఎక్కువగా ప్రైవేట్‌లో 90శాతం వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 75 శాతం వరకు సిజేరియన్‌లు జరుగుతుండడంతో తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పలు దఫాలు ఈ సిజేరియన్‌లపై సమీక్షించారు. అయినా ఫలితం రాకపోవడంతో 8 కమిటీలను వేసి జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు చేసిన అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న సిజేరియన్‌లు వాటికి సంబంధించిన కారణాలతో కలెక్టర్‌కు నివేదిక అందించారు. ఏయే ఆసుపత్రుల్లో ప్రసవానికి సంబంధించిన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఆపరేషన్‌లకు అనుగుణంగా సిబ్బంది ఉన్నారా, పరికరాలు, లేబర్ రూంలు అందుబాటులో ఉన్నాయా అన్ని అంశాలను ఆ నివేదికలో పొందుపర్చారు. ప్రసవాలు చేసేందుకు నర్సింగ్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు. వైద్యులు, మత్తుకు సంబంధించిన డాక్టర్‌లు ఉన్నారా అనే అంశాలను పరిశీలించారు. ఏయే ఆసుపత్రుల్లో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిలో ఎన్ని సిజేరియన్‌లు జరుగుతున్నాయో జాబితాను కలెక్టర్‌కు అందించారు. ఈ జాబితా ఆధారంగా జిల్లాలోని 84 ఆసుపత్రులకు నోటీసులను జారీచేశారు. ఆ నోటీసులకు అనుగుణంగా ఆయా ఆసుపత్రులు సమాధానం ఇవ్వాలని కోరారు. వారికి ఇచ్చిన గడువులోనే నోటీసులు ఇచ్చిన ఆసుపత్రుల యజమానులు వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఆధారంగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టలేదు.
ప్రతి నెలా ప్రసవాల వివరాలను అందించాలి
జిల్లాలోని గుర్తింపు పొందిన ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగినా వాటి వివరాలను ప్రతినెలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి పంపించాలి. వాటిలో సాధారణ ప్రసవాలెన్ని, సిజేరియన్‌లు ఎన్ని జరిగాయో పొందుపర్చాలి. సిజేరియన్‌లు ఎందుకు చేశారో వివరణ కూడా ఇవ్వాలి. ప్యాకేజీల పేరున గత కొన్నేళ్లుగా ప్రసవాలను చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు సాధారణ ప్రసవాల వల్ల డబ్బులు తక్కువ వస్తుండంతో అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువగా సిజేరియన్‌లు చేస్తున్నట్లు తనిఖీల సమయంలో అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా ప్రైవేట్ నర్సింగ్‌హోంల యజమానులతో చర్చలు జరిపారు. సిజేరియన్‌లు తగ్గించాలని కోరారు. నోటీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత సరైన వసతులు లేనివారిపై చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఏ ఒక్క ఆసుపత్రిపై చర్యలు తీసుకోలేదు.
అధికారులపై ఒత్తిడి
ఆసుపత్రుల యజమానులు ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పనిచేస్తున్నారు. వారికి ఉన్న ప్రజాప్రతినిధుల పరిచయాలను వినియోగిస్తూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. చర్యలను చేపట్టకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో సీజేరియన్‌లు తగ్గితే తమ ఆసుపత్రులకు నష్టం వస్తుందని భావిస్తున్న వారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టకుండానే చూస్తున్నారు. వారికి గత కొన్నేళ్లుగా నెలవారి లెక్కల ప్రకారం కావాల్సిన మామూళ్లను అందిస్తున్నారు. సిజేరియన్‌లు ప్యాకేజీ రూపంలో అందరికి తెలిసిన వ్యవహారంగా చెబుతూ ప్రైవేట్ ఆసుపత్రులు నోటీసులు, వివరణతోనే సరిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యులుగా గుర్తింపు పొంది కీలకస్థానాల్లో ఉన్న కొంతమంది వైద్యులు చర్యలు చేపట్టకుండా చక్రం తిప్పుతున్నారు. ఎలాంటి చర్యలు సిజేరియన్‌లపై చేపట్టకపోవడంతో ఇప్పటికీ ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో సిజేరియన్‌లు, ఇతర సమస్యలపై కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. నోటీసులకు అనుగుణంగా ఆయా ఆసుపత్రులు వివరణ పంపించారన్నారు. వాటిపై చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.