కామారెడ్డిలో అధికార దుర్వినియోగం

ABN , First Publish Date - 2022-06-25T05:51:04+05:30 IST

కామారెడ్డి మున్సిపాలిటీలోని ప్రజలు నివాసం ఉండే కాలనీలకే రహదారులు, మురికికాలువలు, మంచి నీటి లాంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టని కాలనీలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి.

కామారెడ్డిలో అధికార దుర్వినియోగం
అబ్దుల్‌నగర్‌లోని ప్రైవేట్‌ వెంచర్‌ వరకు మున్సిపల్‌ నిధులతో బీటీరోడ్డు వేసిన దృశ్యాలు

- పలు శాఖల అధికారులు, నేతల కుమ్మక్కు

- ప్రైవేట్‌ వెంచర్లకు, బడాబాబుల భూములకు ప్రభుత్వ నిధులతో రోడ్లు

- రహదారుల పేరిట కోట్లు దుర్వినియోగానికి పాల్పడుతున్న కొందరు అధికార పార్టీ నేతలు

- అబ్దుల్‌నగర్‌ బీటీ రోడ్డుకు రూ.3కోట్ల మున్సిపల్‌ నిధుల కేటాయింపు

- రోడ్లు వేసిన తర్వాత టెండర్లకు పిలుపునిచ్చిన వైనం

- పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు నిర్వాకం

- జనాలు లేని ప్రాంతానికి రోడ్లు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు


కామారెడ్డి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి మున్సిపాలిటీలోని ప్రజలు నివాసం ఉండే కాలనీలకే రహదారులు, మురికికాలువలు, మంచి నీటి లాంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టని కాలనీలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోకి రావడం కాదు కదా ఆ ప్రాంతంలో కనీసం ఒక నివాస గుడిసె కూడా కనపడదు. ఎటు చూసిన గుట్టలు, చెట్లు, పుట్టలు, పంట చేనులే కనిపిస్తాయి. అలాంటి ఏ ఒక్క నివాసపు ఇల్లు లేని తాడ్వాయి మండలం అబ్దుల్‌నగర్‌ ప్రాంతానికి కామారెడ్డి మున్సిపల్‌ నిధుల నుంచి రూ.3 కోట్ల నిధులతో బీటీ రోడ్డు వేశారంటే పాలకవర్గంలోని కొందరు నేతలు బడాబాబులకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఎలాంటి కొమ్ముకాస్తున్నారో తెలుస్తోంది. కామారెడ్డిలోని కొందరు నేతలు అధికారులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్‌ వెంచర్‌కు రోడ్డు వేయాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్‌కు చెందిన నిధులను సిబ్బంది లేరనే సాకు చూపి మున్సిపల్‌ అధికారులు పంచాయతీరాజ్‌ విభాగానికి నిధులు మళ్లించేలా చూశారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

మున్సిపల్‌ పరిధి కాని ప్రాంతానికి నిధుల కేటాయింపు

కామారెడ్డి పట్టణ శివారుల్లో ఉన్న లింగాపూర్‌ గ్రామం మున్సిపాలిటీలో విలీనమైన విషయం తెలిసిందే. ఈ లింగాపూర్‌కు ఆనుకొని శివారు హద్దుగా తాడ్వాయి మండలం అబ్దుల్‌నగర్‌ ప్రాంతం ఉంది. ఈ అబ్దుల్‌నగర్‌లో ఏ ఒక్క నివాస గుడిసె కూడా లేదు. అయితే మున్సిపల్‌ పరిధిలోకి రానటువంటి అబ్దుల్‌నగర్‌ వరకు మున్సిపల్‌ నిధులతో రోడ్డువేయడం వివాదంగా మారింది. ఈ ప్రాంతానికి మున్సిపల్‌ నిధులను కేటాయించి రోడ్లు ఎలా వేస్తారంటూ ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే ప్రశ్నిస్తోంది. దేవునిపల్లి నుంచి లింగాపూర్‌ ఎస్‌సీ కాలనీ వరకు బీటీ డబుల్‌రోడ్డు నిర్మించారు. అక్కడి నుంచి అబ్దుల్‌నగర్‌ వరకు బీటీ రోడ్డు వేశారు. మార్గమధ్యలో కల్వర్టులు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపడుతున్నారు. మున్సిపల్‌ పరిధి కాకున్నప్పటికీ ఎస్‌సీ కాలనీ నుంచి అబ్దుల్‌నగర్‌ వరకు దాదాపు 5 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. కామారెడ్డి-ఎల్లారెడ్డి రోడ్డు నుంచి లింగాపూర్‌ ఎస్‌సీ కాలనీ వరకు మున్సిపల్‌ పరిధిలోని 11వ వార్డుకు వస్తోంది. ఇక్కడి వరకు మున్సిపల్‌ నిధుల నుంచి ప్రజా అవసరాల కోసం రోడ్డు వేయడంలో అర్థం ఉంది. కానీ ఎస్‌సీ కాలనీ నుంచి అబ్దుల్‌నగర్‌ వరకు మున్సిపల్‌ పరిధి కానప్పటికీ బీటీ రోడ్డు ఎలా వేస్తారని అది కాకుండా కనీసం ఏ ఒక్క నివాస గుడిసె లేనప్పటికీ నిర్మాణ పనులు చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

ఆ ప్రైవేట్‌ వెంచర్‌కే ప్రభుత్వ నిధులతో రోడ్లు వేశారా?

కామారెడ్డి, తాడ్వాయి మండలాల శివారు ప్రాంతాల్లో ఉండే లింగాపూర్‌, అబ్దుల్‌నగర్‌లలో చాలా మంది బడా వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌లు, పారిశ్రామిక వేత్తలు వందల ఎకరాలలో భూములను కొనుగోలు చేశారు. ఇటీవల లింగాపూర్‌ నుంచి అబ్దుల్‌నగర్‌ వరకు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ నేత సుమారు 150 ఎకరాలలో వెంచర్‌ను చేపట్టారు. ఈ ప్రాంతంలోని అసైన్‌మెంట్‌ భూములను సదరు నేత ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌ చేపడుతున్నారని బీజేపీ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ వెంచర్‌ కోసమే మున్సిపల్‌ నిధులు వెచ్చించి దేవునిపల్లి నుంచి అబ్దుల్‌నగర్‌ వరకు రూ.3 కోట్లతో బీటీ రోడ్డుతో పాటు కల్వర్టుల నిర్మాణం చేపట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. వెంచర్‌ కోసమే కాకుండా సమీపంలో కొంతమంది బడా వ్యాపారులు భూములను కొనుగోలు చేశారని ఆ భూములకు డిమాండ్‌ వచ్చేందుకే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మున్సిపల్‌ నిధులు దుర్వినియోగం చేసి పరిధిలోకి రాని, ఎలాంటి నివాస గృహాలు లేని అబ్దుల్‌నగర్‌కు రోడ్డు వేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

మున్సిపల్‌ నిధులు దుర్వినియోగం

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్‌ పాలకవర్గంలోని కొందరు అధికారపార్టీకి చెందిన నేతలు వారివారి వార్డుల్లోనే కాకుండా వేరే ప్రాంతాల్లో మున్సిపల్‌ నిధులతో పనులు చేపడుతూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండడం శివారు కాలనీల్లో కొత్త కాలనీలు వెలుస్తుండడం సమీప వార్డుల్లోకి వస్తుండడంతో ఆ కొత్త కాలనీలో జనావాసాలు కాదు కదా నివాసపు ఇల్లు లేనప్పటికీ రహదారుల నిర్మాణ పనులు చేపడుతూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల 11వ వార్డు లింగాపూర్‌ శివారు సరిహద్దుగా ఉన్న తాడ్వాయి మండలం అబ్దుల్‌నగర్‌ మున్సిపల్‌ పరిధికి రానప్పటికీ 5 కిలో మీటర్ల మేర రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు వేయడమే ఇందుకు నిదర్శనం. ఈ నిధులను నేరుగా మున్సిపాలిటీ శాఖ నుంచి కాకుండా పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉందనే సాకుతో, అబ్దుల్‌నగర్‌ తాడ్వాయి గ్రామ పంచాయతీలోకి వస్తుందనే కారణంగా మున్సిపల్‌శాఖ ఆ నిధులను పంచాయతీశాఖకు బదిలీ చేసి పనులు చేపడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏదైన రహదారుల నిర్మాణం చేపట్టాలంటే మొదట ప్రణాళిక వేయాలి, నిధులు కేటాయించాలి, టెండర్లను పిలిచి పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ దేవునిపల్లి ప్రధాన రహదారి నుంచి అబ్దుల్‌నగర్‌ వరకు రూ.3 కోట్లతో చేపట్టిన రహదారి నిర్మాణానికి ఎలాంటి టెండర్లు పిలవకుండానే పనులు పూర్తి చేశారంటే మున్సిపల్‌, అధికార పార్టీ నేతల ప్రమోయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా అబ్దుల్‌నగర్‌కే కాకుండా మున్సిపల్‌ పరిధిలోని నివాసపు ఇల్లు లేని కొత్తగా వెలిసిన వెంచర్‌లోని మున్సిపల్‌ నిధులతో రోడ్లు వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన  కొందరు నేతలు మున్సిపల్‌ నిఽధులను అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

నిఽఘా వర్గాల ఆరా

కామారెడ్డి మున్సిపాలిటీలోని నిధులను ఆ శాఖకు చెందిన అధికారులు, కొందరు అధికార పార్టీ నేతలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఎలాంటి టెండర్లు పిలవకుండా మున్సిపల్‌ పరిధికి రాని ప్రాంతానికి మున్సిపల్‌ నిధుల నుంచి ఫండ్‌ను కేటాయించి రోడ్డును వేయడంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు బీజేపీ నాయకులు మున్సిపల్‌ నిధుల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడడంపై జిల్లా ఉన్నతాధికారులతో పాటు మున్సిపల్‌శాఖ రాష్ట్రస్థాయి అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కామారెడ్డిలో అధికార పార్టీ నేతల అధికార దుర్వినియోగం, భూ కుంభకోణాలపై ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు అధిష్ఠానం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసికెళ్లినట్లు సమాచారం.

Updated Date - 2022-06-25T05:51:04+05:30 IST