ఏ ప్రాతిపాదికన మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు

ABN , First Publish Date - 2022-12-04T23:25:18+05:30 IST

ప్రజల కోసం కాకుండా వ్యక్తుల స్వలాభం కోసం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

ఏ ప్రాతిపాదికన మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు

- ప్రజల సౌకర్యాలను పక్కన పెట్టి, వ్యక్తుల స్వలాభం కోసం మాస్టర్‌ ప్లాన్‌ చేశారు

- మాస్టర్‌ ప్లాన్‌ను ఏ ప్రతిపాదికన తయారు చేశారో ప్రజలకు మున్సిపల్‌ అధికారులు వివరించాలి

- బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వెంకటరమణా రెడ్డి

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 4: ప్రజల కోసం కాకుండా వ్యక్తుల స్వలాభం కోసం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌ అంటే 20ఏళ్ల భవిష్యత్‌ను ఆలోచన చేసి ప్రజల సౌకర్యార్థం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాల్సింది పోయి కొందరు వ్యక్తుల స్వలాభం కోసం మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేశారని అన్నారు. 20ఏళ్ల కిందట ఉన్న మాస్టర్‌ ప్లాన్‌లో రోడ్డు విస్తీర్ణం 200 ఫీట్లు ఉంటే ప్రస్తుతం ఈ రోడ్డును ట్రాఫిక్‌ అవసరాల దృష్ట్యా అవసరమైతే పెంచాల్సింది పోయి 150 ఫీట్లకు మార్చడం, 80 ఫీట్ల రోడ్లను 60 ఫీట్లు చేయడం, గతంలో ఉన్న రోడ్డును అసలు ఈ ప్లాన్‌లోనే లేకుండా చేయడం చేస్తు, కొందరు వెంచర్‌ నిర్వాహకులకు, ఆయా ప్రాంతాల్లో భూములు విలువను పెంచేందుకు మాస్టర్‌ ప్లాన్‌ మాస్టర్‌ మైండ్‌తో చేశారని అన్నారు. అసైన్డ్‌ ల్యాండ్‌లు ఉండగా పట్టా భూముల్లో ఇండస్ట్రియల్‌ జోన్‌ చేయడం, వేల కోట్ల విలువ చేసే రైతుల భూముల్లోంచి వెంచర్‌ల చుట్టు రోడ్డును వేసేలా ప్లాన్‌ చేయడం, చెరువుపై జంక్షన్‌ రోడ్డు వేయడం లాంటి ప్లాన్‌ కేవలం కామారెడ్డి మున్సిపల్‌ అధికారులకే చెల్లిందని అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ సైతం స్పందించాలని ఎవరో స్వలాభం కోసం చేసిన ప్లాన్‌పై చర్చించి ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ను ఏ ప్రాతిపాదికన తయారు చేశారో ఏ నిబంధనలు పాటించారో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌, కమిషనర్‌, కలెక్టర్‌ రైతులు, ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈనెల 6న మాస్టర్‌ ప్లాన్‌పై చర్చించేందుకు తాను సిద్ధమని మున్సిపల్‌ కార్యాలయానికి వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విపుల్‌జైన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:25:20+05:30 IST