ప్రయాణం ప్రాణసంకటం

ABN , First Publish Date - 2022-07-05T05:54:56+05:30 IST

జిల్లాలోని పలు రహదారులు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వెరసి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురదమయంగా మారుతున్న రహదా రుల్లో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది.

ప్రయాణం ప్రాణసంకటం
మాధవరాయనిగూడెం గ్రామంలో రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు

చినుకుపడితే చిత్తడిగా మారుతున్న రహదారులు 

ఇబ్బందులు పడుతున్న ప్రజలు  

జిల్లాలోని పలు రహదారులు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి.  అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వెరసి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురదమయంగా మారుతున్న రహదా రుల్లో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. 

సీసీ రోడ్డును తవ్వేసి

మేళ్లచెర్వు, జూలై 4 : మండల కేంద్రంలోని ప్రధాని రహదారుల్లో ఒకటైన దొడ్లదారి చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది. ఈ దారి నుంచే గ్రామస్థులు ప్రధాన రహదారిపై వెళ్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ సీసీ రోడ్డును నాలుగు నెలల కిందట మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ఏర్పాటు కోసం మధ్యలో తవ్వారు. పనులు పూర్తయ్యాక మట్టిని బలంగా నింపకపోవడంతో గుంతలమయంగా మారింది. దీంతో ఈ రోడ్డు ప్రయాణం ఇబ్బందిగా మారడంతో ఇటీవలే గ్రామపంచాయతీ సిబ్బంది గుంతల్లో మట్టిని పోసి చదునుచేశారు. చిన్న వర్షం కురిసినా గుంతల్లోని మట్టి చిత్తడిగా మారుతోంది.బురదలో ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ దారిపై సీసీ వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.ఇదిలా ఉండగా రెండు రోజుల్లో కంకర నింపి తాత్కాలిక మరమ్మతులు చేపడతామని గ్రామకార్యదర్శి నారాయణరెడ్డి తెలిపారు. 

 మురుగునీరంతా రోడ్లపైనే

హుజూర్‌నగర్‌  : హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీ పరిధిలోని మాధవరాయనిగూడెం గ్రామంలో రహదారులు అస్తవ్యస్థంగా మారాయి. చిన్నచినుకు పడినా వీధులన్నీ చిత్తడిగా మారుతున్నాయి. మురుగుకాల్వలు లేక రోడ్లపైనే నీరు నిల్వ ఉంటుంది. 2,500 జనాభా, 1650 మంది ఓటర్లున్న గ్రామాన్ని మునిసిపాలిటీలో విలీనం చేశాక 1వ వార్డు, 28వ వార్డులుగా విభజించారు. కాగా గ్రామంలోని ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పాటు ఎస్సీ, బీసీ కాలనీలోని అనేక ప్రాంతాల్లో సీసీ రోడు,్ల మురుగుకాల్వలు లేక నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈ గ్రామంలో రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామని ప్రజా ప్రతినిధులు చెబుతున్నా; పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి డ్రైనేజీ నిర్మించి రోడ్లపై మురుగు నీరు లేకుండా చూడాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మాధవరాయనిగూడెంలో త్వరలోనే మురుగుకాల్వలు నిర్మిస్తామని వార్డు కౌన్సిలర్‌ గంగరాజు తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. 

అడ్డుకట్టతో గ్రామంలోకి వరద

అర్వపల్లి:  వరద ప్రవాహానికి రైతు అడ్డుకట్ట వేయడంతో మండలంలోని జాజిరెడ్డిగూడెం ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో వర్షపు నీరు కొత్తగూడెం గ్రామం వైపు వెళ్తుంటుంది. ఆ మార్గంలో ఓ రైతు నీరు వెళ్లకుండా అడ్డకట్ట వేశాడు. దీంతో నీరంతా వెనక్కి మళ్లీ గ్రామానికి ఆనుకున్న ఉన్న 20 ఎకరాల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చెరువును తలపిస్తోంది. నిల్వ నీరంతా దోమలకు ఆవాసంగా మారడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఏ చిన్నపాటి వర్షమొచ్చినా తమ ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉందని, దోమలతో అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఈ దారిమీదుగా కొత్తగూడెం వెళ్లే ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఈ నెల 2వ తేదీన రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీడీవో విజయ మాట్లాడుతూ జాజిరెడ్డిగూడెం పరిధిలో ముంపునకు గురవుతున్న భూముల పరిశీలనకు రెవెన్యూ,పంచాయతీ కార్యదర్శిని ఆ ప్రాంతానికి పంపిస్తామన్నారు. ఆ భూములు ఏ పరిధిలోకి వస్తాయో తెలుసుకున్నాక, సమస్య పరిష్కరిస్తామన్నారు.

హైవే కోసం తీసిన గుంతలు

జాజిరెడ్డిగూడెం సమీపంలో సిరోంచ-రేణిగుంట జాతీయ రహదారి(365) వెళ్తుంది. ఈ రోడ్డు నిర్మాణం సమయంలో వరద నీరు వెళ్లేందుకు గ్రామానికి సమీపంలో కల్వర్టులను నిర్మించారు. ఆ సమయంలో తీసిన గుంతలనుపూడ్చకపోవడంతో వర్షపు నీరంతా అక్కడే నిల్వ ఉంటోంది. ఆ గుంతలన్నీ దోమలకు ఆవాసాలుగా మారాయి. 




Updated Date - 2022-07-05T05:54:56+05:30 IST