ఆక్రమదారులపై చర్యలేవీ?

ABN , First Publish Date - 2022-09-13T05:58:38+05:30 IST

నగర శివారులోని నాగారం, ఇతర ప్రాంతాల్లో పేదలకు కేటాయించిన ప్లాట్ల కేటాయింపు చిక్కుముడి వీడడంలేదు. పట్టాలు మంజూరు చేసినా.. పొజిషన్‌ తీసుకోకపోవడంతో కొంతమంది వాటిని ఆక్రమించారు. వేరేవారికి అమ్మకాలు చేయడంతో భవనాలు నిర్మించారు. మరికొన్ని ప్లాట్లను ఆక్రమించగా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో సర్వే నిర్వహించారు.

ఆక్రమదారులపై చర్యలేవీ?

నాగారం శివారులో పేదలకు కేటాయించిన ప్లాట్ల ఆక్రమణ

ఇప్పటికీ భూ ఆక్రమణదారులపై చర్యలు కరువు

ఉన్న భూములనే కేటాయించేందుకు సిద్ధమవుతున్న అధికారులు

ఏడాది క్రితం అధికారుల భూ సర్వే 

నిజామాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగర శివారులోని నాగారం, ఇతర ప్రాంతాల్లో పేదలకు కేటాయించిన ప్లాట్ల కేటాయింపు చిక్కుముడి వీడడంలేదు. పట్టాలు మంజూరు చేసినా.. పొజిషన్‌ తీసుకోకపోవడంతో కొంతమంది వాటిని ఆక్రమించారు. వేరేవారికి అమ్మకాలు చేయడంతో భవనాలు నిర్మించారు. మరికొన్ని ప్లాట్లను ఆక్రమించగా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో సర్వే నిర్వహించారు. పత్రాలు లేనివారిని వెళ్లగొట్టడంతో పాటు ఉన్న ప్లాట్లను మరికొంతమందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని సాగునీటి కాల్వలు, ఇతర ప్రాంతాల్లో ఆక్రమించుకుని ఉన్న వారిని అక్కడ నుంచి తరలించి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్లాట్లపై నజర్‌పెట్టిన కొంతమంది నేతలు మాత్రం ఇప్పటికీ పట్టువీడడంలేదు. స్వాధీనం చేసుకునేందుకు పాత రికార్డుల ఆధారంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధికారులపై ఒత్తిళ్లను పెంచుతూనే ఉన్నారు. 

నగర శివారులో ఇళ్ల స్థలాల కేటాయింపు

నగరంలోని నాగారం శివారుతో పాటు ఇతర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వాలు పేదల కోసం ప్లాట్లను కేటాయించారు. నగరంలో ఉన్న పేదలను గుర్తించడంతో పాటు వారికి 2000-2009 వరకు వీటిని కేటాయించారు. మరికొంతమందికి 2014 వరకు కూడా వీటిని ఇచ్చారు. భూములు పేదలకు కేటాయించడంతో పాటు వాటికి సంబంధించిన పత్రాలను అందించారు. కేటాయించిన సంవత్సరంలోపే ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని కోరారు. ఈ భూములను కేటాయించిన పత్రాలు పొందిన వారికి అసలైన ప్లాట్లను చూపించకపోవడం వారు పట్టించుకోకపోవడం వల్ల ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నాయి. నగరం పెరగడం, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారడంతో భూములకు డిమాండ్‌ పెరిగింది. ఈ భూములపై కన్నువేసిన కొంతమంది నేతలు తన అనుచరుల ద్వారా వీటిని ఆక్రమించారు. వెంటవెంటనే వీటిని ఇతరులకు అమ్మకాలు చేశారు. పాత డాక్యుమెంట్‌ల ఆధారంగా ప్రభుత్వం వీరికే పట్టాలు ఇచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్‌లను సృష్టించారు. తక్కువ రేటుకే వస్తుండడంతో కొంతమంది కొనుగోలు చేసి ఈ భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వాలు పేదల్లోని వివిధ వర్గాలకు ఈ భూములను కేటాయించారు. వీటితో పాటు ఆయా వృత్తుల్లో ఉన్నవారికి కూడా ప్లాట్లను ఇచ్చారు. అందరు పట్టించుకోకపోవడం, అసలు భూములను చూడకపోవడం వల్ల ఎక్కువ మొత్తం ప్లాట్లు అన్యాక్రాంతమయ్యాయి. కొంతమంది గ్రూపులుగా ఏర్పడి తమ అనుచరులతో వీటిని ఆక్రమించడంతో పాటు చిన్న చిన్న ఇళ్లను వేసి అమ్మకాలు చేశారు. భూముల రేట్లు పెరగడం ఎక్కువమంది తమకు కేటాయించిన భూముల్లో ఇళ్లు కట్టుకునేందుకు వచ్చి చూడగా ప్లాట్లు ఆక్రమనకు గురై చాలామంది అధికారులకు ఫిర్యాదులు చేశారు. తమకు భూములు కేటాయించాలని కోరారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు ఈ భూముల విషయంలో ధర్నాలు చేయడంతో రెవెన్యూ అధికారులు పట్టాల ఆధారంగా సర్వే చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలం పరిధిలో ఎన్ని పట్టాలు ఇచ్చారో వివరాలను పరిశీలించడంతో పాటు అసలు పట్టాలు పొందిన లబ్ధిదారులు ఎంతమంది ఇళ్లను నిర్మించుకున్నారో పరిశీలించారు. ఇతర భూములను సర్వే చేశారు. ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా ఏర్పాట్లు చేశారు. సర్వే రిపోర్టును కలెక్టర్‌కు అందించడంతో పాటు ఖాళీగా ఉన్న ప్లాట్లను ఇతరులకు కేటాయించాలని కోరారు. నిజాంసాగర్‌ కెనాల్‌పైన ఇళ్లు నిర్మించుకున్నవారితో పాటు ఇతర ప్రాంతాల్లో వేసుకున్న వారిని అక్కడి నుంచి తరలించి ప్లాట్లను కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ప్లాట్లు కేటాయించి ఆక్రమణకు గురైన వారికి కూడా కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏడాది క్రితం రెవెన్యూ అధికారుల సర్వే 

ఈ ప్లాట్లపై గత సంవత్సరం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి అన్ని వివరాలను తీసుకుని నివేదికల్లో పొందుపర్చారు. ఆక్రమణకు గురైన కొన్ని ప్లాట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్లాట్లపై దృష్టిపెట్టిన కొంతమంది అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటికీ వాటిని వదిలేందుకు సిద్ధపడడంలేదు. తమకున్న పరపతి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ భూములను తమ స్వాధీనంలో ఉంచుకుని అనుకూలంగా డాక్యుమెంట్‌లను మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపైన ఒత్తిళ్లను పెంచుతున్నారు. ఒకవేళ వీలుకాని పక్షంలో తమకు అనుకూలమైన వారికే ఈ ప్లాట్లను ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్లాట్ల ఆక్రమణల్లో భారీగా డబ్బులు కూడా వస్తుండడంతో వదలిపెట్టేందుకు ఆ నేతలు సిద్ధంగా లేరు. తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సర్వే పూర్తిచేసిన అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా కేటాయింపులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ భూములను ఆక్రమించినవారిపై చర్యలు చేపట్టలేదు. కొంతమంది నేతలు భూములను ఆక్రమించి వేరే వారికి అమ్మకాలు చేశారు. భారీగా లబ్ధిపొందారు. ఈ భూములని ఎవరు అమ్మారో అధికారులు నివేదికల్లో పొందుపర్చిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ వైపు దృష్టిపెట్టలేదు. భారీగా జిల్లా అంతా చర్చ జరిగినా ఇప్పటి వరకు చర్యలు లేకపోవడంతో యథేచ్ఛగా మళ్లీ కొన్ని ప్లాట్లను ఆక్రమించుకునేందుకు వారు సిద్ధమవుతున్నారు. నాగారం శివారులో చాలా పట్టాలు ఆక్రమణకు గురై ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంగీకరించారు. ఉన్న భూములను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ భూములపై ఉన్నతాధికారులు నజర్‌పెట్టి అర్హులైన పేదలకు కేటాయిస్తే ఉపయోగపడే అవకాశం ఉంది.

Read more