పేదలకు వరం.. ఆసరా పింఛన్‌

ABN , First Publish Date - 2022-08-31T06:16:59+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్‌ పేదలకు వరంగా మారిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పేదలకు వరం.. ఆసరా పింఛన్‌


బాన్సువాడ మున్సిపాలిటీలో  5294 మందికి లబ్ధి

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి


బాన్సువాడటౌన్‌, ఆగస్టు 30 : తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్‌ పేదలకు వరంగా మారిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల పెన్షన్‌ లబ్దిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్‌ను అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. గతంలో  పాతవి 38 లక్షల పెన్షన్లు ఉండగా, కొత్తగా మరో 10 లక్షలు కలుపుకుని మొత్తం 48 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం 15వేల కోట్లు వెచ్చిస్తుందన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో పాతవి 4628 ఉండగా కొత్తగా మరో 666 మందికి పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారిలో  57 ఏళ్ల వారు 308 మంది, 65 ఏళ్లపై బడిన వారు 60 మంది, వితంతు199, వికలాంగులు 67, బీడీ కార్మికులు13, 19 మంది ఒంటరి మహిళలకు పెన్షన్‌ మంజూరైందని తెలిపారు. మొత్తం బాన్సువాడ మున్సిపాలిటీలోని అన్ని వార్డులు కలిపి 5294 మందికి ఆసరా పెన్షన్‌ అందుతుందన్నారు. 

చదువుతోనే భవిష్యత్తు

చదువుతోనే విద్యార్థులకు మం చి భవిష్యత్తు ఉంటుందని  స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఉర్దూ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. కళాశాల భవన నిర్మాణం కోసం రూ.80 లక్షలు మం జూరైనట్లు తెలిపారు. కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి , మున్సిపల్‌ చైర్మెన్‌ జంగం గంగాధర్‌, ఆర్డీవో రాజాగౌడ్‌, సొసైటీ చైర్మన్లు, నాయకులు తదితరులున్నారు. 

వైద్యులు భగవంతుడితో సమానం

 వైద్యుల సేవలు వెలకట్టలేనివని, వైద్యులు భగవంతుడితో సమానమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో యశోద హాస్పిటల్‌ సికింద్రాబాద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒకరోజు క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధిని తొలిదశలోనే గుర్తించినట్లయితే నివారణ సాధ్యమవుతుందన్నారు. రసాయన ఎరువులతో పండించిన ఆహారంతోనే క్యాన్సర్‌ వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ప్రసాద్‌, వైద్యులు, సిబ్బంది, ఆశావర్కర్లు తదితరులున్నారు.

Read more