జోరు పెరిగింది

ABN , First Publish Date - 2022-10-09T05:23:27+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 26 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కార్యాచరణలో వేగాన్ని పెంచాయి. 12మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు అధికార టీఆర్‌ఎస్‌ బాధ్యతలు అప్పగించగా శనివారం ఒక్కరోజే ఐదుగురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

జోరు పెరిగింది

 మునుగోడులో ఐదుగురు మంత్రుల మకాం

 నేడు రేవంత్‌, ఉత్తమ్‌ రోడ్‌షో

 యాదవుల ఓట్లే టార్గెట్‌గా కేంద్ర మంత్రి భూపేంద్ర సభ

 10 రోజుల వరకు బండి సంజయ్‌ ప్రచారం 

 ఖరారైన ప్రధాన పార్టీల అభ్యర్థులు

నల్లగొండ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 26 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కార్యాచరణలో వేగాన్ని పెంచాయి. 12మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు అధికార టీఆర్‌ఎస్‌ బాధ్యతలు అప్పగించగా శనివారం ఒక్కరోజే ఐదుగురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారంలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్‌ మండలంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. చౌటుప్పల్‌ కేంద్రంగా యాదవుల ఓట్లే లక్ష్యంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ సభ నిర్వహించనున్నారు. మున్నూరుకాపు ఓటర్లను ఆకర్షించేందుకు చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు సమావేశం నిర్వహించారు. కార్మికులు, ప్రైవేటు ఉద్యోగుల ఓట్లే లక్ష్యంగా మంత్రి మల్లారెడ్డితో ఆదివారం చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించనున్నారు.


మంత్రుల విస్తృత ప్రచారం

అధికార పార్టీ ప్రతీ ఎంపీటీసీ పరిధిలో ఒక మంత్రి లేదా ఎమ్మెల్యేకు ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు అప్పగించింది. బాధ్యత తీసుకున్న పోలింగ్‌ బూత్‌ల పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 50శాతానికి తగ్గకుండా ఓట్లు సాధించాలని సీఎం కేసీఆర్‌ టార్గెట్‌ ఖరారు చేశారు. ఓట్లు తగ్గితే వారి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తప్పవని అధిష్ఠానం సూచించింది. దీంతో అధికార పార్టీ నేతలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో మకాం వేసి పార్టీ పెద్దలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వారి జేబు నుంచి స్థానికుల అవసరాలు తీరుస్తున్నారు. సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్‌ సమీపిస్తుండడంతో శనివారం ఒక్కరోజే అధికార పార్టీకి చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, జగదీ్‌షరెడ్డి ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు మంత్రి జగదీ్‌షరెడ్డి చేరికల అంశాన్ని సీరియ్‌సగా తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా ఇతర పార్టీలకు చెందిన నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ అభ్యర్థి నామినేషన్‌, నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న నేతలతో సమన్వయం, సామాజికవర్గాల వారీగా ఓటర్లతో సమావేశాలను సమన్వయం చేస్తున్నారు. కార్మికులు, ప్రైవేటు ఉద్యోగుల ఓట్లే లక్ష్యంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి జగదీ్‌షరెడ్డి చౌటుప్పల్‌లో ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లందరినీ శనివారం చౌటుప్పల్‌కు తరలించి సమావేశం నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


చౌటుప్పల్‌కు నేడు రేవంత్‌, ఉత్తమ్‌

ఏఐసీసీ అధ్యక్షుడి రేసులో మల్లికార్జునఖర్గె ఉండడం, ప్రచారంలో భాగంగా ఆయన శనివారం హైదరాబాద్‌కు రావడంతో కాంగ్రెస్‌ నేతలంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఖర్గె పర్యటన పూర్తికావడంతో ఆదివారం నుంచి ప్రచారంలో కాంగ్రెస్‌ జోరు పెంచనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్‌ పట్టణంతో పాటు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థి స్రవంతి ఇంటింటికీ తిరిగి మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి ఓటు అడిగే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. 


ప్రచారానికి రానున్న బండి సంజయ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు. శనివారం హైదరాబాద్‌లో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు వివేక్‌, గంగిడి మనోహర్‌తో పాటు ఇతర నేతలతో బండి సంజయ్‌ భేటీ అయ్యారు. 10 నుంచి 12 రోజుల పాటు తాను మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని, భారీ జనసమీకరణతో నామినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని, దీనికి తాను హాజరవుతానని సంజయ్‌ వివరించారు. నాయకులు, అభ్యర్థి ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి మునుగోడుకు వచ్చిన నేతలకు వసతి, భోజన సౌకర్యాల ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని, అభ్యర్థి ప్రచారంతో సంబంధం లేకుండా చూడాలని సూచించారు. యాదవుల ఓట్లే లక్ష్యంగా చౌటుప్పల్‌లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ సభ ఆదివారం నిర్వహించనున్నారు.


ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు

ఉప ఎన్నిక బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించగా, ఈనెల 7న టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించింది. మరుసటి రోజే బీజేపీ తన అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉంటారని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్‌ పోటీలో ఉంటారని ఆ పార్టీ అధినేత కేఏపాల్‌ ఇప్పటికే ప్రకటించగా బీసీ సామాజికవర్గానికి చెందిన ఆందోజు శంకరాచారిని అభ్యర్థిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు.


కంకి, సుత్తి, కొడవలి, ఏనుగు గుర్తులను కొనుగోలు చేసిన కేసీఆర్‌ : రఘునందన్‌రావు

సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌ రూరల్‌, అక్టోబరు 8: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంకి, సుత్తి, కొడవలి గుర్తులతోపాటు ఏనుగు గుర్తును కూడా కొనుగోలు చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో శనివారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్త వీఎన్‌గౌడ్‌ తన అనుచరులతో బీజేపీలో చేరారు. వారికి రాజగోపాల్‌రెడ్డితో కలిసి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమ్యూనిస్టులను సూది, దబ్బడం అని తిట్టిన కేసీఆర్‌ వెనక కూర్చొని వారు పనిచేయడంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పశ్చిమబెంగాల్‌లో కరుడగట్టిన కామ్రేడ్లు కాషాయంవైపు వచ్చారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌ చెప్పే మాటలకు చేతలకు వ్యత్యాసం తెలిపేందుకే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. అసలు యుద్ధం దుబ్బాకతో మొదలైందని, హుజూరాబాద్‌ నుంచి మునుగోడుకు చేరుకుందన్నారు. ఒక్కో మంత్రి, ఎమ్మెల్యే సూట్‌కేసుల్లో డబ్బులు తెచ్చి ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దుబ్బాక గెలుపుతో తమ విలువ పెరిగిందని, ఈటల గెలుపుతో ప్రగతిభవన్‌ గేట్లు ఓపెన్‌ అయ్యాయని, మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే సీఎం కేసీఆర్‌ను పేరుపెట్టి పిలుస్తారనే భావనలో టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మంది వీఆర్‌ఏలు పస్తులుంటే సీఎం, ఇతర రాష్ట్రాల నేతలతో దసరా పండుగ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, దేశమంతా మునుగోడు వైపు చూస్తోందని, ఇక్కడి ప్రజలిచ్చే తీర్పుతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీ్‌పకుమార్‌, బీజేపీ నాయకులు దోనూరి వీరారెడ్డి, జక్కలి విక్రమ్‌, సూరపల్లి శివాజీ, బచ్చనగోని దేవేందర్‌, ముద్దంగుల నర్సింహ, అంతటి ధనరాజ్‌గౌడ్‌, భాస్కర నర్సింహ, ఆత్కూరి రాములు, తంగెళ్ల సత్తయ్య, కొన్‌రెడ్డి నర్సింహ, తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెంలో పలు పార్టీలకు చెందిన పలువురు రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రిక్కల సుధాకర్‌రెడ్డి, దూడల భిక్షంగౌడ్‌ పాల్గొన్నారు.


సీఎం కేసీఆర్‌పై పెరుగుతున్న విశ్వసనీయతకు చేరికలే నిదర్శనం : జగదీ్‌షరెడ్డి 

మర్రిగూడ, అక్టోబరు 8: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పెరుగుతున్న విశ్వసనీయతకు పార్టీలో చేరికలే నిదర్శనమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో శనివారం వివిధ పార్టీల నుంచి పలువురు టీఆర్‌ఎ్‌సలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్‌ఎ్‌సతోనే సాధ్యమని అన్నారు. మోదీ, అమిత్‌షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు నిలువరించలేరన్నారు. నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని  స్పష్టం చేశారు. సమావేశంలో లెంకలపల్లి సర్పంచ్‌ పాక నగేష్‌, మాజీ ఎంపీటీసీలు అయితగోని వెంకటయ్యగౌడ్‌, ఏర్పుల అంజయ్య, రామాచారి, నాయకులు  వరికుప్పల వెంకటయ్య, పరిపూర్ణాచారి, రవి పాల్గొన్నారు. 

సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కేంద్రం 

 వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రభుత్వం కావాలా... రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం కావాలా.. ప్రజలే నిర్ణయం తీసుకోవాలని వ్యయవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని భీమనపల్లి, కమ్మగూడెం గ్రామాల్లో శనివారం నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే కేంద్రప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మునగాల అంతిరెడ్డి, ఎంపీటీసీ చిలువేరు విష్ణు, నాయకులు పాల్గొన్నారు. 

బీజేపీ మునగడం ఖాయం : సత్యవతి రాథోడ్‌

 మునుగోడులో బీజేపీ మునగడం ఖాయమని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ జోస్యం చెప్పారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని పొర్లగడ్డతండా, రాధానగర్‌ తండాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీని స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు.  సమావేశంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి ప్రేమ్‌చందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రాజు, బిచ్యానాయక్‌, కాన్షీరాం పాల్గొన్నారు.

అవినీతిపరులు మోదీ, అమిత్‌షా : ప్రశాంత్‌రెడ్డి

ప్రపంచంలో అత్యంత అవినీతిపరులు మోదీ, అమిత్‌షాలు అని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. చౌటుప్పల్‌ మండలం దేవలమ్మనాగారం, దామోర, చింతలగూడెం గ్రామాల్లో శనివారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్‌ రాకుండా అడ్డుకోవడానికే మునుగోడు ఉప ఎన్నికను తెరపైకి తెచ్చారని, ఉప ఎన్నిక వెనుక పెద్దకుట్ర ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు కళ్లెం శ్రీనివా్‌సరెడ్డి, నారెడ్డి అండాలు పాల్గొన్నారు.

ఉప ఎన్నికతో రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టులు : గంగుల

మునుగోడు ఉప ఎన్నికతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు వచ్చాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సంస్థాన్‌నారాయణపురంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నిక పేరుతో రాజగోపాల్‌రెడ్డి రూ.22వేల కోట్ల కాంట్రాక్టును పొందారని అన్నారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌, మర్రి జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 



ఢిల్లీ పెద్దల కుట్రతోనే ఉప ఎన్నిక : తమ్మినేని

చౌటుప్పల్‌ రూరల్‌, అక్టోబరు 8: ఢిల్లీ పెద్దల కుట్రతోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోందని, రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నట్టు అభివృద్ధి కోసం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలో శనివారం జరిగిన సీపీఎం నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రవేశించాలనే కుట్రపూరిత ఆలోచనలతోనే బీజేపీ ఉప ఎన్నికను తీసుకువచ్చిందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను కాషయమయం చేసి, మతోన్మాద శక్తుల ద్వారా రావణకాష్టం చేయాలని బీజేపి చూస్తోందని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి ప్రమాదకార పార్టీలో చేరాడని, కమ్యునిస్టులను విమర్శిస్తే సహించేది లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. బీజేపీని ఓడించేందుకే టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇచ్చామని, బీఆర్‌ఎ్‌సకు కూడా మద్దతు ఇస్తామన్నారు. సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జహీంగీర్‌, నారి అయిలయ్య పాల్గొన్నారు. 



ప్రధాన పార్టీలు మోసం చేశాయి : ప్రవీణ్‌కుమార్‌

నాంపల్లి, అక్టోబరు 8: బహుజనులను ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మోసం చేశాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో 1967 నుంచి 2022 వరకు రెడ్డి, వెలమ సామాజికవర్గాల వారే ఎమ్మెల్యేలుగా గెలిచి పరిపాలన చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంపీటీసీలు, వార్డు సభ్యులుగా మాత్రమే పోటీచేసే అవకాశం ఇచ్చారని అన్నారు. బహుజనులు 63శాతం ఉన్నా ప్రభుత్వాలు అగ్రకులాలకేఇక్కడ అవకాశాలు కల్పించారన్నారు.  

బీఎస్పీ అభ్యర్థిగా శంకరాచారి: మునుగోడు బీఎస్పీ అభ్యర్థిగా అందోజు శంకరాచారిని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. మునుగోడుకు బీసీ అభ్యర్థిని నిలబెడతామని ఇచ్చిన మాట ప్రకారం శంకరాచారిని ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-09T05:23:27+05:30 IST