అరచేతిలో అంగన్‌వాడీ సేవలు
ABN , First Publish Date - 2022-11-20T00:39:59+05:30 IST
బక్క చిక్కుతున్న బాల్యం, కిశోర బాలికల్లో ఎదుగుదల లోపం, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి.
- పోషకాహారం పంపిణీలో పెరగనున్న పారదర్శకత
- సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, టీచర్లకు శిక్షణ పూర్తి
కామారెడ్డి టౌన్, నవంబరు 19: బక్క చిక్కుతున్న బాల్యం, కిశోర బాలికల్లో ఎదుగుదల లోపం, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పోషకలోపాలను అధిగమించేందుకు క్షేత్రస్థాయిలో విరివిగా చైతన్య కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో సిబ్బంది సకాలంలో సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం, పోష్టికాహార సరుకుల పంపిణీలో జాప్యం, సిబ్బంది విధుల నిర్వహణ అలసత్వంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొన్నిచోట్ల సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు సైతం లేకపోలేదు. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్‌హెచ్‌టీఎస్) అనే ప్రత్యేక యాప్ రూపొందించారు. ఇందులో పూర్తి వివరాలు నిక్షిప్తం కావడంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరగనుంది. ఫలితంగా సకాలంలో సేవలు అందనున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ యాప్‌పై జిల్లాలోని సీడీపీవోలు, సూపర్‌వైజర్‌లు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
జిల్లా పరిధిలో ఇలా..
జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,193 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 56,934 మంది చిన్నారులు ఉన్నారు. వీరితో పాటు 7,719 మంది గర్భిణులు, 6,574 మంది బాలింతలు ఉన్నారు. దేశంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు పోషణ స్థాయి పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2022 నాటికి పిల్లల్లో చురుకుదనం 28.1 శాతం నుంచి 16.1 శాతం, బరువు తక్కువ 28.5 శాతం నుంచి 16.5 శాతం, తక్కువ బరువుతో పుట్టె పిల్లలు 18.4 శాతం నుంచి 6.4 శాతంకు తగ్గించాలని నిర్ణయించారు. అలాగే రక్తహీనత గల పిల్లలు 60.7 శాతం నుంచి 42.7 శాతం, కౌమార దశ బాలికల్లో, మహిళల్లో 56.7 శాతం నుంచి 38.7 శాతంకు తగ్గించాలని నిర్ణయించి ప్రతీ అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
గర్భిణులు, బాలింతలు, తల్లులు, కౌమార దశలోని పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. కొన్నిచోట్ల పౌష్టికాహార సరుకులు దుర్వినియోగం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలో నిర్ధేశించిన ప్రకారం సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా మొక్కుబడిగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ, సిబ్బంది హాజరు, చిన్నారుల పెరుగుదల, ఆహార నిల్వలు, టీకాల పంపిణీ, పలు రకాల వివరాలు ఈ యాప్‌లో నమోదు కానున్నాయి. మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరగడంతో సేవల్లో పారదర్శకత పెరగనుంది.
పక్కాగా వివరాల నమోదు
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రతీ చిన్నారి ఎత్తు, బరువు, భుజం చుట్టు కొలతలను నమోదు చేస్తున్నారు. దీంతో వయసుకు తగిన బరువు, ఎత్తు ఉన్నారా లేదా అనే విషయం స్పష్టమవుతోంది. అలాగే పోషకాహార లోపం ఉన్న వారికి రెట్టింపు పోషక విలువలతో కూడిన సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆయా వివరాలన్నింటిని ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు.