అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , First Publish Date - 2022-12-02T00:31:18+05:30 IST

ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్‌ పనుల్లో భాగంగా పీఎంజీఎస్‌ఐ కింద సీసీరోడ్ల పనులకు రూ.209కోట్లు మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు

పంచాయతీశాఖ మంత్రి దయాకర్‌రావు

నల్లగొండ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్‌ పనుల్లో భాగంగా పీఎంజీఎస్‌ఐ కింద సీసీరోడ్ల పనులకు రూ.209కోట్లు మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. సీఆర్‌ఆర్‌ కింద రూ.19కోట్లు మంజూరు చేశామని, రోడ్ల పను లు, మరమ్మతులు పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. రోడ్లను నష్టపరిచే కేజీవీల్స్‌పై కట్టడి చేస్తూ గ్రామ పంచాయతీ సెక్రటరీలు చర్యలు తీసుకునేలా జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తండాల నుంచి గ్రామ పంచాయతీలకు వెళ్లే లింకు రోడ్లను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఉపాఽధి హామీ పనుల ద్వారా గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా పనులు చేపట్టి గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగేలా, ట్రాక్టర్‌ బకాయిలు తీర్చుకునేలా పనులు చేపట్టాలని తడి, పొడి చెత్త సేకరణ ద్వారా డంపింగ్‌ యార్డుల్లో ఎరువులు తయారీతో గ్రామ పంచా యతీల ఆదాయం పెంకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులను నాణ్యతతో చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దీనిలో మనం అవార్డులు కూడా సాధించామని, అయినా నిధులను కేంద్రం సకాలంలో విడుదల చేయడం లేదన్నారు. ఎనిమిది సంవత్సరాల్లో ఉమ్మడి జిల్లాలో పంచా యతీరాజ్‌ కింద రూ.1200కోట్లు ఖర్చు చేశామని, వీటిని ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సమీక్షిస్తూ ఉండాలని, పెండింగ్‌ పనులను గుర్తించి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 1740 గ్రామ పంచాయతీలకు రోడ్డు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, అలాగే 731 కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలను సీఎం తోడ్పాటుతో పూర్తి చేస్తామని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని అభివృద్థి, సంక్షేమ రంగాల్లో ముందుండాలనేది సీఎం లక్ష్యమన్నారు.

మైదాన ప్రాంతంలోనే గిరిజనులు ఎక్కువ : మంత్రి సత్యవతి రాథోడ్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మైదాన ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు నివసిస్తున్నారని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలు, తండాలు జీపీలుగా ఏర్పాటైన చోట రోడ్లు వేయుటకు ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఐటీడీఏ పరిధిలో రూ.476 కోట్లతో అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇస్తేమంజూరు చేస్తామని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మూడు గిరిజన భవనాలకు రూ.1కోటి20లక్షలతో మంజూరు చేసి నట్లు తెలిపారు. 86ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, మినీ గురుకులాలు, పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లలో 25వేల మంది విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 3,146 కొత్త జీపీలు గిరిజనులకు రిజర్వ్‌ చేసినట్లు 207 తండాలు జీపీలుగామార్చినట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా జీపీ భవనాలు నిర్మాణాలు మంజూరు చేస్తామన్నారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర సబ్‌ కమిటీ నియమించినట్లు తెలిపారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం వచ్చిన తర్వాత 8వేలపై చిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ భూములకు రైతుబంధు ఆర్థిక సహాయం అం దిస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా పోడు భూముల పరిశీలన మొదలు పెట్టినట్టు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభు త్వం గిరిజనలకు విద్య, ఉద్యోగాలల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ చేస్తున్న 91వేల ఉద్యోగాలకు రిజర్వేషన్‌ వర్తిస్తుందన్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించినప్పుడు రోస్టర్‌ పాటించాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్‌ నారాయణపురంలో గురుకులం మంజూరు అడిగారని తప్పకుండా మంజూరు చేస్తామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నల్లగొండ, దేవరకొండలో రూ.7కోట్ల15లక్షలతో శిక్షణ కేంద్రాల జరుగుతోందన్నారు. రూ.4కోట్ల75 లక్షలతో నల్లగొండలో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ పూర్తి చేశామని, నల్లగొండ జిల్లా కేంద్రంలో గిరిజన భవన్‌ రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కొన్నిచోట్ల రైతువేదికల నిర్మాణానికి సంబంధించి కొంత మొత్తం నిధులు పెండింగ్‌లో ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో రైతు సమన్వయ సమితి నేతలు ఈ బకాయిలు క్లియర్‌ చేసుకోవాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా మార్చాం : మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఉమ్మడి జిల్లాలో 907 కిలోమీటర్ల వెడల్పు గల సింగిల్‌ రోడ్డు పనులను డబుల్‌ రోడ్డుగా మా ర్చామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రూ.69.9కోట్ల విలువగల 70రోడ్డు పనులు టెండర్‌ స్టేజిలో ఉన్నాయని, మునుగోడు నియోజకవర్గంలో 136కిలోమీటర్ల సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 40బ్రిడ్జి పనులు పూర్తి అయ్యాయని, ఎనిమిది సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం మీద రోడ్డ మీద రూ.20వేలకోట్లు, భవనాలకు రూ.5వేలకోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చిట్యాల నుంచి రామన్నపేట రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరు అయ్యాయని, పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీరోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి స్టేట్‌ లెవెల్‌ నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం తప్పనిసరిగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని అందుకు అనుగుణంగా రోడ్ల అభివృద్థి కోసం ఇతర పనులకు ఎనిమిది సంవత్సరాల్లో రూ.20వేలకోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రోడ్ల పనుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 6,391 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఇళ్లు పూర్తయ్యాయని, వీటిలో 880 లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. అర్హులైన లబ్దిదారులను గుర్తించి పూర్తిఅయిన ఇళ్లను పంపిణీ చేయాలని, అంతర్గత పనులకు కూడా నిధు లు మంజూరు చేశామని, పనులు చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే భూపాల్‌ టీంకు అభినందనలు : మంత్రి కేటీఆర్‌

‘నేను ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొనగా చండూరుకు చెందిన ఒక యువకుడు ఫోన్‌ చేసి చండూరును నల్లగొండలాగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశాడు. నల్లగొండలో పనులు నాణ్యతతో, బాగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి, చైర్మన్‌ సైదిరెడ్డితో పాటు భూపాల్‌ టీంకు అభినందనలు’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశంసల వర్షం కురిపించారు.

బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి

నల్లగొండ, డిసెంబరు 1: బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించి మిగితా మేనేజ్‌మెంట్ల సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు కోరారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మునుగోడులో మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. బాష పండితులు, పీఈటీల సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 2018కి సంబంధించి పాఠశాల విద్యలో పర్యవేక్షణ పోస్టులు, మండల విద్యాధికారులు, ఉపవిద్యార్థికారులు, బీఈడీ కాలేజీ లెక్చరర్ల పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. గతంలో మాదిరిగా పాఠశాలలో సర్వీస్‌ పర్సన్‌ను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, శేఖర్‌రెడ్డి, సీహెచ్‌. లింగయ్య, నర్సింహ ఉన్నారు.

పోలీసుల అదుపులో బీజేపీ నాయకులు

మునుగోడు, డిసెంబరు 1: మునుగోడులో మంత్రి కేటీఆర్‌ కాన్వయ్‌ను అడ్డుకొని, సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. తమపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో మౌనదీక్షకు దిగారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ప్రమేయమున్న ఎమ్మెల్సీ కవితను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాధ్‌, పులకరం సైదులు, పోలె రాజు, సందీప్‌, జిట్టగోని కిష్ణకుమార్‌, ఏర్పుల క్రాంతి కుమార్‌ ఉన్నారు. కాగా మంత్రుల బృందం రాక నేపథ్యంలో మండల పరిధిలోని బీజేపీ, బీఎస్పీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం విడుదల చేశారు.

Updated Date - 2022-12-02T00:31:22+05:30 IST